తియ్యతియ్యగా.. చల్లచల్లగా..

ఎండల్లో మనందరికీ చప్పున గుర్తొచ్చేది కూల్‌డ్రింక్‌. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కావని నిపుణులు చెబుతుండటం తెలిసిందే.

Published : 17 Mar 2024 00:02 IST

ఎండల్లో మనందరికీ చప్పున గుర్తొచ్చేది కూల్‌డ్రింక్‌. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కావని నిపుణులు చెబుతుండటం తెలిసిందే. అందువల్ల వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. నిజానికి శీతల పానీయాలు ఇంట్లోనే చేసుకోవచ్చు. వీటిల్లో ఏవైనా ప్రయత్నించి చూడండి.


యాపిల్‌

కావలసినవి: యాపిల్స్‌ - 18, పంచదార - పావు కిలో, దాల్చినచెక్క పొడి - పావు చెంచా
తయారీ: యాపిల్స్‌ను కడిగి, గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి. చెక్కు తీయనవసరం లేదు. అందులో అరలీటరు నీళ్లు పోసి.. సన్న సెగ మీద 20 నుంచి 25 నిమిషాలు ఉడికించాలి. ఈ రసాన్ని వడకట్టి, పంచదార, దాల్చినచెక్క జతచేసి మరో ఐదు నిమిషాలు తెర్లించాలి. చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి, తాగేటప్పుడు పల్చన చేసుకుంటే సరిపోతుంది.


నారింజ

కావలసినవి: నారింజపండ్లు - 20, పంచదార - మూడు కప్పులు
తయారీ: నారింజపండ్ల తొక్క, గింజలూ కూడా తీసేయాలి. తొనలను గ్రైండ్‌ చేసి.. రసాన్ని వడకట్టాలి. నాలుగు కప్పుల నీళ్లలో పంచదార వేసి మరిగించాలి. అందులో నారింజ రసం వేసి ఉడికించాలి. చిక్కగా అయ్యాక దించేసి చల్లారనివ్వాలి. దీన్ని గాలి చొరబడని సీసాలో పోసి ఫ్రిజ్‌లో భద్రపరచుకోవాలి. ఒక వంతు పానీయానికి రెండొంతులు నీళ్లు, రెండు మూడు ఐస్‌ క్యూబ్స్‌ జోడించి, చల్లని నారింజరసాన్ని ఆస్వాదించండి.


పుచ్చ

కావలసినవి: పుచ్చకాయ - ఒకటి, పంచదార - 2 కప్పులు, నిమ్మరసం - 2 స్పూన్లు, యాపిల్‌ గుజ్జు - అర కప్పు, రేగుపండ్లు - పావు కప్పు
తయారీ: పుచ్చకాయను సగానికి కోసి విత్తనాలు తీసేసి.. స్పూన్‌తో ఎర్రటి గుజ్జును తీయాలి. రేగుపండ్లు కడిగి, గింజలు తీసేయాలి. వీటికి యాపిల్‌ గుజ్జు చేర్చాలి. ఈ మూడు రకాల పండ్లనూ మందపాటి గిన్నెలో వేసి, మునిగే వరకూ నీళ్లు పోయాలి. అందులో పంచదార వేసి.. సన్న సెగ మీద సుమారు పావు గంటసేపు ఉడికించాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం కలిపి, ఫ్రిజ్‌లో భద్రం చేసుకోవాలి. ఒక వంతుకు మూడొంతుల నీళ్లు కలిపి తియ్యతియ్యగా ఆస్వాదించండి.


మామిడి

కావలసినవి: మామిడిపండ్లు పెద్దవి - 6, పంచదార - రెండు కప్పులు, నిమ్మరసం - రెండు చెంచాలు
తయారీ: మామిడిపండ్లు చెక్కు తీసి ముక్కలు కోసి, గ్రైండ్‌ చేయాలి. మందపాటి గిన్నెలో 4 కప్పుల నీళ్లు, పంచదార వేసి.. సన్నసెగ మీద తెర్లించి, దించేయాలి. చల్లారిన తర్వాత మామిడిపండ్ల గుజ్జు, నిమ్మరసం వేసి కలపాలి. ఈ చిక్కటి రసాన్ని శుభ్రమైన సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. గ్లాసులో ఒక వంతు పానీయానికి మూడొంతుల నీళ్లు
కలిపి తాగితే.. ఏ కూల్‌డ్రింకూ సాటిరాదనిపిస్తుంది.


ద్రాక్ష

కావలసినవి: గింజల్లేని నల్ల ద్రాక్షపండ్లు - 14 కప్పులు, పంచదార - కప్పున్నర
తయారీ: నల్ల ద్రాక్షపండ్లను కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి సన్న సెగ మీద సుమారు అర గంటసేపు ఉడికించాలి. చల్లారాక వడకట్టి, ఒక రోజంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటకు తీసి పంచదార కలిపి పది నిమిషాలు ఉడికించాలి. కాస్త చిక్కబడ్డాక దించేయాలి. చల్లారిన తర్వాత తడి లేని, గాలి చొరబడని సీసాల్లో నింపి.. ఫ్రిజ్‌లో ఉంచితే.. ఎప్పటికప్పుడు పల్చన చేసుకుని తాగొచ్చు.


మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జ్యూస్‌

కావలసినవి: సీడ్‌లెస్‌ ద్రాక్ష - కప్పు, స్ట్రాబెర్రీస్‌ - కప్పు, మామిడిపండ్లు - 4, కమలా తొనలు - 2 కప్పులు, కాబూలీ దానిమ్మ గింజలు - పావు కప్పు, పంచదార - కప్పు, నిమ్మరసం - 2 చెంచాలు
తయారీ: ద్రాక్ష పండ్లను కడిగి, శుభ్రం చేయాలి. మామిడిపండ్లు చెక్కు తీసి, ముక్కలు కోయాలి. స్ట్రాబెర్రీస్‌ తొడిమెలు తీసేసి, సగానికి కోయాలి. కమలా తొనలు రసం తీసి, వడకట్టాలి. అన్నింటినీ గ్రైండ్‌ చేసి, మందపాటి గిన్నెలో వేయాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోసి సన్న సెగ మీద ఉడికించాలి. అడుగంటకుండా మధ్యమధ్యలో కలియ తిప్పుతూ, అర గంట తర్వాత దించేయాలి. చల్లారాక.. పంచదార, నిమ్మరసం జతచేసి.. తడి లేని, గాలి చొరబడని సీసాలో పోసి, ఫ్రిజ్‌లో ఉంచాలి. ఒక వంతుకు మూడొంతులు నీళ్లు కలిపితే.. మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జ్యూస్‌ వహ్వా అనిపిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని