పాకిస్థాన్‌లో పెరుగుతున్న ‘శివుడు’

పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ట్రంలోని ఉమర్‌కోట్‌లోని శివమందిరం నిత్యం శంభో శంకర స్మరణతో మార్మొగుతుంటుంది. దేశవిభజనకు ముందు అవిభక్త భారత్‌లోని సింధ్‌రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్‌గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాదిమంది హిందువులు ఉండేవారు. దేశ విభజన అనంతరం మెజార్టీ హిందువులు భారత్‌కు విచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్‌ సమాజంలో భాగమయ్యారు.

Updated : 14 Mar 2023 15:54 IST

పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ట్రం ఉమర్‌కోట్‌లోని శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. దేశవిభజనకు ముందు అవిభక్త భారత్‌లోని సింధ్‌రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్‌గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాదిమంది హిందువులు ఉండేవారు. దేశ విభజన అనంతరం మెజార్టీ హిందువులు భారత్‌కు వచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్‌ సమాజంలో భాగమయ్యారు. ఇప్పటికీ పాక్‌లో వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్‌ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారింది. మొగల్‌పాలకుడు అక్బర్‌ అమర్‌కోట్‌లోనే జన్మించాడు.

రోజు రోజుకు పెరుగుతున్న శివలింగం

క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. కొందరు పశువుల కాపరులు తమ పశువులను ఇక్కడకు మేతకు తీసుకువచ్చేవారు. కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. దీంతో ఒక ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. దీంతో స్థానికులకు తెలపగా వారు పూజలు ప్రారంభించారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటిఉండటాన్ని గమనించవచ్చు.

శివరాత్రికి భక్త సందోహం

మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు.  శంభో శంకర నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. భక్తులకు తగినట్టుగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 

ఉమర్‌కోట్‌లో హిందువులే మెజార్టీ

పాక్‌లోని ఏ నగరానికి లేని విశిష్టత ఉమర్‌కోట్‌కు ఉంది. ఈ నగర జనాభాలో దాదాపు 80 శాతం వరకు హిందువులే కావడం గమనార్హం. మతపరమైన వైషమ్యాలు లేవని స్థానికులు చెబుతుంటారు.  అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివమందిరం ప్రధాన కేంద్రంగా ఉండటం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని