మామిడి మాధుర్యం

మండుటెండల్లో మాధుర్యం పంచేది మామిడి పండే కదూ! ఈ తియ్యటి పండ్లతో ఎన్నెన్ని వంటలు చేయొచ్చో తెలుసా.. వేటికవే అమోఘంగా ఉంటాయి. మచ్చుకు వీటిని ప్రయత్నించి చూడండి. ఇంటిల్లిపాదీ ఆనందంగా ఆస్వాదించండి.

Published : 05 May 2024 00:26 IST

మండుటెండల్లో మాధుర్యం పంచేది మామిడి పండే కదూ! ఈ తియ్యటి పండ్లతో ఎన్నెన్ని వంటలు చేయొచ్చో తెలుసా.. వేటికవే అమోఘంగా ఉంటాయి. మచ్చుకు వీటిని ప్రయత్నించి చూడండి. ఇంటిల్లిపాదీ ఆనందంగా ఆస్వాదించండి.


మ్యాంగో వెనీలా పుడ్డింగ్‌

కావలసినవి: మామిడిపండ్ల గుజ్జు - రెండున్నర కప్పులు, క్రీమ్‌, చిక్కటి పాలు - కప్పు చొప్పున, పంచదార - అర కప్పు, చైనాగ్రాస్‌ - 2 చెంచాలు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - చెంచా, ఉప్పు - చిటికెడు, స్ట్రాబెర్రీస్‌ - అలంకరించేందుకు

తయారీ: ఒక పాత్రలో రెండు టేబుల్‌ స్పూన్ల వేడినీళ్లు, ఒక చెంచా చైనాగ్రాస్‌, మామిడిపండ్ల గుజ్జు వేసి కలిపి, రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈలోగా మిగిలిన చెంచా చైనాగ్రాస్‌ను పాలలో వేసి వేడి చేసి.. క్రీమ్‌, పంచదార, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, ఉప్పు జతచేసి కలపాలి. పంచదార పూర్తిగా కరిగాక దించి, పదినిమిషాలు చల్లారనివ్వాలి. ఈ క్రీమ్‌ కలిసిన పాలలో మామిడిపండ్ల గుజ్జు కలిపి.. మరో రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి.. స్ట్రాబెర్రీస్‌తో గార్నిష్‌ చేస్తే సరి.. చల్లచల్లటి ‘మ్యాంగో వెనీలా పుడ్డింగ్‌’ సిద్ధం.


మ్యాంగో ఫిర్నీ

కావలసినవి: మామిడిపండ్ల గుజ్జు - అర కప్పు, మామిడిపండు ముక్కలు - పావు కప్పు, చిక్కటి పాలు - లీటర్‌, నానబెట్టిన బియ్యం - టేబుల్‌ స్పూన్‌, పంచదార - ముప్పావు కప్పు, యాలకుల పొడి - అర చెంచా, బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండుకొబ్బరి పలుకులు - 3 చెంచాలు, కుంకుమ పువ్వు - పావు చెంచా

తయారీ: బియ్యం గంటసేపు నానబెట్టి, మెత్తగా దంచాలి. పాలు ఒక పొంగు వచ్చాక.. సెగ తగ్గించి మరిగించాలి. అందులో బియ్యప్పిండి, కుంకుమ పువ్వు వేసి.. అడుగంటకుండా కలియ తిప్పుతూ ఉడికించాలి. పది నుంచి పన్నెండు నిమిషాల తర్వాత.. పంచదార, యాలకుల పొడి, ఎండుకొబ్బరి, జీడిపప్పు, బాదం, పిస్తా  పలుకులు, మామిడిపండు ముక్కలు, మామిడిపండ్ల గుజ్జు ఒక దాని తర్వాత ఒకటి చొప్పున వేయాలి. దగ్గర పడిన తర్వాత దించేసి.. ఒక గంట ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే చల్లచల్లని ‘మ్యాంగో ఫిర్నీ’ రుచి ఆస్వాదించండి.


కేసరి

కావలసినవి: మామిడిపండ్ల ముక్కలు - 3 కప్పులు, పంచదార - అర కప్పు, నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్మారవ్వ - అర కప్పు, జీడిపప్పులు - 10, కిస్మిస్‌ - 16, బాదం, జీడిపప్పు పలుకులు - చెంచా, కుంకుమపువ్వు - చిటికెడు, యాలకుల పొడి - పావు చెంచా

తయారీ: కడాయిలో నెయ్యి వేసి.. ఉప్మారవ్వ, కిస్మిస్‌, జీడిపప్పులను వేయించాలి. అవి వేగాక.. కుంకుమపువ్వు వేసి కలియ తిప్పాలి. ఓ నిమిషం తర్వాత మామిడిపండ్ల ముక్కలు జతచేసి గరిటెతో చిదపాలి. అందులో కప్పున్నర నీళ్లు పోసి మూత పెట్టి.. సన్న సెగ మీద ఉడికించాలి. ఏడెనిమిది నిమిషాల తర్వాత.. పంచదార, యాలకుల పొడి జతచేయాలి. ఇంకో నిమిషం తర్వాత సెగ తీసేసి.. బాదం, జీడిపప్పు పలుకులు చల్లితే సరి.. నోరూరించే ‘మ్యాంగో కేసరి’ తయారైపోతుంది.


ఐస్‌క్రీమ్‌

కావలసినవి: చిక్కటి పాలు, మామిడిపండ్ల గుజ్జు, తాజా క్రీమ్‌, హోల్‌ మిల్క్‌ క్రీమ్‌ పౌడర్‌ - ప్రతిదీ కప్పు చొప్పున, పంచదార పొడి - అర కప్పు, పుదీనా ఆకులు - అలంకరించేందుకు

తయారీ: మామిడిపండ్ల గుజ్జు, పాలు, తాజా క్రీమ్‌, హోల్‌ మిల్క్‌ క్రీమ్‌ పౌడర్‌, పంచదార పొడి.. అన్నిటినీ మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని గట్టిగా మూత బిగించే వీలున్న ఐస్‌క్రీమ్‌ కంటెయినర్‌లోకి తీసి.. ఫ్రీజర్‌లో ఉంచాలి. రెండు మూడు గంటల తర్వాత బయటకు తీసి.. పుదీనా ఆకులతో గార్నిష్‌ చేస్తే సరి.. చల్లచల్లటి ‘మ్యాంగో ఐస్‌క్రీమ్‌’ రెడీ. చాలా సులువుగా తయారయ్యే ఈ రెసిపీ రుచిలో మాత్రం అమోఘం.


కలాకండ్‌

కావలసినవి: మ్యాంగో పల్ప్‌ - కప్పున్నర, పాలు - 5 కప్పులు, పంచదార - ముప్పావు కప్పు, యాలకుల పొడి - అర చెంచా, డ్రైఫ్రూట్స్‌ పలుకులు - 2 చెంచాలు, నెయ్యి - టేబుల్‌ స్పూన్‌

తయారీ: పాలను మధ్యమధ్యలో కలియబెడుతూ సగం అయ్యే వరకూ మరిగించాలి. అందులో మ్యాంగో పల్ప్‌, పంచదార, యాలకుల పొడి జతచేసి, కలియ తిప్పుతూ చిక్కబడనివ్వాలి. పళ్లెంలో నెయ్యి రాసి.. ఈ మిశ్రమాన్ని అందులో సమంగా సర్ది.. నచ్చిన ఆకృతిలో ముక్కలు కట్‌ చేసుకుంటే సరిపోతుంది. అంతే.. అద్భుతమైన ‘మ్యాంగో కలాకండ్‌’ తిని ఆనందించడమే తరువాయి.


మ్యాంగో చీజ్‌కేక్‌

కావలసినవి: మామిడిపండ్ల గుజ్జు - 2 కప్పులు, పంచదార - అర కప్పు, బిస్కెట్లు - 300 గ్రాములు, క్రీమ్‌ చీజ్‌ - 225 గ్రా, హెవీ క్రీమ్‌ - 200 గ్రా, తేనె - మూడు టేబుల్‌ స్పూన్లు, అగర్‌ అగర్‌ పొడి - మూడు చెంచాలు, వెన్న, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - చెంచా చొప్పున, దాల్చినచెక్క పొడి - పావు చెంచా

తయారీ: బిస్కెట్లను మెత్తగా దంచి, తేనె, దాల్చినచెక్క పొడి వేసి కలపాలి. ఎక్కువ లోతు లేని పాత్రను వెన్నతో గ్రీజ్‌ చేసి.. బిస్కెట్‌ మిశ్రమాన్ని సమంగా సర్దాలి. దీన్ని 20 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచితే.. మెత్తటి బేస్‌ లేయర్‌  సిద్ధమవుతుంది. అగర్‌ అగర్‌ పొడిని అర కప్పు నీళ్లలో వేసి పక్కనుంచాలి. ఒక మిక్సింగ్‌ బౌల్‌లో క్రీమ్‌ చీజ్‌, హెవీ క్రీమ్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, పంచదారలను ఫుడ్‌ప్రాసెసర్‌తో బాగా కలపాలి. ఒక మందపాటి గిన్నెలో అగర్‌ అగర్‌ కలిపిన నీళ్లు పోసి సన్న సెగ మీద వేడిచేసి.. చిక్కటి ద్రవంలా అయ్యాక దించాలి. చల్లారాక.. మామిడిపండ్ల గుజ్జులో కలిపి.. బిస్కెట్‌ లేయర్‌ మీద కొంత వేసి.. దాని మీద క్రీమ్‌, పంచదారల మిశ్రమం.. మళ్లీ మామిడిపండ్ల గుజ్జు చొప్పున సమంగా పరచుకునేలా వేయాలి. ఈ పాత్రను ఆరు గంటలు ఫ్రిజ్‌లో ఉంచితే ‘మ్యాంగో చీజ్‌ కేక్‌’  సిద్ధమైపోతుంది. ఇక చెప్పేదేముంది.. ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేలా ఊరిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని