పుచ్చకాయలో మెచ్చు గుణాలు

ఎండ తాపం నుంచి కాపాడే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో వందకు పైగా రకాలున్నాయంటే అతిశయం కాదు. మన దగ్గర ఐదారు రకాలు మాత్రమే దొరుకుతాయి.

Updated : 19 May 2024 05:06 IST

ఎండ తాపం నుంచి కాపాడే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో వందకు పైగా రకాలున్నాయంటే అతిశయం కాదు. మన దగ్గర ఐదారు రకాలు మాత్రమే దొరుకుతాయి. జపాన్‌లో డబ్బాలా చతురస్రంలా ఉండేవాటిని కూడా సాగు చేస్తున్నారు. ఇంతకీ ఇందులో ఏమేం సుగుణాలు ఉన్నాయో, అవి మన ఆరోగ్యం మీద ఎలా ప్రభావం చూపిస్తాయో చూద్దాం. 

పుచ్చకాయలో ఎ, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పీచు, క్యాల్షియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం. శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. మంట, తాపాలను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న ఎ-విటమిన్‌ కంటిచూపును మెరుగుపరిస్తే, సి-విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఈ కాలంలో తరచుగా పుచ్చకాయ తినడం మంచిది. 92 శాతం నీటితో ఉన్న పుచ్చకాయ తినడం వల్ల గొంతు తడారిపోవడం, ఒంట్లో నీరు ఇంకిపోవడం, డీహైడ్రేషన్‌ లాంటి సమస్యలు తలెత్తవు. కండరాల నొప్పులను నిరోధిస్తుంది. ఇందులో చెడు కొలెస్ట్రాల్‌ బొత్తిగా ఉండదు. గుండె జబ్బులను రానీయదు. శరీరాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని పెరగనివ్వదు. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయ తినడం వల్ల ఆకలి తీరిన భావన కలుగుతుంది. ఇంకా ఇంకా తినాలనే తపన ఉండదు. ఈ కారణం వల్ల ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది శ్రేష్ఠం. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. కీళ్లనొప్పులు రావు. ఆశ్చర్యం ఏమిటంటే ఇది మానసిక ప్రశాంతతను చేకూర్చి మెరుగైన ఆలోచనలకు దారితీస్తుంది. ఇది కొంతవరకూ క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. సాధారణంగా లోపలి ఎర్రటి భాగాన్నే తింటాం కానీ పైనున్న చెక్కు కూడా చాలా మంచిది. ఇక పుచ్చ గింజల్లో గొప్ప పోషకాలుంటాయన్న సంగతి తెలిసిందే కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని