Lord Shiva: జంగమయ్యా.. నీ శిరమున చంద్రుడు ఎలా వచ్చెనయ్యా?

సమస్తజీవులకు ప్రాణసంకటంగా మారిన హాలహలాన్ని తన గొంతులో ఉంచుకొని విశ్వాన్ని సంరక్షిస్తున్న నిఠలాక్షుడు శిరమున చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలుసా?

Published : 21 Dec 2023 10:42 IST

పరమేశ్వరుడు పరమ దయాళువు. లోకకల్యాణం కోసం నిరంతరం శ్రమిస్తాడు. ఈ దిశలో ఎన్ని కష్టాలొచ్చినా విశ్వరక్షణకు ముందుకు సాగుతుంటాడు. సమస్తజీవులకు ప్రాణసంకటంగా మారిన హాలహలాన్ని తన గొంతులో ఉంచుకొని విశ్వాన్ని సంరక్షిస్తున్న నిటలాక్షుడు ఆ సాంబుడు.

పరమేశ్వరుని శిరస్సుపై చంద్రుడు ఉంటాడు. అయితే శశిని ఆ స్వామి ఎందుకు ధరించాడు అన్న అంశానికి సంబంధించి పురాణాల్లో సమగ్ర వివరాలు ఉన్నాయి. సముద్రాన్ని అమృతం కోసం దేవదానవులు మందర పర్వతాన్ని వాసుకితో మధిస్తుండగా పర్వతం సముద్రంలోకి కుంగిపోయింది. దీంతో సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే కూర్మ రూపంలో మందర పర్వతం కింద ఉండి కిందకు పోకుండా భరించాడు. ఈ ప్రక్రియలో ఐరావతము, శ్రీమహాలక్ష్మి, అప్సరసలు, నవనిధులు, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, పుష్పకం, పారిజాతం ఉద్భవించాయి. అమృతం కోసం వడివడిగా చిలుకగా హాలాహలం ఆవిర్భవించింది. భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న ఆ మంటలను దేవదానవులు భరించలేకపోయారు. బ్రహ్మాది దేవతలకు ఈ సమస్య పరిష్కారం కష్టమైంది. చివరకు బ్రహ్మ ఆ అనంతశయనుడికి విన్నవించారు. హరి సూచనతో బడబాగ్నిని చల్లార్చాలంటే ఆ పరమేశ్వరుడే శరణ్యమని ప్రార్థించారు. వారి వినతిని విన్న శివుడు ఆ హాలాహలాన్ని ముద్దలా చేసి మింగి గొంతులోనే ఉంచుకున్నాడు. 

కానీ హాలహలం వేడికి శివుని శరీరం నల్లగా మారుతోంది. దీన్ని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుని పిలిచి రుద్రుని జటాజూటములో ఉండమని కోరాడు. చంద్రుని కిరణాలు లేలేతగా ఉంటాయి. వేడిని తగ్గిస్తాయి. దీంతో చంద్రుడు శివుని కేశములపై తన శశికిరణాలను ప్రసరించాడు. అయినా వేడి తగ్గకపోవడంతో గంగను పిలిచి ఉమాపతి శిరస్సుపై ఉండి నిత్యం నీటి ప్రవాహముతో అభిషేకం చేయమనగా గంగ నాటి నుంచి నిత్యాభిషేకముతో ఆ జంగమయ్యకు ఉపశమనం కలిగిస్తోంది. అందుకనే శివునకు గంగాధరుడు, చంద్రశేఖరుడు అని పేర్లు వచ్చాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని