Updated : 14 Mar 2023 13:18 IST

Garbarakshambigai: జగన్మాత వెలిసిన క్షేత్రం-గర్భరక్షాంబిక ఆలయం, తిరుకరుకావుర్‌

​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

చెన్నై: మాతృమూర్తులు తొమ్మిదినెలలు కష్టనష్టాలను ఎదుర్కొని బిడ్డలకు జన్మనిస్తారు. మహిళామూర్తులకు సుఖ ప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాతే ‘గర్భరక్షాంబిక’ (Garbarakshambigai) అమ్మవారుగా భూమిపై అవతరించారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని తిరుకరుకావుర్‌లో వెలసిన మాత మహిమలు అనంతం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని మొక్కుకుంటే సుఖ ప్రసవం జరిగి తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉంటారన్న నమ్మకం వేల ఏళ్ల నుంచి ఉంది.

అమ్మవారి అభయంతో..

స్థలపురాణం ప్రకారం నిరుతవర్‌ అనే రుషి తన సతీమణి వేదికతో కలిసి వెన్నర్‌ నది పక్కన నివసించేవారు.  ఒక రోజు నిరుతవర్‌ లేని సమయంలో ఒర్తువపతర్‌ అనే రుషి భోజనం కోసం వచ్చాడు.  వేదిక గర్భవతిగా ఉండటంతో అతనికి ఆహారం తెచ్చేందుకు ఆలస్యమైంది. దీంతో అతను గర్భం ప్రాణాలతో ఉండదని శపించాడు. వేదిక అమ్మవారిని ప్రార్థించగా గర్భరక్షాంబిక (Garbarakshambigai) మాతగా ప్రత్యక్షమైన గర్భానికి ప్రాణం పోసింది. అనంతరం వేదిక ఒక బాలునికి జన్మనిచ్చింది. సాక్షాత్తు అమ్మవారు గర్భవతికి రక్షణగా రావడం, ప్రత్యక్షం కావడంతో ఈ స్థలం (Sri Garbarakshambigai Temple) పవిత్రమైనదిగా ప్రసిద్ధికెక్కింది. జగన్మాత గర్భరక్షాంబికగా పరమేశ్వరుడు ముల్లైవననాధర్‌గా భక్తులకు దర్శనమిస్తుంటారు.

ఆలయ నిర్మాతలు చోళులు..

చోళరాజులు రాజరాజ, రాజేంద్రచోళ, కులుత్తోంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించారు.  ఆలయచరిత్రకు సంబంధించిన 31 పురావస్తు ఆధారాలు ఆలయ చరిత్రను తెలుపుతున్నాయి. ఈ ఆలయం గురించి శైవ గ్రంథాలైన తెవరంలో వివరాలున్నాయి. 275 శైవక్షేత్రాల్లో ఇది ఒకటని తెలుస్తోంది. శైవ భక్తులైన అప్పార్‌, సుందరార్‌, సెలిక్కార్‌, ఉమాపతి గ్రంథాల్లో ఆలయ ప్రస్తావన ఉంది. పంచ అరణ్య స్థలాల్లో ఒకటిగా పురాణాలు పేర్కొంటున్నాయి. ముల్లైవనదనాథర్‌,  సాక్షి నాధర్‌, పాతాళీశ్వర్‌, ఆపద్‌సహాయేశ్వర్‌, విల్వనేశ్వర్‌ ఆలయాల్లో ఇది ఒకటి.

ఐదింటిని ఒక రోజులో దర్శిస్తే..

ఈ ఐదు ఆలయాలను ఒక రోజులోనే దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శైవ భక్తుడు తిరు జ్ఞాన సంబంధనార్‌ ఒకే రోజు ఆలయాలను సందర్శించినట్టు  గ్రంథాలు పేర్కొంటున్నాయి. తమిళంలో ముల్లై అంటే ఒక రకమైన మల్లెలు. మల్లెల వనంలో శివలింగం లభ్యం కావడంతో స్వామివారిని ముల్లై వన్‌ నాధర్‌గా పిలుస్తారు. ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి.

ఎలా చేరుకోవాలి..?

* తంజావూర్‌ జిల్లాలో ఉంది. కుంభకోణం చేరుకుంటే ఈ క్షేత్రం 20 కి.మీ. దూరంలో ఉంది. బస్సులు, ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

* రైలులో చేరుకోవాలంటే పాపనాశనం స్టేషన్‌లో దిగాలి. ఇక్కడ నుంచి ఆలయం 6 కి.మీ.దూరంలో ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు