వడియాల్లో ఎన్ని రకాలో..

కూర, చారు ఎంత కమ్మగా ఉన్నా.. కాసిని వడియాలు కూడా ఉంటే.. ఇక ఆ రుచి మామూలుగా ఉండదు. మినప్పిండి, బియ్యప్పిండి, సగ్గుబియ్యం, ఉప్మారవ్వ..

Updated : 14 Apr 2024 00:44 IST

కూర, చారు ఎంత కమ్మగా ఉన్నా.. కాసిని వడియాలు కూడా ఉంటే.. ఇక ఆ రుచి మామూలుగా ఉండదు. మినప్పిండి, బియ్యప్పిండి, సగ్గుబియ్యం, ఉప్మారవ్వ.. ఇలా వడియాల్లో బోలెడన్ని రకాలు. రొటీన్‌గా చేసే వాటితో పాటు ఈసారి కొంచెం ప్రత్యేకంగా ఉండేలా వీటిని ప్రయత్నించి చూడండి.


టొమాటోలు అటుకులతో

కావలసినవి: టొమాటోలు - అర కిలో, అటుకులు - మూడు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నువ్వులు - ఐదు చెంచాలు, జీలకర్ర - రెండు చెంచాలు
తయారీ: టొమాటోలను మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అందులో నువ్వులు, జీలకర్ర, ఉప్పు, అటుకులు వేసి అర గంట నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చెంచా చొప్పున తీసుకుంటూ.. ట్రేలో చిట్టి గారెలంత సైజులో పల్చటి వడియాలు వేసి.. ఎండబెట్టాలి. సాయంత్రం లోనికి తెచ్చి, రెండో రోజు కూడా ఎండబెట్టాలి. వీటిని తడి లేని డబ్బాలో నిలవ చేసుకుంటే సరి.


గోధుమ పాలతో

కావలసినవి: గోధుమలు - 4 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్ర - 2 చెంచాలు, పచ్చిమిర్చి ముద్ద - చెంచా, ఇంగువ - చిటికెడు
తయారీ: గోధుమలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మర్నాడు ఉదయం ఆ నీళ్లు తీసేసి.. కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసి, వడకట్టి గోధుమ పాలు తీయాలి. ఆ పిండిలో ఇంకొన్ని నీళ్లు పోసి మరోసారి వడకడితే ఇంకొన్ని పాలు వస్తాయి. ఈ పాలను మందపాటి పాత్రలో పోసి.. మరిగించాలి. అందులో పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, జీలకర్ర, ఇంగువలను వేయాలి. మధ్య మధ్యలో కలియ తిప్పుతూ ఉడికించి.. పాలు చిక్కబడిన తర్వాత దించేయాలి. చల్లారేసరికి ఇంకొంచెం గట్టిపడి, పిండిలా తయారవుతుంది. దీంతో పాలిథిన్‌ కాగితం మీద వడియాలు వేసి.. ఎండబెట్టాలి. పచ్చిగా అనిపిస్తే రెండోరోజు కూడా ఎండ బెట్టి, భద్రం చేసుకోవాలి. నూనెలో వేయించిన ఈ వడియాలు అన్నంలో నంజుకోవడానికే కాదు.. చిరుతిండిగానూ బాగుంటాయి.


రాగి పిండితో

కావలసినవి: రాగిపిండి - కప్పు, బియ్యప్పిండి - అర కప్పు, సగ్గుబియ్యం - పావు కప్పు, జీలకర్ర - చెంచా, అల్లం-మిర్చి ముద్ద - చెంచా, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - పావు చెంచా, శనగపప్పు - రెండు చెంచాలు
తయారీ: సగ్గుబియ్యం, శనగపప్పులను విడివిడిగా ఓ గంట నానబెట్టాలి. ఒక పాత్రలో రాగిపిండి, బియ్యప్పిండి, రెండు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. మరో పాత్రలో మూడు కప్పుల నీళ్లను మరిగించి.. అందులో జీలకర్ర, అల్లం-మిర్చి ముద్ద, ఉప్పు, ఇంగువ, పల్చగా కలిపిన రాగిపిండి మిశ్రమం, నానబెట్టిన సగ్గుబియ్యం, శనగపప్పులను వేసి సన్న సెగ మీద ఉడికించాలి. ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలియ తిప్పుతూ.. చిక్కబడ్డాక దించేయాలి. చల్లారిన తర్వాత పాలిథిన్‌ పేపర్‌ మీద పల్చగా వడియాలు పెట్టాలి. రెండు రోజులు ఎండబెట్టి.. నిలవ చేసుకుంటే చాలు. ఇవి రుచీ, ఆరోగ్యం కూడా.


జొన్న పిండితో

కావలసినవి: జొన్నపిండి - 2 కప్పులు, కారం - చెంచా, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - పావు చెంచా
తయారీ: జొన్నపిండిలో నాలుగు కప్పుల నీళ్లు, కారం, ఉప్పు, ఇంగువ వేసి కలపాలి. మరో పాత్రలో ఆరు కప్పుల నీళ్లను మరిగించాలి. అందులో జొన్నపిండి మిశ్రమం వేసి ఉడికించి, చిక్కబడిన తర్వాత దించేయాలి. చల్లారనిచ్చి.. ప్లాస్టిక్‌ కాగితం మీద చిన్న అప్పడాల్లా వేసుకుని ఎండలో ఉంచాలి. బాగా ఎండిన తర్వాత జొన్న వడియాలు సిద్ధంగా ఉంటాయి. కాగుతున్న నూనెలో వేయించి.. ఆస్వాదించడమే తరువాయి.


మరమరాలు బూడిద గుమ్మడితో

కావలసినవి: మరమరాలు - 10 కప్పులు, బూడిదగుమ్మడి కాయ తరుగు - కప్పు, సగ్గుబియ్యం - అర కప్పు, పచ్చిమిర్చి ముద్ద - చెంచా, ఇంగువ - పావు చెంచా, కొత్తిమీర తరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్ర - చెంచా
తయారీ: ముందుగా సగ్గుబియ్యం ఉడికించాలి. మరమరాల్లో కొన్ని నీళ్లు పోసి.. గుప్పెట్లోకి తీసుకుని అదిమి, నీళ్లను తీసేయాలి. ఒక వెడల్పాటి గిన్నెలో ఉడికించిన సగ్గుబియ్యం, బూడిదగుమ్మడి కాయ తరుగు, తడిపిన మరమరాలు, పచ్చిమిర్చి ముద్ద, ఇంగువ, కొత్తిమీర తరుగు, ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. ట్రేలో కొద్దిగా నూనె రాయాలి. అన్నీ కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని నిమ్మకాయంత చొప్పున అరచేతిలోకి తీసుకుని.. చిన్న అప్పాల్లా చేసి ట్రేలో ఉంచాలి. తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి. అన్నీ అయ్యాక ఎండబెట్టాలి. ఇవి పూర్తిగా ఎండటానికి మూడు రోజులు పడుతుంది. తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రం చేసుకుంటే.. ఇష్టమైనప్పుడు వేయించుకోవచ్చు. ఇవి మహా టేస్టీగా ఉంటాయి.


పాలకూర బియ్యప్పిండితో

కావలసినవి: బియ్యం - కప్పు, పాలకూర - 2 కట్టలు, నువ్వులు - 4 చెంచాలు, పచ్చిమిర్చి ముద్ద - చెంచా, జీలకర్ర - చెంచా, ఉప్పు - రుచికి తగినంత
తయారీ: బియ్యం కడిగి పక్కనుంచాలి. పాలకూరను కడిగి సన్నగా తరగాలి. ఒక పాత్రలో 3 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అందులో బియ్యం, పాలకూర తరుగు, మిర్చి ముద్ద, ఉప్పు వేసి కలియ తిప్పి, ఉడికించాలి. దగ్గరగా అయ్యాక జీలకర్ర, నువ్వులు వేసి కలిపి.. ఇంకో నిమిషం ఉంచి దించేయాలి. చల్లారాక.. ప్లాస్టిక్‌ కాగితం మీద చిన్న చిన్న అప్పాల్లా చేసి రెండు మూడు రోజులు ఎండబెట్టాలి. తినదలచుకున్నప్పుడు కాగుతున్న నూనెలో వేయించుకుంటే సరి.. పాలకూర-బియ్యప్పిండి వడియాలు చాలా రుచిగా ఉంటాయి.


‘మెజైరోకాఫోబియా’ ఫోబియా అంటే..

డుతూపాడుతూ ఇష్టంగా వంట చేసేవారి సంగతలా ఉంచితే.. కొందరికి వంట చేయడమంటేనే హడల్‌. అలా భయపడటాన్ని ‘మెజైరోకాఫోబియా’ అంటారు. ఈ ఫోబియా ఉన్నవాళ్లు వంట చేయకపోవడమే కాదు.. తమనెవరైనా వంట చేయమంటారేమో- అనే ఆలోచన వస్తే కూడా గాబరా పడతారట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని