ముంజలతో పసందైన వంటలు

ఈ కాలంలో మనల్ని సేదతీర్చేవాటిల్లో ముంజలు ముందుంటాయి. కొబ్బరిబొండంలో లేత కొబ్బరిలా మహా రుచిగా ఉండి.. మనసుకు నచ్చేస్తాయి. ఈ తియ్యటి ముంజలతో అనేక వంటలూ చేస్తారు

Updated : 19 May 2024 05:03 IST

ఈ కాలంలో మనల్ని సేదతీర్చేవాటిల్లో ముంజలు ముందుంటాయి. కొబ్బరిబొండంలో లేత కొబ్బరిలా మహా రుచిగా ఉండి.. మనసుకు నచ్చేస్తాయి. ఈ తియ్యటి ముంజలతో అనేక వంటలూ చేస్తారు. వాటిల్లో సులువైన ఈ రెసిపీలను ప్రయత్నించి చూడండి!


పొట్టు కుర్మా

కావలసినవి: తాటి ముంజల పొట్టు - అర కప్పు, ఉల్లి తరుగు, పెరుగు - కప్పు చొప్పున, టొమాటో ముక్కలు - ముప్పావు కప్పు, పసుపు - అర చెంచా, కారం - చెంచా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 3 చెంచాలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర - అర చెంచా చొప్పున, ఎండుమిర్చి - 2, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - 3 రెబ్బలు, కొత్తిమీర తరుగు - చారెడు

తయారీ: తాటి ముంజల పొట్టులో చిటికెడు పసుపు వేసి ఉడికించాలి. ఆరేడు నిమిషాలకు పొట్టు మెత్తబడుతుంది. దించేసి, ఆ నీళ్లను వడకట్టి, పక్కనుంచాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఒక్కొక్కటీ వేయాలి. అవి వేగాక.. ఉల్లి తరుగును దోరగా వేయించాలి. అందులో టొమాటో ముక్కలు వేసి సన్నసెగ మీద ఉడికించాలి. నాలుగు నిమిషాల తర్వాత ముంజల పొట్టు, కారం, పసుపు, ఉప్పు వేసి కలియ తిప్పాలి. ఇంకో నిమిషం తర్వాత పెరుగు, కొత్తిమీర తరుగు వేసి.. కొన్ని క్షణాలుంచి దించేస్తే సరిపోతుంది.


సలాడ్ 

కావలసినవి: లేత ముంజలు - 4, పుచ్చకాయ ముక్కలు - కప్పున్నర, యాపిల్‌ ముక్కలు - కప్పు, పుదీనా ఆకులు - చారెడు, నల్ల నువ్వులు - 2 చెంచాలు, కీరదోస ముక్కలు - అర కప్పు, మిరియాల పొడి - అర చెంచా, పంచదార - అర కప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ - అర చెంచా, నిమ్మరసం - చెంచా, పల్లీ లేదా నువ్వుల నూనె - చెంచా, ఉప్పు - రుచికి తగినంత

తయారీ: ముంజలు పొట్టు తీయాలి. వీటిని ముక్కలుగా కోయొచ్చు. లేదంటే అలాగే ఉంచవచ్చు. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో ముంజలు, నిమ్మరసం తప్ప మిగిలినవన్నీ వేసి.. కొన్ని నీళ్లతో సన్నసెగ మీద ఉడికించాలి. మగ్గిన తర్వాత దించేయాలి. చల్లారనిచ్చి.. ముంజలు, నిమ్మరసం కలిపి సలాడ్‌ను ఆస్వాదించండి.


కూర 

కావలసినవి: కొంచెం ముదురు ముంజలు - 15, కొబ్బరి తురుము - అర కప్పు, ఉల్లి తరుగు - ముప్పావు కప్పు, జీడిపప్పు - పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు - టేబుల్‌ స్పూన్, పసుపు - అర చెంచా, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, గరంమసాలా పొడి, గసగసాల పొడి - చెంచా చొప్పున, నూనె - 3 చెంచాలు, కొత్తిమీర తరుగు - చారెడు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర - అర చెంచా చొప్పున, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 3 రెబ్బలు

తయారీ: ముంజలు కడిగి, పొట్టు తీసి.. ఒక్కోదాన్ని ఆరు ముక్కలుగా చేసుకోవాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత.. తాలింపు దినుసులు వేయాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు.. ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి దోరగా వేగాక.. కప్పు నీళ్లు, కారం, పసుపు, ఉప్పు, గరంమసాలా పొడి, గసగసాల పొడి, ముంజల ముక్కలు అన్నీ వేసి.. మూత పెట్టాలి. రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలియ తిప్పుతుండాలి. లేదంటే అడుగంటుతుంది. పూర్తిగా ఉడకటానికి సుమారుగా పన్నెండు నిమిషాలు పడుతుంది. చివర్లో కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు వేసి కలిపి.. కొన్ని క్షణాలుంచి దించేయాలి. అంతే.. ఘుమఘుమలాడే ‘ముంజల కూర’ సిద్ధం.


పచ్చడి

కావలసినవి: కాస్త ముదురు ముంజలు - 6, టొమాటోలు - 3, చింతపండు - నిమ్మకాయంత, పచ్చిమిర్చి - 12, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర చెంచా, నూనె - 3 చెంచాలు, పల్లీలు - 2 చెంచాలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర - అర చెంచా చొప్పున, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు, ఇంగువ - పావు చెంచా

తయారీ: ముంజలు కడిగి, పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి. పల్లీలు వేయించాలి. చింతపండు కడిగి, నానబెట్టాలి. టొమాటోలు, పచ్చిమిరపకాయలను ముక్కలుగా తరగాలి. మందపాటి పాత్రలో రెండు చెంచాల నూనె, టొమాటో, పచ్చిమిరప ముక్కలు, పసుపు వేసి సన్నసెగ మీద ఉడికించాలి. చల్లారాక.. నానిన చింతపండు, వేయించిన పల్లీలు, ముంజల ముక్కలు, ఉప్పు జతచేసి నూరాలి. కడాయిలో మిగిలిన నూనె వేసి.. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువలతో తాలింపు వేసి.. పచ్చడిలో కలిపితే సరి.. వారెవా అనేస్తారంతా.


మిల్క్‌షేక్‌ 

కావలసినవి: లేత ముంజలు - 6, కాచి చల్లార్చిన పాలు - పావు, పంచదార - అర కప్పు, సబ్జా గింజలు - 2 చెంచాలు, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు చారెడు, యాలకుల పొడి - పావు చెంచా

తయారీ: ముందుగా ముంజలు కడిగి, పొట్టు తీసేయాలి. వాటిని మిక్సీ జార్‌లో వేసి.. పాలు, పంచదార, యాలకుల పొడి జతచేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అందులో సబ్జా గింజలు, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు వేసి కలిపితే సరి.. నోరూరించే ‘ముంజల మిల్క్‌షేక్‌’ రెడీ.


పాయసం 

కావలసినవి: లేత ముంజలు - ఆరు, కాచిన పాలు - రెండు కప్పులు, పంచదార - పావు కప్పు, జీడిపప్పు - 10, కిస్‌మిస్‌ - 12, నానబెట్టి పొట్టు తీసిన బాదంపప్పు - 10, యాలకులు - 3, కుంకుమ పువ్వు - పావు చెంచా, నెయ్యి - రెండు చెంచాలు

తయారీ: ముంజలు కడిగి, పొట్టు తీసి, ముక్కలుగా కోయాలి. కిస్‌మిస్, జీడి పప్పులను నేతిలో వేయించాలి. మిక్సీ జార్‌లో బాదంపప్పు, యాలకులు, కొన్ని పాలు వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ పేస్టును మిగిలిన పాలల్లో కలిపి.. సన్న సెగ మీద మరిగించాలి. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత పంచదార, కుంకుమ పువ్వు వేసి కలియ తిప్పాలి. ఇంకో మూడు నిమిషాల తర్వాత దించేయాలి. చల్లారాక వేయించిన కిస్‌మిస్, జీడిపప్పులు, ముంజల ముక్కలు వేసి కలపాలి. ఈ పాయసం ప్రత్యేకమైన రుచితో అందరికీ నచ్చేస్తుంది.


ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలో మాంసాహార వినియోగం తక్కువ. అంతమాత్రాన ఎక్కువమంది శాకాహారమే తింటారని కాదు. మొత్తం జనాభాలో 29 శాతం మాత్రమే శాకాహారులు. సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు, రొయ్యల వినియోగం ఎక్కువ కాగా.. ఇతర ప్రాంతాల్లో మేక, కోడి, గొర్రె మాంసం అధికంగా ఖర్చవుతోంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని