అంత భౌగోళిక పరిజ్ఞానం సుగ్రీవుడికి ఎలా వచ్చింది?

సీతమ్మ అన్వేషణలో నలుదిక్కులకు బయలుదేరిన వానరులకు సుగ్రీవుడు మార్గ నిర్దేశనం చేశాడు. అన్ని ప్రాంతాల విశేషాలను ఆయన వెల్లడించడం విశేషం. ఇంత భౌగోళికపరిజ్ఞానం ఎలా వచ్చిందని శ్రీరామచంద్రుడు అడగ్గా సుగ్రీవుడు  ఇలా వివరించాడు.

Published : 27 Mar 2023 09:32 IST

సీతాన్వేషణకు వెళ్లమని వానరసేన ప్రముఖులను సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఏయే దిక్కులలో ఏ విశేషాలున్నాయో అన్నీ విడమరచి చెప్పాడు. ఇంతటి గొప్ప జ్ఞానం సుగ్రీవుడికి ఎలా లభించిందా అని ఆశ్చర్య చకితుడయ్యాడు శ్రీరాముడు. అదే విషయాన్ని సుగ్రీవుడితో కూడా అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు అంతటి జ్ఞానం తనకు రావడానికి గల నేపథ్యాన్ని వివరించి చెప్పాడు. నదీనద, సాగర, గిరి, తటాక, కాంతార ప్రదేశాలన్నీ తాను ఊహించి చెప్పినవికావని, వాటన్నిటిలోనూ తాను గతంలో తిరిగానన్నాడు.

అన్న వాలి వెంటాడటంతో...

తన అన్న వాలి అకారణంగా తనను దేశ బహిష్కృతుడిని చేసి నిలువనీడ లేకుండా తరుముతున్న సమయంలో ఈ ప్రదేశాలన్నిటినీ తాను చూశానన్నాడు. అలాగే మాయావి అనే రాక్షసుడిని వాలి తరిమే వేళ ఆయనను అనుసరిస్తూ మరికొన్ని ప్రదేశాలను చూడగలిగానన్నాడు. అసలు కథంతా మాయావి దగ్గరే మలుపు తిరిగిందని చెప్పాడు సుగ్రీవుడు. ఓ రోజున మాయావిని తరుముతూ ఆ రాక్షసుడు దూరిన గుహలోకి వాలి కూడా దూరాడని, లోపలికి వెళ్లిన తన అన్న ఎన్నిరోజులకూ బయటకు రాకపోవడంవల్ల, లోపలి నుంచి గుహ ద్వారం దాకా రక్తం ప్రవహిస్తున్నందువల్ల మాయావి, అతడి బంధువులు అందరూ కలిసి వాలిని హతమార్చి ఉంటారని తాను అనుకుని మాయావి, వాడి బంధువులు కిష్కంధ పైకి రాకుండా ఉండేందుకు ఆ గుహ ద్వారాన్ని ఒక పెద్ద బండరాతితో మూసి ఇంటికి చేరానన్నాడు.

వాలి మరణవార్త విన్న మంత్రులంతా తాను వద్దంటున్నా రాజ్యభారాన్ని తనమీద పెట్టారని సుగ్రీవుడు చెప్పాడు. ఆ తరువాత ఓ రోజున వాలి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న తన దగ్గరకు వచ్చాడని, ఆయనకు నమస్కరించి జరిగిందంతా చెప్పి సింహాసనాన్ని అధిష్ఠించమన్నా వినకపోగా తనను జుట్టుపట్టుకుని కిందకు ఈడ్చి సంహరించబోయాడని, ఆయన నుంచి తప్పించుకోవడానికి అన్ని దిక్కులకూ వెళ్తూ, తలదాచుకుంటూ మళ్లీ తన ఉనికి వాలికి తెలియకుండా ఉండేందుకు ఎన్నెన్నో చోట్లకు తిరగాల్సి వచ్చిందని సుగ్రీవుడు శ్రీరాముడితో చెప్పాడు.

అలా అన్ని దిక్కులకు పరుగులు తీస్తూ...

అలా పరుగులు తీస్తూనే తూర్పుదిక్కుగా సముద్రం వరకూ వెళ్లానన్నాడు. అక్కడ వాలి వికటాట్టహాసం వినిపించగానే తూర్పు కొండవైపు పరుగు తీశానన్నాడు. ఉదయాన్నే ఎర్రని కాంతిపుంజాల వేగంతో వాలి తనను వెంబడించేవాడని అన్నాడు. తప్పించుకోవడానికి దక్షిణ దిక్కుకు పరుగెత్తి ఆ వైపున ఉన్న నాగదేవతలకు, పర్వతాలకు తనను రక్షించమని మొక్కి, అగస్త్యుడు తపస్సు చేసిన దివ్యప్రదేశాలను చూశానన్నాడు. మళ్లీ అంతలోనే వాలి వస్తుండడం కనిపించేదని తప్పించుకోవడానికి పరుగులు తీసి మేరుసావర్ణి దాకా పశ్చిమ దిశలో ప్రయాణం చేశానన్నాడు. అంత ప్రయాసపడి అక్కడకు చేరగానే తరుముకుంటూ వాలి వచ్చాడని, తత్తరపాటుతో ఉత్తర దిశకు పరుగుతీసి హిమగిరికి వెళ్లానని, అక్కడ వాలి పట్టుకోబోతే క్రౌంచగిరికి, అక్కడి నుంచి సోమగిరికి, ఇలా ఎన్నెన్నో చోట్లకు వాలి నుంచి తప్పించుకుని పరుగులు తీశానన్నాడు. 

అక్కడ వాలి అడుగుపెట్టలేడు..

చివరకు మాతంగ మహాముని శాపంవల్ల వాలి అడుగుపెట్టలేని రుష్యమూక పర్వతానికి చేరానని వెల్లడించాడు. కిష్కింధ కాండలోని ఈ కథా సందర్భంలో వాలి, సుగ్రీవుల గమనవేగం, శక్తి ఎలాంటివో అవగతమవుతుంది. తాను ఆనాడు వాలి వెంటాడుతున్నాడన్న భయంతో అన్ని ప్రాంతాలు చూశానని, అదే సీతాన్వేషణలో బాగా ఉపకరిస్తోందని అన్నాడు. ఏ దిక్కులో ఏయే ప్రదేశాలు, నదీనదాలు, అడవులు, విశేషాలు ఉన్నాయో తెలుసు కాబట్టి అవన్నీ ఆయా దిక్కులకు వెళ్లే వానర ప్రముఖులకు కళ్లకు కట్టినట్లు చెప్పగలిగానన్నాడు సుగ్రీవుడు. ఆ ప్రాంతాల విశేషాలు తెలుసుకున్న వానరులు అత్యంత సులభంగా ఆ ప్రదేశాలన్నిటినీ శోధించగలరని, దానివల్ల సీతాన్వేషణ సులభతరమవుతుందని రాముడికి చెప్పాడు సుగ్రీవుడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని