ట్రెండీగా ఫాల్‌ సీలింగ్‌

ఇంటిని కొనుగోలు చేసిన వెంటనే ప్రస్తుతం మొదట గుర్తొచ్చేది ఫాల్‌ సీలింగ్‌. రేకులు, స్లాబ్‌ ఇళ్లతో పోలిస్తే ఫాల్‌ సీలింగ్‌ ఉన్నవి కొంత చల్లగా ఉంటాయి. ఈ క్రమంలోనే నగరంలో దీనిపై చాలామంది మక్కువ చూపుతున్నారు.

Published : 06 Apr 2024 02:25 IST

నగరంలో పెరుగుతున్న మక్కువ

దుండిగల్‌, న్యూస్‌టుడే: ఇంటిని కొనుగోలు చేసిన వెంటనే ప్రస్తుతం మొదట గుర్తొచ్చేది ఫాల్‌ సీలింగ్‌. రేకులు, స్లాబ్‌ ఇళ్లతో పోలిస్తే ఫాల్‌ సీలింగ్‌ ఉన్నవి కొంత చల్లగా ఉంటాయి. ఈ క్రమంలోనే నగరంలో దీనిపై చాలామంది మక్కువ చూపుతున్నారు. ఇది ఉంటే ఏసీ ఆన్‌ చేసిన కొద్దిసేపటికే గది చల్లబడుతుంది.  సరికొత్త డిజైన్లతో ఇంటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకూ ఈ సీలింగ్‌ దోహదపడుతోంది.. ఇందులో స్ట్రిప్‌, ప్రొఫైల్‌ లైట్లతో పాటు స్పాట్‌ లైట్లను వివిధ రకాల డిజైన్లలో అమర్చి మరిన్ని సొబగులు అద్దుతున్నారు.  కొత్తగా విల్లా లేదా అపార్ట్‌మెంట్‌ కొన్న వారు ఫాల్‌ సీలింగ్‌లో ఏది మంచిది,  ఎంత రేటు పడుతుంది అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా మూడు రకాలు పీవోపీ(ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌), జిప్సం, పీవీసీ అందుబాటులో ఉన్నాయి.

1. పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌).. : పీవోపీ షీట్స్‌ను మనుషులే తయారుచేస్తారు.  జిప్సం పౌడర్‌ను నీటిలో కలిపి రెండు పొరలుగా ఈ షీట్లను 3*6 కొలతలతో రూపొందిస్తారు.  బొమ్మలు, ఇతర డిజైన్‌లకు వీటిని వినియోగిస్తారు. చదరపు అడుగుకి రూ.40 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో పీవోపీ ఫాల్‌ సీలింగ్‌నే ఎక్కువగా వినియోగించేవారు.

2. జిప్సం షీట్లు: భూమి లోపల దొరికే జిప్సంకు పైభాగం, కింద భాగంలో పేపర్‌ను వినియోగించి..  ఈ షీట్లు తయారు చేస్తారు. యంత్రాలపై  4*6 కొలతలతో రూపొందిస్తారు. యంత్రాలపై తయారీతో ఎగుడుదిగుడుగా లేకుండా అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఫలితంగా ఈ సీలింగ్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. పైన కింద పేపర్‌ ఉండటంతో ఎక్కువ రోజులు చెక్కుచెదరకుండా ఉంటాయి. మన అభిరుచులకు అనుగుణంగా వీటిని డిజైన్‌ చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా చ.అడుగుకి రూ.65  ఖర్చవుతుంది. ప్రస్తుతం  ఎక్కువగా వీటినే వాడుతున్నారు.

3. పీవీసీ(పాలీ వినైల్‌ క్లోరైడ్‌) : నివాస, వాణిజ్య భవనాల పైకప్పుల్లో ఈ షీట్లను వినియోగిస్తున్నారు. ఇవి తేలికగానే కాకుండా ఎంతో దృఢంగా ఉంటాయి. తేమ ఉన్న ప్రాంతాల్లోనూ ఉపయోగించవచ్చు. దుమ్ము, బూజు వంటివి తొందరగా దరిచెరవు. ఎప్పటికప్పుడు తడి బట్టతో శుభ్రంగా తుడుచుకునే వెసులుబాటు ఉంటుంది. స్నానాల గదితో పాటు, బాల్కనీలోనూ వాడవచ్చు. పీవోపీ, జిప్సంతో పోలిస్తే తొందరగా అమర్చవచ్చు.  ప్రస్తుతం పీవీసీ బోర్డులు మూడు రకాలు అందుబాటులో ఉన్నాయి. హై క్వాలిటీ చ.అడుగుకి రూ.120 వరకు ఖర్చవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు