వాననీటిని ఒడిసిపట్టి.. వేసవి ఎద్దడికి చెక్‌ పెట్టి

నీటి కోసం ఎన్నిపాట్లు పడుతున్నారో చూస్తున్నాం... బోర్లలో తక్కువ నీరు వస్తుంటే వేసవి గడిచేదెలా? అని పలు కమ్యూనిటీలు ఆందోళన చెందుతున్నాయి. ఆకాశహార్మ్యాలు, జనసాంద్రత అధికంగా ఉన్న ఐటీ కారిడార్‌లో అయితే మరీనూ.

Updated : 06 Apr 2024 09:01 IST

నీటి కోసం ఎన్నిపాట్లు పడుతున్నారో చూస్తున్నాం... బోర్లలో తక్కువ నీరు వస్తుంటే వేసవి గడిచేదెలా? అని పలు కమ్యూనిటీలు ఆందోళన చెందుతున్నాయి. ఆకాశహార్మ్యాలు, జనసాంద్రత అధికంగా ఉన్న ఐటీ కారిడార్‌లో అయితే మరీనూ. అలాంటి ప్రాంతంలోనే ఉంటున్న ఒక టౌన్‌షిప్‌వాసుల్లో మాత్రం ఎలాంటి ఆందోళన కన్పించడం లేదు. వానాకాలంలో తమ ప్రాంగణంలోకి కురిసిన ప్రతి నీటిబొట్టునూ భూమిలోకి ఇంకించారు. బోర్లను రీఛార్జ్‌ చేసుకున్నారు. ఇప్పుడు ఎంచక్కా వాడుతున్నారు. 220 అడుగుల లోతు బోరు.. రోజుకి 2.50 లక్షల లీటర్ల నీరు.. 300 ఇళ్లు.. దాదాపు 650 కుటుంబాలకు నీటిని అందిస్తుంది. ఎంతటి వేసవిలోనూ ఈ బోరు నీరు ఆగలేదు. ఇది కేవలం ఇంకుడు గుంతల ఏర్పాటు ఫలితమేనంటున్నారు డోయన్స్‌ టౌన్‌షిప్‌ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు. అందరూ వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు.

సుజలాం-సుఫలాం స్ఫూర్తితో..

శేరిలింగంపల్లి పరిధిలోని డోయన్స్‌ టౌన్‌షిప్‌ కాలనీలోని 300 ఇళ్లల్లో ఉంటున్న కుటుంబాల కోసం కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నీటి సరఫరా కోసం బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతోపాటు జలమండలి నుంచి మంచినీరు సరఫరా ఉంది. వీరు ‘ఈనాడు’ ‘సుజలాం-సుఫలాం’ స్ఫూర్తితో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీలో పడిన వరదనీటిని బయటికి పోకుండా భూగర్భంలోకి చేరేలా పెద్దపెద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకున్నారు.

  • ముఖ్యంగా వర్షపు నీరు ప్రవహించే ప్రదేశాలు గుర్తించి, బోర్లున్నచోట ఇంకుడు గుంతలు నిర్మించారు. దీంతో వర్షపు నీరు ఇంకుడు గుంతలోకి భారీగా ఇంకుతుంది. ఈ క్రమంలో వీరు అన్ని బోర్లు వినియోగించాల్సిన అవసరం ఏర్పడలేదు. కేవలం కాలనీకి ఒకే ఒక బోరుని వినియోగిస్తున్నారు. దీని నుంచి వచ్చే నీరు కాలనీలోని 650 కుటుంబాలకు నీరు సరఫరా అవుతుంది. ఏనాడు బోరు నుంచి నీరు ఆగలేదు.
  • ఈ బోరు లోతు కేవలం 220 అడుగులు మాత్రమే ఉండటం విశేషం. వీరు ఏర్పాటు చేసుకున్న ఇంకుడు గుంతలు దాదాపుగా అన్ని పెద్దవిగానే ఏర్పాటుచేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకే విధంగా చేయడమే లక్ష్యం. 15 అడుగులు పొడవు 10 అడుగుల వెడల్పు, పది అడుగుల లోతుతో ఇంకుడు గుంతలు తయారు చేశారు. ప్రతి ఏటా వర్షాకాలం ఆరంభమయ్యే నాటికి ఇంకుడు గుంతలను శుభ్రం చేసి వర్షపు నీరు ఎక్కువ స్వీకరించే విధంగా సిద్ధం చేస్తారు. మధ్య మధ్యలో వర్షం నీటి వల్ల వచ్చే మట్టి వ్యర్థాలు ఇసుక వంటివి పేరుకు పోతే ఎప్పటికప్పుడు వాటిని బాగు చేయడం పనిగా పెట్టుకున్నారు.
  • ఇలా అనేక ఏళ్లుగా ఈ ప్రక్రియలు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కొనసాగిస్తున్నారు. వీరు పడిన శ్రమ కారణంగా ఇంకుడు గుంతలు కాలనీకి నీటి కొరత లేకుండా కాపాడుతున్నాయి. వీరు ఏనాడు నీటి ఎద్దడిని ఎదుర్కోలేదు.
  • ఇంకుడు గుంతల ప్రతిఫలం ఎలా ఉంటుందో స్వయంగా మేము చూస్తున్నామని కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు లింగారెడ్డి పేర్కొన్నారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ వాసులు వర్షపు నీటిని వృథాగా పోకుండా పూర్తిస్థాయిలో ఇంకుడు గుంతలపై దృష్టి సారించి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని కోరారు. ఇది ఒక నిరంతర ప్రక్రియలాË బాధ్యతగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని