కొలనులో కొలువైన... చదువుల తల్లి!

ఏ ఆలయానికి వెళ్లినా... మూలవిరాట్టు విగ్రహాలన్నీ గర్భగుడిలోనే కొలువై భక్తుల పూజలు అందుకోవడం చూస్తుంటాం. కానీ కేరళ, కొట్టాయంలోని సరస్వతీ దేవి ఆలయంలో మాత్రం ఆ చదువుల తల్లి ఏడాది పొడవునా పచ్చని ప్రకృతి మధ్యే ఉండి దర్శనమిస్తుంటుంది. ఈ ఆలయంలో మరికొన్ని ప్రత్యేకతలూ ఉన్నాయి. అవేంటంటే...

Updated : 14 Mar 2023 16:50 IST

ఏ ఆలయానికి వెళ్లినా... మూలవిరాట్టు విగ్రహాలన్నీ గర్భగుడిలోనే కొలువై భక్తుల పూజలు అందుకోవడం చూస్తుంటాం. కానీ కేరళ, కొట్టాయంలోని సరస్వతీ దేవి ఆలయంలో మాత్రం ఆ చదువుల తల్లి ఏడాది పొడవునా పచ్చని ప్రకృతి మధ్యే ఉండి దర్శనమిస్తుంటుంది. ఈ ఆలయంలో మరికొన్ని ప్రత్యేకతలూ ఉన్నాయి. అవేంటంటే...

పచ్చని లతల మధ్య చిన్న కొలనులో కొలువైన సరస్వతీ దేవి, ఆ అమ్మను తాకేందుకు సంవత్సరమంతా అక్కడ ఊరే నీరు, దాదాపుగా అన్నిరోజులూ జరిగే అక్షరాభ్యాసాలూ... ఇలా కేరళ రాష్ట్రం కొట్టాయంలోని పనచ్చిక్కాడు గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయం ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. దక్షిణ మూకాంబికగా పిలిచే ఈ ఆలయాన్ని భక్తులు దేశం నలుమూలల నుంచీ వచ్చి దర్శించుకోవడం విశేషం. ముఖ్యంగా రచయితలూ, సంగీత నాట్య కళాకారులూ, చిత్రకారులూ అమ్మ అనుగ్రహం పొందేందుకు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఈ గుడికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతారు. పైగా మొదటి నుంచీ కిళపురం, కరునాట్టు, కైముక్కు అనే మూడు బ్రాహ్మణ కుటుంబాలు ఈ ఆలయ బాధ్యతల్ని చూడటం విశేషం.

స్థలపురాణం...

ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలసిందనడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు కిళప్పురం ఇల్లం నంబూద్రి అనే భక్తుడికి మగసంతానం కలగలేదట. కాశీకి వెళ్లి గంగలో స్నానం చేస్తే అబ్బాయి పుట్టొచ్చనే ఉద్దేశంతో తీర్థయాత్ర మొదలుపెట్టాడట. కాశీకి చేరుకునే క్రమంలో ఈ ఆలయానికి వచ్చాడట. ఈ ప్రాంతం నచ్చడంతో ఇక్కడే  ఏడాదిపాటు ఉండిపోయి... రోజూ పూజలు చేసేవాడట. ఆ సమయంలో ఓ రోజు అతడికి అమ్మవారు కలలో కనిపించి ఇక మగసంతానం కలగదనీ, అతడి ఊళ్లోనే ఓ స్త్రీ ఇద్దరు పిల్లల్ని కనబోతోందనీ, వారిలో ఒకరిని దత్తత తీసుకోమనీ చెప్పిందట. అమ్మ ఆజ్ఞను పాటించేందుకు ఆ భక్తుడు సొంతూరికి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడట. అలా వెళ్లేముందు ఓసారి ఆలయంలోని పుష్కరిణిలో స్నానం చేయాలనుకుని తన దగ్గరున్న తాటాకుల గొడుగును అక్కడున్న మెట్లపైన పెట్టాడట. ఆ తరువాత దాన్ని ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోవడంతో అప్పుడే అక్కడకు వచ్చిన ఓ స్వామిజీ ఆ గొడుగులో అమ్మవారి శక్తి ఉందనీ ఆ శక్తిని అక్కడి అడవిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి చేరవేయమనీ చెప్పాడట. అలా అమ్మవారిని గుర్తించి పూజలుచేసి వెళ్లిపోయాడా భక్తుడు. అప్పటినుంచీ అమ్మవారు అక్కడే కొలువై పూజలు అందుకుంటోందని చెబుతారు. ఆ తరువాత అమ్మవారి కోసం ఇక్కడి లోతట్టు ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు కొలనుగా మారింది. మొదట ఇక్కడ మహావిష్ణువును అర్చించాకే సరస్వతీ దేవికి పూజలు చేస్తారు. ఆ తరువాత వినాయకుడు, శివుడు, నటరాజ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. అమ్మవారు స్వయంభువుగా వెలసిన విగ్రహం పూర్తిగా సరస్వతీ ఆకుల లతలతో కప్పబడి ఉంటుంది. అందుకే ఆ పక్కనే మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. పేరుకే అది కొలను అయినా పుష్కలంగా నీరు ఉండదు. కానీ ఏడాది పొడవునా కొంత ఊరుతూ స్వయంభువు అయిన అమ్మవారి విగ్రహాన్ని తాకుతుంటాయి. వేసవిలోనూ ఆ తడి ఆరదని చెబుతారు.

ఏడాది పొడవునా...

ఇక్కడ దుర్గాష్టమి, మహార్నవమి రోజుల్లో తప్ప మిగిలిన ఏడాదంతా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. అమ్మవారికి నెయ్యి సమర్పించి దాన్ని భక్తులకు ఇస్తారు. నవరాత్రుల సమయంలో విద్యార్థులూ, రచయితలూ తమ పుస్తకాలను అమ్మవారి దగ్గర ఉంచి.. విజయదశమి రోజున తిరిగి తీసుకోవడం ఇక్కడ సంప్రదాయంగా పాటిస్తారు.

ఎలా చేరుకోవచ్చంటే...

కేరళలోని కొచ్చి విమానాశ్రయం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కొట్టాయం రైల్వేస్టేషన్‌ నుంచి పదకొండు కిలోమీటర్లు ప్రయాణిస్తే దీన్ని చేరుకోవచ్చు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు