ఉగాది వేళ కోసాంబరీ తిందామా!

మన తెలుగువాళ్ల తొలి పండుగ ఉగాది. కొత్త సంవత్సరం రోజున ఎప్పటిలా పులిహోర, పరమాన్నం లాంటివి కాకుండా అపురూపం అనిపించే ఈ ప్రత్యేక వంటకాలు చేసి.. ఇంటిల్లిపాదీ ఆనందంగా ఆస్వాదించండి!

Updated : 07 Apr 2024 04:21 IST

మన తెలుగువాళ్ల తొలి పండుగ ఉగాది. కొత్త సంవత్సరం రోజున ఎప్పటిలా పులిహోర, పరమాన్నం లాంటివి కాకుండా అపురూపం అనిపించే ఈ ప్రత్యేక వంటకాలు చేసి.. ఇంటిల్లిపాదీ ఆనందంగా ఆస్వాదించండి!

 గోధుమ మిఠాయి

కావలసినవి: గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, పాలపొడి - కప్పు, నెయ్యి - టేబుల్‌స్పూన్‌, వేడి పాలు - ముప్పావు కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - అర చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా, పంచదార - 2 కప్పులు, యాలకులు - 3, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు - పావు కప్పు
తయారీ: వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, పాల పొడి, బేకింగ్‌ పౌడర్‌ వేసి, వేడి పాలతో కలపాలి. బాగా కలిపి, పిండి మెత్తగా అయ్యిందనుకున్నాక మందమైన చపాతీలా ఒత్తుకోవాలి. సీసా మూత సాయంతో చిన్న చిన్న వృత్తాల్లా కట్‌ చేయాలి. వీటిని కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో పంచదార, యాలకులు, రెండు కప్పుల నీళ్లు పోసి.. రెండు నిమిషాలు మరిగించి దించాలి. వేగిన సర్కిల్స్‌ను ఈ పాకంలో వేసి, రెండు గంటలు నాననివ్వాలి. వాటి మీద డ్రైఫ్రూట్స్‌ పలుకులు చల్లితే సరి.. రుచికరమైన గోధుమ మిఠాయి రెడీ.


కోసాంబరీ

కావలసినవి: పెసరపప్పు - పావు కప్పు, పచ్చిమిర్చి - 2, క్యారెట్‌ తురుము - అర కప్పు, నిమ్మరసం - అర చెంచా, కొబ్బరి తురుము - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - చెంచా, ఆవాలు, జీలకర్ర - అర చెంచా చొప్పున, ఎండుమిర్చి - 3, ఇంగువ - పావు చెంచా, కరివేపాకు - 2 రెబ్బలు, కొత్తిమీర తరుగు - చారెడు
తయారీ: ముందుగా పెసరపప్పును ఓ గంట నానబెట్టి, నీళ్లు వడకట్టేసి పక్కనుంచాలి. పచ్చి మిరపకాయలను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వెడల్పాటి పాత్రలో క్యారెట్‌, కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, వడకట్టిన పెసరపప్పు వేసి కలపాలి. కడాయిలో నూనె కాగనిచ్చి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువలను కాసేపు వేగనిచ్చి.. ఈ తాలింపును పెసరపప్పు మిశ్రమంలో వేసి కలపాలి. అందులో ఉప్పు, నిమ్మరసం కూడా వేసి, మరోసారి కలియ తిప్పితే సరి.. రుచికరమైన కోసాంబరీ ఆరగించవచ్చు.


పల్లీ అన్నం

కావలసినవి: అన్నం - 2 కప్పులు, తాజా కొబ్బరి తురుము - పావు కప్పు, పల్లీలు - 4 టేబుల్‌ స్పూన్లు, నూనె - 3 చెంచాలు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ఆవాలు - చెంచా చొప్పున, జీలకర్ర - అర చెంచా, ఎండుమిర్చి - రెండు, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - మూడు రెబ్బలు
తయారీ: అన్నం వండి పక్కనుంచాలి. కడాయిలో ఒక చెంచా నూనె, సగం పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి ఒక దాని తర్వాత ఒకటి చొప్పున వేసి.. సన్న సెగ మీద మంచి వాసన వచ్చేవరకూ వేయించాలి. తర్వాత కొబ్బరి తురుము వేసి కాసేపు వేగనిచ్చి దించేయాలి. అవి చల్లారాక, నీళ్లు వేయకుండా పొడి చేయాలి. అదే కడాయిలో రెండు చెంచాల నూనె, ఆవాలు, మిగిలిన పల్లీలు వేయాలి. ఆవాలు చిటపటలాడాక కరివేపాకు, అన్నం, నూరిన పల్లీల పొడి, ఉప్పు వేసి కలపాలి. అన్నానికి మసాలా పొడి పట్టే వరకూ సన్న సెగ మీద రెండు నిమిషాలుంచి దించేయాలి. అంతే.. ఘుమ ఘుమలాడే ‘పల్లీ అన్నం’ తయారైపోతుంది.


గసగసాల పాయసం

కావలసినవి: గసగసాలు - 3 టేబుల్‌ స్పూన్లు, బియ్యం - అర కప్పు, జీడిపప్పు, బాదం - పావు కప్పు, బెల్లం - ముప్పావు కప్పు, యాలకుల పొడి - పావు చెంచా, కొబ్బరి తురుము - కప్పు, నెయ్యి - 2 చెంచాలు, పిస్తా - 12, కిస్‌మిస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ: అన్నం వండి పక్కనుంచాలి. కడాయిలో గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పులను తక్కువ సెగ మీద వేయించాలి. దోరగా వేగాక దించి.. చల్లారాక మెత్తగా పొడి చేయాలి. పిస్తా, కిస్‌మిస్‌లను నేతిలో వేయించాలి. కొబ్బరి తురుమును అర కప్పు నీళ్లు పోసి గ్రైండ్‌ చేయాలి. ఒక మందపాటి గిన్నెలో కప్పున్నర నీళ్లు, బెల్లం వేసి రెండు నిమిషాలు మరిగించాలి. అందులో వండిన అన్నం, గసగసాల పొడి వేయాలి. ఐదు నిమిషాల తర్వాత వేయించిన పిస్తా, కిస్‌మిస్‌లు, యాలకుల పొడి, గ్రైండ్‌ చేసిన కొబ్బరి వేసి.. కలియ తిప్పాలి. ఇంకో రెండు నిమిషాలు సన్న సెగ మీద ఉంచి, దించేస్తే సరిపోతుంది. గరంగరంగా గసగసాల పాయసం తిని ఆనందించడమే తరువాయి.
- జె.కుమారి, విజయవాడ


అమురంత్‌ బాదం లడ్డూ

కావలసినవి: అమురంత్‌ గింజలు - 100 గ్రాములు, బెల్లంపాకం - కప్పు, జీడిపప్పు - పావు కప్పు, బాదంపప్పు - చారెడు, నెయ్యి - 2 చెంచాలు
తయారీ: కొన్ని నీళ్లతో బెల్లం మరిగించి పక్కనుంచాలి. అమురంత్‌ గింజలను వేయించాలి. అవి వేగాక.. వాటిని తీసి, నేతిలో జీడిపప్పు వేయించి పొడి చేయాలి. అదే కడాయిలో బాదంపప్పు వేయించాలి. ఒక వెడల్పయిన పాత్రలో అన్నిటినీ వేసి.. కలియ తిప్పి.. లడ్డూలుగా చుట్టుకుంటే సరిపోతుంది. ఈ అమురంత్‌ బాదం లడ్డూలు రుచిగానూ ఉంటాయి, ఆరోగ్యం కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని