భలేగా ఉంటున్నాయి బాల్కనీలు

ఇల్లు, విల్లా అయితే ఇంట్లోంచి బయటకు వచ్చి ఎంచక్కగా గడపొచ్చు. మరి అపార్ట్‌మెంట్లలో?  ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలా.. అలా బయట నాలుగు అడుగులు వేద్దాం.. సేదదీరుదామని అనిపించినా కిందకు దిగి రావాలి.. లేదంటే టెర్రస్‌ పైకి చేరుకోవాలి.

Updated : 30 Mar 2024 01:23 IST

ఈనాడు - హైదరాబాద్‌

ల్లు, విల్లా అయితే ఇంట్లోంచి బయటకు వచ్చి ఎంచక్కగా గడపొచ్చు. మరి అపార్ట్‌మెంట్లలో?  ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలా.. అలా బయట నాలుగు అడుగులు వేద్దాం.. సేదదీరుదామని అనిపించినా కిందకు దిగి రావాలి.. లేదంటే టెర్రస్‌ పైకి చేరుకోవాలి. ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నాయి నిర్మాణసంస్థలు. బాల్కనీలను అంత విశాలంగా కడుతున్నాయి. ముఖ్యంగా ఆకాశహర్మ్యాల్లో బాల్కనీలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. వాటిలోకి అడుగు పెడితే ప్రపంచాన్ని చూసే ఆనందానుభూతి కలిగేలా నిర్మిస్తున్నారు. బృందావనాలకు ఆస్కారమిస్తున్నారు. ఊయలలో ఊగుతూ.. ప్రకృతితో మమేకం అయినట్టు బాల్కనీలను తీర్చిదిద్దుతున్నారు. ఆఖరుకు ఇంటి లోపల వరకే పరిమితమైన ఇంటీరియర్‌ను ఇప్పుడు బాల్కనీలకు కూడా వర్తింపజేస్తున్నారు. బాల్కనీ అంటే నాలుగు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా కాకుండా.. 100 చదరపు అడుగులు దాటిస్తున్నారు.

మారిన ఆలోచనలు

గతంలో అపార్ట్‌మెంట్‌లో బాల్కనీ ఒకటి ఉంటే చాలనుకునేవారు. వాటిని కూడా ఏవో ఉతికిన దుస్తులు ఆరేయడానికే అనేట్టు నిర్మించేవారు. ఇలా అవి పాత సామాన్లు పెట్టుకునే స్టోర్‌ రూమ్‌లలా మారిపోయాయి. భద్రత పేరుతో ఇనుప గ్రిల్స్‌ పెట్టి ప్రకృతిని చూసేందుకు అవకాశం లేకుండా చేసేవారు. ఇప్పుడు అభిరుచులు మారాయి.  ఇంటికి నలువైపులా బాల్కనీలుండేలా, ప్రతి గదిలోంచి బాల్కనీకి వెళ్లేలా  నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. బాల్కనీ అంటే ఎవరో ఒకరు వెళ్లి అక్కడ కూర్చుని వచ్చేయడం కాదు.. ఇంటిల్లిపాదీ అక్కడ కూర్చునేలా తీర్చిదిద్దుతున్నారు. ఉయ్యాలలో ఒక్కరు కాకుండా.. కనీసం ఇద్దరు కూర్చుని ఊగేలా బల్ల ఉయ్యాలలకు అనువుగా ఉంటున్నాయి. కుర్చీలు వేసుకుని కులాసాగా కబుర్లు చెప్పుకొనేలా.. రాత్రిపూట విందు, వినోదాలకు అనువుగా ఏర్పాటు చేస్తున్నారు.

అలంకరణకు పెద్దపీట

గతంలో ఇంటీరియర్‌ అంటే ఇంట్లో వరకే అనుకునేవారు. ఇప్పుడు బయటకు కనపడేది బాల్కనీ కాబట్టి.. ఇంటీరియర్‌ సొబగులు బాల్కనీకి ఉండేలా చూస్తున్నారు. తమ అభిరుచులను బట్టి మొక్కల దగ్గర్నుంచి రకరకాల థీమ్స్‌ డిజైన్‌ చేయించుకుంటున్నారు. ప్రత్యేకంగా వీటిని డిజైన్‌ చేసేవారు సైతం మార్కెట్లో ఉన్నారు. బాల్కనీలకు ఎక్కువగా గ్లాసులు ఉపయోగిస్తున్నారు. ఇంట్లోంచి, హాలులోంచి చూసినా బయట వాతావరణం కనిపించేలా వీటిని నిర్మిస్తున్నారు. ఇంట్లో ఉంటున్నా చుట్టూ బయటి ప్రపంచం కనిపించాలి. ప్రధాన ద్వారం మూసేసినా ఇంట్లో బందీ అయ్యామనే భావన రాకూడదు. ఎత్తు తక్కువైతే ప్రమాదమని భావించి పైన ఐరన్‌ రెయిలింగ్‌ ఇస్తున్నారు. జాతీయ భవన నిర్మాణ నిబంధనల ప్రకారం బాల్కనీ రెయిలింగ్‌ ఎత్తు ఒక మీటర్‌కంటే ఎక్కువ ఉండాలి.

పెరిగిన ప్రాధాన్యం

గదుల్లో మాస్టర్‌ బెడ్‌ రూం ఎలాగో.  అలా ఇప్పుడు సువిశాలమైన బాల్కనీ ఒకటి ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. దానికోసం 150 చదరపు అడుగులు దాటి వెళ్తున్నారు. అంతే కాదు బాల్కనీలో కొంత భాగం ల్యాండ్‌స్కేపింగ్‌కు ఉపయోగపడేలా నిర్మిస్తున్నారు. అక్కడ మొక్కలు పెంచుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం అడుగు ఎత్తు వరకు మట్టి నింపుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. నగరంలో పర్యావరణ గృహాల పేరిట అపార్టుమెంట్లలో 10 అడుగుల ఎత్తులో గుబురుగా పెరిగే మొక్కలను పెంచేందుకు అనువుగా నిర్మిస్తున్నారు. 2 వేల నుంచి 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో తయారవుతున్న ఫ్లాట్‌లలో 150 నుంచి 200ల చదరపు అడుగుల విస్తీర్ణంలో బాల్కనీ ఇస్తున్నారు. బాల్కనీ వైపు చెరువులు, పార్కులుంటే మరింత విశాలంగా నిర్మిస్తున్నారు. పై అంతస్తులకు వెళ్లే కొద్దీ బయట ప్రపంచం ఎక్కువగా కనిపించే విధంగా గేటెడ్‌ కమ్యూనిటీల్లో పెద్ద ఫ్లాట్లలో విశాలమైన బాల్కనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని