ఎండు దానిమ్మ ఎంతో శ్రేష్ఠం

ఈ కాలంలో మనల్ని తరచూ ఏవో అనారోగ్యాలు వేధిస్తుంటాయి. దానికి ప్రధాన కారణం రోగనిరోధక శక్తి తగ్గడం. అలా కాకూడదంటే సి-విటమిన్‌  ఎక్కువగా ఉండే ఆహారం తినాలి

Updated : 23 Jul 2023 02:19 IST

ఈ కాలంలో మనల్ని తరచూ ఏవో అనారోగ్యాలు వేధిస్తుంటాయి. దానికి ప్రధాన కారణం రోగనిరోధక శక్తి తగ్గడం. అలా కాకూడదంటే సి-విటమిన్‌  ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. అందులో దానిమ్మది మొదటి స్థానం. తీపికి కాస్త పులుపు జోడించినట్లుండే దానిమ్మ ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యకరం కూడా. అందుకే ఇవి దొరికే కాలంలో తాజా పండ్లు ఎటూ తింటాం. అన్‌సీజన్‌లోనూ ఎండు దానిమ్మ తినడం అలవాటు చేసుకోమంటున్నారు ఆహార నిపుణులు. పిస్తా, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌, అంజీరా తదితర డ్రై ఫ్రూట్స్‌కు మల్లేనే ఎండు దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. దానిమ్మలో సోడియం, కాపర్‌, పొటాషియం, మెగ్నీషియం, పీచు, ఐరన్‌, సి,కె,బి6 విటమిన్లు విస్తారంగా ఉంటాయి.

ఎండు దానిమ్మ గింజలు విడిగానూ తినొచ్చు. పెరుగు, సలాడ్స్‌ లోనూ వేసుకోవచ్చు. మొలకెత్తిన పెసలు, శనగల్లో పల్లీలు, మిరియాలపొడితో బాటు కొంచెం డ్రై అనార్‌ పౌడర్‌ వేస్తే ఆ రుచే వేరు. ఎండుద్రాక్ష కంటే కంటే ఎండు దానిమ్మ శ్రేష్ఠం. టొమాటో, బంగాళదుంప తదితర కూరల్లో ఎండు దానిమ్మ గింజల పొడి వేయడం వల్ల పోషకాలు అందడమే కాకుండా అదనపు రుచి తోడవుతుంది. రెండు కప్పుల నీళ్లలో చారెడు ఎండు దానిమ్మ గింజలు వేసి అరకప్పు అయ్యేదాకా ఉడికించి ఉదయాన్నే తాగితే అనేక ఆరోగ్య సమస్యలను అరికట్టినట్టే. ఈ గింజలకు ఒక చిన్న బీట్‌రూట్‌ కలిపి ఉడికించి గ్రైండ్‌ చేసి తాగితే హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది. ఎర్రరక్త కణాలు వృద్ధిచెందుతాయి. రక్తపోటు రాదు. ఎండు దానిమ్మలో ఎక్కువ విటమిన్లు, తక్కువ కాలరీలు ఉండటాన కొలెస్ట్రాల్‌ పెరగదు. గుండె సంబంధ వ్యాధులు రావు. రక్తలేమికి ఇది దివ్యౌషధం. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ తగ్గుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఊబకాయం రాదు. జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. వాంతులు, వికారం తగ్గుతాయి. ఎండు దానిమ్మ గింజల పొడిలో చిటికెడు మిరియాల పొడి కలిపి పళ్లు, చిగుళ్లకు మర్దనా చేస్తే పంటి సమస్యలు తలెత్తవు. దంతాలు దృఢంగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని