ఎండల్లో జూజూబ్‌ థండర్‌

ఎర్రెర్రగా.. చిన్నచిన్నగా.. ఉండే రేగుపండ్లు ఎంత ఆకర్షణీయమో అంత ఆరోగ్యదాయకం. వీటితో రోటి పచ్చడి నూరొచ్చు, ఊరగాయ పెట్టొచ్చు. వడలు, కేక్స్‌.. ఇలా నోరూరించే వంటకాలెన్నో చేయొచ్చు. వాటిల్లో కొన్ని మీ కోసం..

Published : 25 Feb 2024 00:02 IST

ఎర్రెర్రగా.. చిన్నచిన్నగా.. ఉండే రేగుపండ్లు ఎంత ఆకర్షణీయమో అంత ఆరోగ్యదాయకం. వీటితో రోటి పచ్చడి నూరొచ్చు, ఊరగాయ పెట్టొచ్చు. వడలు, కేక్స్‌.. ఇలా నోరూరించే వంటకాలెన్నో చేయొచ్చు. వాటిల్లో కొన్ని మీ కోసం..

జూజూబ్‌ థండర్‌

కావలసినవి: రేగుపండ్లు - కప్పు, పంచదార - పావు కప్పు, అల్లం - అంగుళం ముక్క, దాల్చినచెక్క - రెండు అంగుళాల ముక్క, నీళ్లు - 3 గ్లాసులు, ఐస్‌ క్యూబ్స్‌ - 6

తయారీ: పండ్లను కడిగి, తొడిమెలు, గింజలు తీసేసి, నీళ్లలో వేయాలి. అందులో చిన్న ముక్కలుగా కట్‌ చేసిన అల్లం, దాల్చినచెక్క వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత పంచదార వేసి.. బ్లెండ్‌ చేయాలి. గ్లాసుల్లో పోసి, ఐస్‌ క్యూబ్స్‌ జతచేసి.. ఆస్వాదించండి. ప్రత్యేకమైన రుచితో వహ్వా అనిపిస్తుంది.


స్వీట్‌ స్పైసీ పికిల్‌

కావలసినవి: రేగుపండ్లు - కప్పున్నర, బెల్లం - ముప్పావు కప్పు, ఆవనూనె - 4 చెంచాలు, జీలకర్ర, నల్ల జీలకర్ర (కలోంజీ), సోంపు, ఆవాలు - చెంచా చొప్పున, మెంతులు, వాము, కారం, ధనియాల పొడి - అర చెంచా చొప్పున, లవంగాలు - నాలుగైదు, మిరియాలు - ముప్పావు చెంచా, ఎండు మిరపకాయలు - 3, ఉప్పు - పావు చెంచా

తయారీ: రేగుపండ్లు కడిగి, తొడిమెలు తీసేసి, మూడు గంటలు ఎండబెట్టాలి. జీలకర్ర, సోంపు, మెంతులు, లవంగాలు, మిరియాలను సన్న సెగ మీద రెండు మూడు నిమిషాలు వేయించి, కచ్చాపచ్చా నూరాలి. బెల్లంలో మూడు చెంచాల నీళ్లు పోసి.. వేడిచేయాలి. కాస్త కరిగాక.. రేగుపండ్లు వేసి, కలియ తిప్పుతూ పాకం వాటికి పట్టిందనుకున్నాక దించాలి. కడాయిలో నూనె వేసి నల్ల జీలకర్ర, ఎండు మిరపకాయలు, నూరి సిద్ధంచేసిన దినుసుల పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి వేయించాలి. రెండు నిమిషాల తర్వాత పాకం పట్టిన రేగుపండ్లను వేసి కలియ తిప్పాలి. అంతే.. నోరూరించే ‘స్వీట్‌ స్పైసీ జూజూబ్‌ పికిల్‌’ రెడీ. చల్లారిన తర్వాత తడి లేని సీసాలో భద్రంచేసుకోవాలి.


మఫిన్స్‌

కావలసినవి: మైదాపిండి, రేగుపండ్లు - కప్పు చొప్పున, పంచదార - ముప్పావు కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - చెంచా, రిఫైండ్‌ ఆయిల్‌ - తగినంత, ఉప్పు - చిటికెడు, వెనీలా ఎసెన్స్‌ - ఒకటిన్నర చెంచా, వెన్న - అర కప్పు, యోగర్ట్‌ - పావు కప్పు

తయారీ: పండ్లు కడిగి, గింజలు తీసేయాలి. ఒక పాత్రలో మైదాపిండి, పంచదార, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపాలి. అందులో వెన్న, యోగర్ట్‌, గింజలు తీసిన రేగుపండ్లు వేసి విస్క్‌ సాయంతో అన్నీ పూర్తిగా కలిసేలా కలపాలి. మఫిన్‌ ట్రేని రిఫైండ్‌ ఆయిల్‌తో గ్రీజ్‌ చేసి.. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని సమంగా సర్దాలి. అవెన్‌ను ప్రీహీట్‌ చేసి.. 180 డిగ్రీల సెల్సియస్‌ వద్ద సుమారు 25 నిమిషాలు బేక్‌ చేస్తే సరిపోతుంది. వహ్వా అనిపించే  ‘జూజూబ్‌ మఫిన్స్‌’ తిని ఆనందించడమే తరువాయి.


వడియాలు

కావలసినవి: రేగుపండ్లు - అర కిలో, బెల్లం పొడి - పావు కప్పు, జీలకర్ర - 2 చెంచాలు, ఇంగువ - పావు చెంచా, పచ్చి మిరపకాయలు - 10, ఉప్పు - తగినంత, చింతపండు - నిమ్మకాయంత

తయారీ: పండ్లు కడిగి, గింజలు తీయకుండానే మిక్సీ జార్‌లో వేయాలి. వాటికి జీలకర్ర, పచ్చి మిరపకాయలు, ఇంగువ, ఉప్పు, చింత పండు, బెల్లం పొడి జతచేేసి గ్రైండ్‌ చేయాలి. మెత్తటి ఈ రేగుపండ్ల మిశ్రమాన్ని స్పూన్‌తో పాలిథిన్‌ కవర్‌ మీద వడియాలుగా వేసి ఎండలో ఆరబెట్టాలి. సాయంత్రం వాటిని తిరగేసి.. రెండోరోజు మళ్లీ ఎండబెట్టాలి. బాగా ఎండాయి అనుకున్నాక.. తడి లేని డబ్బాలో నిలవ చేసుకుంటే సరి.. నూనెలో వేయించనవసరం లేని రేగు వడియాలు సిద్ధం. ఇవి పులుపు, తీపి, కారం కలగలసిన రుచితో సూపర్‌గా ఉంటాయి.


పుడ్డింగ్‌ టార్ట్‌లెట్స్‌

కావలసినవి: రేగుపండ్లు - అర కిలో, పాలు - కప్పు, పంచదార - అర కప్పు, ఫ్రెష్‌ క్రీమ్‌ - 150 గ్రాములు, జాజికాయ పొడి - పావు చెంచా, బాదం పలుకులు - చారెడు, టార్ట్‌లెట్స్‌ కోసం: మైదాపిండి - కప్పు, వెన్న - పావు కప్పు, ఉప్పు - చిటికెడు

తయారీ: పండ్లు కడిగి, గింజలు తీసి.. ముక్కలుగా కోసుకోవాలి. కొన్ని ముక్కలు అలంకరించేందుకు ఉంచి, తక్కినవాటిని కప్పు నీళ్లతో పది నిమిషాలు ఉడికించాలి. మైదాపిండిలో వెన్న, కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి.. అరగంట ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ పిండిని నిమ్మకాయంత భాగాలుగా చేసి.. చిన్న మౌల్డ్‌లు చేసి.. అవెన్‌లో 180 డిగ్రీల వద్ద బేక్‌ చేయాలి. వాటిని తీసి చల్లారనివ్వాలి. ఈలోగా చల్లారిన రేగుపండ్ల గుజ్జును బ్లెండర్‌ జార్‌లో వేసి.. పాలు, పంచదార, ఫ్రెష్‌ క్రీమ్‌, జాజికాయ పొడి జతచేసి బాగా మెత్తగా అయ్యేలా బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని బేక్‌ చేసిన టార్ట్‌లెట్స్‌లో కొంత వెలితిగా వేయాలి. వాటి పైన క్రీమ్‌, రేగుపండ్ల ముక్కలతో గార్నిష్‌ చేసి, కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచండి. చల్లచల్లగా తిని ఆనందించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని