అరగొండ వీరాంజనేయస్వామి

ఏవైనా భయాలు పోవాలంటే... హనుమంతుడిని పూజించాలంటారు. కానీ సంజీవరాయ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఆ ఆలయంలో మాత్రం ఆంజనేయుడు అనారోగ్యాలను నయంచేసే ధన్వంతరిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అదే చిత్తూరు జిల్లాలో కొలువైన అరగొండ వీరాంజనేయస్వామి ఆలయం.

Updated : 19 Feb 2024 16:40 IST

ఏవైనా భయాలు పోవాలంటే... హనుమంతుడిని పూజించాలంటారు. కానీ సంజీవరాయ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఆ ఆలయంలో మాత్రం ఆంజనేయుడు అనారోగ్యాలను నయంచేసే ధన్వంతరిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అదే చిత్తూరు జిల్లాలో కొలువైన అరగొండ వీరాంజనేయస్వామి ఆలయం.

పచ్చని కొండల మధ్య కట్టిన ఆలయంలో ఉత్తర ముఖాన వెలసి... అనారోగ్యాలను నయడం చేయడమే కాదు, ఏ పని మొదలుపెట్టినా విజయం చేకూరుతుందని అభయమందిస్తూ, భక్తులకు దర్శనమిస్తాడు అర్ధగిరి వీరాంజనేస్వామి. ఇక్కడున్న తీర్థంలోని ఔషధ గుణాలున్న నీటిని తాగితే... అనారోగ్యాలు నయమవుతాయని అంటారు. అందుకే ఈ ఆలయాన్ని సంజీవరాయ క్షేత్రమని పిలుస్తారు. పౌర్ణమి రోజుల్లో విశేషంగా జరిగే పూజలూ, అందుకోసమే ప్రత్యేకంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులను చూసినప్పుడు ఓ జాతరలా అనిపించడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

స్థలపురాణం..

లంకలో ఉన్న సీతమ్మను విడిపించేందుకు శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రావణుడిపైన యుద్ధం ప్రకటిస్తాడు. ఆ సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు వల్ల లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అతడిని పరీక్షించిన సుషేనుడు అనే వానర వైద్యుడు లక్ష్మణుడు లేవాలంటే హిమాలయ పర్వతాలకు ఆవల ఉన్న సంజీవని మూలికను తీసుకురావాలని చెబుతాడు. అలా రామాజ్ఞతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతాన్ని చేరుకుంటాడు. ఎన్నోరకాల వనమూలికలతో ఉన్న పర్వతంపైన సంజీవని మూలికను గుర్తించలేక... ఏకంగా ఆ పర్వతాన్నే పెకలించి వాయువేగంతో లంకకు చేరుకుంటాడు. ఆ క్రమంలో సంజీవని కొండలోని సగభాగం విరిగి ఓ చోట పడిపోతుంది. అలా పడిపోయిన ప్రదేశమే ఇప్పటి అరగొండ. అందుకే ఈ ప్రాంతాన్ని అర్ధగిరి అని పిలుస్తారు. సంజీవని పర్వతంలోని సగభాగం అరగొండలో విరిగి పడటంతో అందులో ఉన్న సంజీవకరణి, విషల్యకరణి, సంధాన వంటి వనమూలికలు భూమిలో నిక్షిప్తమయ్యాయంటారు. కొండ విరిగి పడిన చోట నుంచి జలధార ఉబికి రావడం వల్ల సంజీవరాయ తీర్థం ఏర్పడిందని చెబుతారు. ఆ తీర్థంలోని నీటిలో ఔషధాలు, వనమూలికలు మిళితం కావడం వల్ల ఆ నీటికి అనారోగ్యాలు నయం చేసే శక్తి ఉందని అంటారు. అలాగే ఇక్కడి మట్టిని శరీరానికి పూసుకుంటే చర్మవ్యాధులు పోతాయనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ స్వామిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటూ కర్ణాటక, తమిళనాడు నుంచీ భక్తులు వస్తుంటారు. అనారోగ్యాల్ని నయం చేయడమే కాదు, విజయాలు అందించే స్వామిగానూ ఇక్కడ ఆంజనేయుడ్ని కొలవడానికీ మరో కథా ప్రచారంలో ఉంది. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. అందుకే స్వామిని ఉత్తర దిక్కున ప్రతిష్ఠిస్తే, ఆ స్వామిని కొలిస్తే సకల ఐశ్వర్యాలూ, విజయాలూ కలుగుతాయనే ఉద్దేశంతో సప్తర్షుల్లో ఒకరైన కశ్యప మహర్షి స్వామి విగ్రహాన్ని సంజీవరాయ తీర్థం పక్కన ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకునే భక్తులు ముందుగా ఇక్కడి స్వామిని దర్శించుకుంటారు.

ఉపాలయాలూ ఉన్నాయి..

ఈ ఆలయం చోళ రాజుల కాలం నుంచీ ఉన్నా అప్పట్లో చిన్న గోపురం మాత్రమే ఉండేదని... 2004 నుంచీ దీన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గర్భాలయాన్ని నిర్మించడంతోపాటూ పుష్కరిణి గోడల నిర్మాణం, భక్తులకు సకల సదుపాయాలు కల్పించడం వరకూ ఎన్నో ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి రోజున చంద్రకిరణాల ప్రభావం ఇక్కడి తీర్థంలో పడి... ఆ నీటి మహిమ మరింతగా పెరుగుతుందనీ అప్పుడా నీటిని తాగి స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్యం సొంతమవుతుందనీ నమ్మే భక్తులు ఈ ఆలయానికి తొమ్మిది పౌర్ణమిలు వస్తారని చెబుతారు ఆలయ నిర్వాహకులు. ఆ రోజున స్వామికి సుదర్శన హోమం, సాయంత్రం ప్రాకా రోత్సవం, ఆకుపూజ, వడమాల సేవతోపాటు ప్రత్యేక అభిషేకాలూ నిర్వహిస్తారు. ఇక్కడ స్వామితోపాటూ ఇతర ఉపాలయాల్లో కొలువైన వరసిద్ధి వినాయకుడు, శివుడు, అయ్యప్పను కూడా దర్శించుకోవచ్చు.

ఎలా చేరుకోవచ్చంటే..

ఈ ఆలయానికి వెళ్లాలంటే మొదట తిరుపతి లేదా చిత్తూరుకు చేరుకోవాలి. చిత్తూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్ధగిరిని చేరుకునేందుకు నేరుగా బస్సులున్నాయి. తిరుపతి నుంచి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.

- కొచ్చెర్ల మాల్యాద్రి, ఈనాడు చిత్తూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని