Amrutha Ghatakeswar temple: తండ్రి అమృతఘటేశ్వరుడిగా... తల్లి అభిరామిగా

భక్తుల కోర్కెలు తీర్చే తమిళనాడులోని అమృతఘటేశ్వరుడు.. ఇంతకీ ఆయనకు ఆ పేరెలా వచ్చిందంటే..

Updated : 24 Apr 2023 10:07 IST

లోక రక్షణ కోసం పరమేశ్వరుడు ఎనిమిది మంది ప్రజాకంటకులైన రాక్షసులను వధించాడు. వీరిని సంహరించిన ప్రాంతాల్లోనే వీరాటనం అనే ఆలయాలను నిర్మించారు. వీటిలో ఒక ఆలయం తమిళనాడులోని తిరుకడవూర్‌లోని అమృతఘటేశ్వర్‌ అభిరామి ఆలయం. 

అమృతమే శివలింగంపై అభిషేకమైంది..

సాగర మథనం అనంతరం దేవతలు అమృతభాండాన్ని తీసుకువచ్చారు. అయితే తొలిప్రార్థన చేయాల్సిన వినాయకుడిని మరచిపోయారు. దీంతో గణేశుడు ఆ భాండాన్ని ఇక్కడకి తీసుకువచ్చి, శివలింగాన్ని ప్రతిష్ఠించి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ప్రార్థనలో భాగంగా కొంచెం అమృతాన్ని శివలింగంపై అభిషేకించారు. అనంతరం ఆ శివలింగం అంతటి అమృతంతో అభిషేకం కావడంతో అమృతఘటేశ్వరుడిగా శివుడు భక్తులకు దర్శనమిచ్చారు.

మార్కండేయుడి కోసం పరమేశ్వరుడే ప్రత్యక్షమై

లయకారకుడైన శివుడు భక్త దయాళువు. భక్తులు నిండు మనస్సుతో ప్రార్థిస్తే వెంటనే ప్రత్యక్షమవుతాడని నమ్మకం.  బాలుడైన మార్కండేయుడుకి శివునిపై అచంచల విశ్వాసముంది. బాలుడిగా ఉన్న సమయంలోనే మార్కండేయుడి ఆయష్షు తీరిపోవడంతో యమధర్మరాజు యమపాశాన్ని విసురుతాడు. మార్కండేయుడు అమృతఘట లింగాన్ని పట్టుకోగా శివుడు.. యమపాశాన్ని వేయవద్దని యముడిని ఆదేశిస్తాడు. అయితే యముడు తన మొండితనంతో పాశం విసరగా భక్తజనబాంధవుడు రౌద్రంగా మారి యముడిని పాదాలతో తొక్కిపెడతాడు. అనంతరం యముడి అభ్యర్థనతో వదిలివేస్తాడు. మార్కండేయుడిని చిరంజీవిగా జీవించాలని పార్వతీపతి వరాన్ని ఇస్తాడు. యమపాశాన్ని తప్పించినందుకు శివుడిని భక్తులు పూజిస్తారు.

చోళరాజుల వాస్తుశైలి

సువిశాల ఆలయప్రాంగణం చోళవాస్తురీతిలో నిర్మితమైఉంటుంది. 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయప్రాంగణంలో పలు గోపురాలు, మండపాలు, అనేక కళారీతులు కనువిందు చేస్తుంటాయి. సాధారణంగా ఆలయంలో ఒక పుష్కరిణి ఉంటుంది. ఇక్కడ మాత్రం పలు పుష్కరిణులు ఉండటం విశేషం. రాజరాజచోళ, కుళుత్తోంగచోళ పాలనా కాలంలో ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.

షష్టిపూర్తి వేడుకలకు ప్రసిద్ధి..

ఆలయంలో షష్టిపూర్తి వేడుకలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ వందలాదిమంది దంపతులు తమ షష్టిపూర్తి వేడుకలను ఇక్కడ జరుపుకొంటారు. పరమేశ్వరుడు అమృతఘటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తాడు. స్వామి ఆశీస్సులతో దీర్ఘయుష్షు కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఎలా చేరుకోవాలి?

ఈ దివ్యక్షేత్రం తమిళనాడు తీరప్రాంతంలో ఉంది. చెన్నై నుంచి దక్షిణంగా 300 కి.మీ.ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. కరైకాల్‌కు 15 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని