Lord Shiva: పరమేశ్వరుని దశావతారాల గురించి తెలుసా?

శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే శివుడు కూడా భిన్న సందర్భాలలో ప్రధానమైన పది అవతారాలను ధరించాడు. అవేంటో తెలుసుకోండి.

Published : 03 Apr 2023 09:28 IST

శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే శివుడు కూడా భిన్న సందర్భాలలో ప్రధానమైన పది అవతారాలను ధరించాడు. ఒక్కో అవతార సమయంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో ఆయన భార్యగా అవతరించింది. ఈ అవతారాల గురించి ప్రతిరోజూ ఉదయం మననం చేసుకున్న భక్తులకు శివుడు, శివాని సర్వశుభాలనూ చేకూరుస్తారని తెలియచేస్తుంది ఈ కథాసందర్భం. ఇది శివమహాపురాణంలోని శతరుద్రసంహిత పదిహేడో అధ్యాయంలో ఉన్న విషయం. శివభక్తులు తమ ధర్మాలను పాటిస్తూ శివదశావతారాల విశేషాలను విన్నా, చదివినా విశేషసుఖాలు లభిస్తాయి.

మహాకాలావతారంతో మొదలు

శివుడి పది అవతారాలలో మొదటిది మహాకాలావతారం. ఈ అవతారంలో శక్తి మహాకాలి (మహాకాళి)గా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది. మహాకాలుడు భుక్తిని, ముక్తిని కల్పిస్తాడు. శివుడి రెండో అవతారం తార్‌. ఈ అవతార సమయంలో శక్తి తారా అనే పేరున ఆ స్వామిని అనుసరించి ఉంటుంది. ఇద్దరూ తమ సేవకులకు భుక్తి, ముక్తులను ప్రసాదిస్తారు. మూడో అవతారం బాలభువనేశుడు. ఈ అవతారంలో శివుడి ఇల్లాలు పార్వతి బాలభువనేశ్వరి అనే పేరున ఆయనను అనుసరించి ఉంటుంది. అప్పుడా తల్లి తన భక్తులకు సుఖాలను ప్రసాదిస్తుంటుంది. శివుడి నాలుగో అవతారం పేరు షోడశశ్రీవిద్యేశుడు. ఈ అవతారంలో పార్వతి షోడశీశ్రీవిద్యాదేవిగా ఉంటుంది. ఈ దేవతల ఆరాధనతో భక్తులకు భుక్తి, ముక్తి, సుఖాలు లభిస్తాయి. అయిదో అవతారం పేరు భైరవుడు. అప్పుడు పార్వతీదేవి భైరవిగా ఉంటూ ఉపాసకులను, భక్తులను సర్వకాలాలలోనూ అనుగ్రహిస్తూ ఉంటుంది. శివుడి ఆరో అవతారమే చిన్నమస్తకుడు. అప్పుడు చిన్నమస్తకిగా పార్వతి అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ధూమవంతుడు అనేది శివుడి ఏడో అవతారం. ఈ అవతారం అప్పుడు పార్వతి ధూమావతి అనే పేరున ఉంటుంది. ఉపాసకుల కొంగుబంగారంగా ఈ అవతారంలో ఆదిదంపతులుంటారు. శివుడి ఎనిమిదో అవతారం పేరు బగలాముఖుడు. అప్పుడా తల్లి బగలాముఖీ, మహానంద అనే పేర్లతో ఉంటుంది. తొమ్మిదో అవతారం పేరు మాతంగుడు. ఈ అవతారంలో పార్వతీదేవి మాతంగిగా ఉంటుంది. కమలుడు అనే పేరున్న అవతారం శంభుడి పదో అవతారం. అప్పుడు పార్వతి కమల అనే పేరున ఉండి భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఈ పది అవతారాలు తమను ఆరాధించే భక్తులను వెన్నంటి ఉంటూ ఎంతో మేలును చేకూరుస్తుంటాయి.

తంత్ర శాస్త్రాలలో అవతార విశేషాలు

ఈ అవతారాలన్నీ విడిగా కన్నా తంత్రశాస్త్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ తంత్రశాస్త్రాలలో కనిపించే పార్వతీదేవి అవతారాలు తమ భక్తుల శత్రువులను సంహరించటం, దుష్టులను శిక్షించటం, నిత్యం బ్రహ్మవర్చస్సును పెంపొందిస్తూ ఉండటం చేస్తుంటాయి. మహాకాలాది శివదశావతారాలు శక్తితో కూడి ఉండి భక్తులను ఆదుకోవటం విశేషం. తంత్రశాస్త్రానుసారం ధూమావతి, బగలాముఖి లాంటి శక్తులన్నింటికీ విడివిడిగా మంత్రాలు, ఉపాసనా విధులు ఉన్నాయి. అవన్నీ సంపూర్ణంగా తెలిసినా, తెలియకపోయినా ప్రతిరోజూ ఉదయం వేళ ఈ దశావతారాలలోని శివశక్తులను స్మరించటం  పుణ్యప్రదమని శివపురాణం వివరిస్తోంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని