అంత ఎత్తున ఎలా ఉంటుందంటే..?

నగరంలో నేడు ఆకాశాన్నంటే భవనాల నిర్మాణం ఊపందుకుంది. 30కి పైగా అంతస్తులతో వందల భవనాలు నగరం, శివారు ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి చేసుకోగా వేలాది మంది నివసిస్తున్నారు.

Published : 13 Apr 2024 01:27 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: నగరంలో నేడు ఆకాశాన్నంటే భవనాల నిర్మాణం ఊపందుకుంది. 30కి పైగా అంతస్తులతో వందల భవనాలు నగరం, శివారు ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి చేసుకోగా వేలాది మంది నివసిస్తున్నారు. వాటిలో 20 నుంచి 30 అంతస్తుల్లో నివసించేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. అంత ఎత్తు భవనాల్లో నివసించడంలో సానుకూలతలతో పాటు ప్రతికూలతలూ ఉన్నట్లు నివాసితులు పేర్కొంటున్నారు. మేఘాలను తాకేంత ఎత్తులో ఉండే నిర్మాణంలో తగిన నియమ నిబంధనలు పాటించేలా  హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, కోకాపేట, నార్సింగి, తెల్లాపూర్‌తోపాటు పుప్పాలగూడ, మణికొండల్లో 30 అంతస్తులకుపైగా ఉన్న భవనాలు అనేకం వచ్చాయి. మణికొండ ల్యాంకోహిల్స్‌ అపార్ట్‌మెంట్స్‌ ఆకాశహర్మ్యాలకు నాంది పలికింది. ఎత్తయిన భవనాల్లో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు

ఆకాశహర్మ్యాల్లో 15వ అంతస్తు నుంచి ఐదేసి అంతస్తులకు ఒకటి చొప్పున ఫైర్‌ లాబీ ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఆ లాబీలు నివాసితులకు సురక్షితమైన ఆశ్రయం కల్పిస్తాయి. ఐదంతస్తులకు చెందిన కుటుంబాలు అక్కడికి చేరుకుంటాయి. భవనాలకు బయటి వైపు బాల్కనీలా ఆకాశానికి తెరిచి ఉండే ఆ లాబీల్లో పొగ, మంటలు చేరుకునే అవకాశం ఉండదు. అక్కడి నుంచి అగ్నిమాపక అధికారులు భారీ క్రేన్‌లతో బాధితులను రక్షిస్తారు. పొగ, మంటలు చేరకుండా ఫైర్‌ షాఫ్ట్‌లు ఉంటాయి. ప్రతి అంతస్తుకో షాఫ్ట్‌ ఉంటుంది. ప్రమాదాల వేళ ప్రత్యేక విద్యుత్తు వ్యవస్థతో అనుసంధానమైన ఆ షాఫ్ట్‌లో ఉండే లిఫ్ట్‌ ద్వారా కిందికి చేరుకోవచ్చు. ఈ తరహా ఏర్పాట్లు ల్యాంకోహిల్స్‌ వంటి పలు అపార్ట్‌మెంట్‌్్సలో ఉన్నాయి.

అలవాటైతే కింద ఉండలేం

అనంత్‌, బోయపల్లి, 28వ అంతస్తు, ల్యాంకోహిల్స్‌

ఇళ్లు ప్రశాంతతకు నిలయాలుగా ఉంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. పై అంతస్తుల్లో అదే విధంగా ఉంటుంది. 20వ అంతస్తు పైన నివసించే వారు దీనికి అలవాటు పడితే కింద ఉండలేరు. స్వచ్ఛమైన గాలి లభించడమేకాక, ఎలాంటి పొగ రాదు. వాహనాలు, ఇతర శబ్దాలు అసలే ఉండవు. పై నుంచి పరిసర ప్రాంతాల అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. దోమల బాధ, క్రిమికీటకాల బెడద ఉండదు. పదో అంతస్తు నుంచి 30 వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మిని ఆస్వాదించవచ్చు. ఐదంతస్తుల తర్వాత పైకి వెళ్లే కొద్దీ ప్రతి చదరపు అడుగుకు అదనంగా రూ.30 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆర్థిక భారం పడుతుంది. జనరేటర్‌లు పనిచేయక విద్యుత్‌ నిలిచి పోతే లిఫ్ట్‌ పనిచేయదు. అపుడు మెట్ల మార్గమే శరణ్యమవుతుంది. అలాంటి పరిస్థితులు ఎదురవడం అరుదే. బయటికి వెళ్లే, వచ్చే సమయాల్లో లిఫ్ట్‌ల కోసం అదనపు సమయం వేచి చూడాల్సి వస్తుంది. అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అగ్ని ప్రమాదాల నివారణ చర్యలుంటాయి. ఏదైనా బరువైన సామగ్రిని పైకి తరలించడం ఇబ్బందికరంగా ఉంటుంది.


సహజ వెలుతురు.. ఆరోగ్యం

శ్రీనివాస్‌రావు, 29వ అంతస్తు, ల్యాంకోహిల్స్‌

నలువైపుల నుంచి గాలి వస్తుంటుంది. వెంటిలేటర్‌ బాగా ఉంటుంది. అన్ని గదుల్లో సహజ వెలుతురు ఉంటుంది. ఫలితంగా విద్యుత్తు ఆదా అవుతుంది. తద్వారా విద్యుత్తు దీపాలతో వెలువడే వేడి నుంచి ఉపశమనం ఉంటుంది. వాహన, ఇతర వాతావరణ కాలుష్యాలకు దూరంగా ఉండి స్వచ్ఛమైన ప్రాణవాయువు పొందగలం. దుమ్ము ధూళి, పొగ వంటివి చేరవు. శబ్దకాలుష్యం తక్కువ. నిత్యం గాలి వీస్తుంటుంది. ఈ క్రమంలో ఫ్యాన్లు, ఏసీల వినియోగం తక్కువ. మొత్తానికి ఆ అంతస్తులో హెచ్‌ఎస్‌ఈ (హెల్త్‌, సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్‌) సమకూరుతాయి.ఎత్తయిన భవనాల్లో తక్కువస్థలంలో ఎక్కువ కుటుంబాలు నివసించే వీలుంటుంది. తద్వారా స్థల వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అగ్ని ప్రమాదాలు జరిగినపుడు అప్రమత్తం చేసే ఫైర్‌ అలారమ్స్‌ ఉంటాయి. మంటలు అంటుకున్నపుడు వెలువడే పొగను పసి గట్టే స్మోక్‌ డిటెక్టర్‌ వ్యవస్థలు ఉంటాయి. వృద్ధులు కుటుంబ సభ్యులు ఇంట్లోలేని సమయంలో ఒంటరిగా ఉంటామనే ఆందోళన అవసరం లేదు. బాల్కనీల్లోంచి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ గడపొచ్చు.  ఫ్లాట్‌లలో బాల్కనీ, లివింగ్‌ రూం, హాల్స్‌, బెడ్‌ రూమ్‌లతోపాటు అనువైన ప్రతిమూలా కుండీల్లో పూలు, అలంకార మొక్కలు పెంచుకుంటాం. ఫ్లాట్‌లోనే కొత్తిమీర, పాలకూర వంటివి పెంచి కిచెన్‌ గార్డెనింగ్‌ చేసుకుంటాం. ఇటీవల ఫ్లాట్‌లలోనే ప్రత్యేకంగా పచ్చదనం కోసం కొంత స్థలాన్ని కేటాయిస్తున్నారు. వాటిలో ల్యాండ్‌ స్కేప్‌తోపాటు కాస్త పెద్ద మొక్కలు పెంచుకునే వీలుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని