Mahabharatam: ఉత్తర కుమారా.. ఆ రథాలపై ఉన్నవారు ఎవరంటే?

గోగ్రహణ సమయంలో తన సారథిగా ఉన్న ఉత్తర కుమారుడితో అర్జునుడు కౌరవయోధులను పరిచయం చేస్తాడు. ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, దుర్యోధనుడు, భీష్మ పితామహుల జెండాలను వివరిస్తాడు.

Updated : 18 Jan 2024 22:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: మహాభారతం పంచమవేదం. ఇందులో విరాటపర్వంలో కౌరవులు విరాటరాజు గోవులను అపహరిస్తారు. వాటిని విడిపించేందుకు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు గడువు ముగియడంతో కౌరవులతో యుద్ధానికి సిద్ధమవుతారు. ధర్మరాజు, విరాటరాజుతో కలిసి ఒక పక్కకు వెళ్లగా అదే సమయంలో మరో పక్క నుంచి గోవులను అపహరిస్తారు. పాండవులు అజ్ఞాత సమయంలో ఉన్నప్పుడే వారిని గుర్తించి తిరిగి అజ్ఞాతవాసానికి పంపించాలన్నది కౌరవుల కుయుక్తి. అయితే అప్పటికే అజ్ఞాతవాస గడువు ముగియడంతో దుర్యోధనుని పాచిక పారలేదు.

కౌరవయోధులను పరిచయం చేసిన అర్జునుడు

ఆ రోజుల్లో యోధులు తమ రథాల మీద ప్రత్యేకమైన పతాకాలను కలిగివుండేవారు. మహాభారత యుద్ధ సమయంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి అర్జున రథంపై ఉన్న కేతనంలో ఉంటారు. అందుకే కపిధ్వజంగా పిలుస్తారు. ఇక తన సారథిగా ఉన్న ఉత్తర కుమారుడితో అర్జునుడు కౌరవయోధులను పరిచయం చేస్తాడు. ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, దుర్యోధనుడు, భీష్మ పితామహులను వారి రథాలపై ఉన్న జెండాల గుర్తులను బట్టి పరిచయం చేస్తాడు. 

తిక్కన పద్యవిన్యాసం

మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో తిక్కన రెండోవారు. మహాభారతంలో సింహభాగాన్ని అనువదించారు. పద్య విన్యాసం తెలుగువారికే ప్రత్యేకమైన ప్రక్రియ. అందునా మకుటామయమైనది ఈ పద్యం. ఈ దీన్ని ఒక సారి పఠిద్దాం.

కాంచనమయ వేదికా కనత్కేతనో
జ్వల విభ్రమమువాడు కలశజుండు!

సింహలాంగూల భూషిత నభోభాగ కే 
తు ప్రేంఖణమువాడు ద్రోణసుతుడు!

కనకగోవృషసాంద్రకాంతిపరిస్ఫుట
ధ్వజసముల్లాసంబువాడు కృపుడు

లలితకంబు ప్రభాకలిత పతాకా వి  
హారంబువాడు రాధాత్మజుండు!

మణిమయోరగ రుచిజాల మహితమైన 
పడగవాడు కురుక్షితిపతి ,

మహోగ్రశిఖరఘన తాళతరువగు సిడమువాడు  
సురనదీసూనుడు.....డేర్పడ చూచికొనుము!

తాత్పర్యం: ఉత్తరకుమారా.. ఆ బంగారు వేదిక గుర్తుగా ఎగురుతున్న జెండా కలిగిన రథంపై ఉన్నవాడు ద్రోణుడు. పతాకంపై సింహం తోక కలిగిన రథంపై ఉన్న వాడు అశ్వత్థామ. కృపాచార్యుడు బంగారు ఆబోతు జెండా కలిగిన రథంపై ఉన్నాడు. ఆ రథంపై జెండా తెల్లని శంఖ కాంతులు ప్రసారిస్తోంది కదా.. ఆ రథంపై ఉన్నది కర్ణుడు. ఆ పక్కన ఉన్న రథంపై మణులు కలిగిన పాము జెండా ఉంది కదా.. ఆ రథంపై ఉన్నది దుర్యోధనుడు. ఇక తాటిచెట్టు జెండా ఉన్న రథంలో ఉన్నది భీష్మాచార్యులు. వీరిని గుర్తుపెట్టుకో.

ఇది అద్భుతమంటే..

ఇక్కడ జెండాను పలురకాలుగా తిక్కన అభివర్ణించారు. కనత్ కేతనం, కేతు, ధ్వజం, పతాకం, సిడము.. అని రాశారు. యుద్ధంలో ప్రతివీరులను గుర్తుంచుకునేందుకు కేతనమనేది కీలకం. దీన్ని ఇందులో ప్రస్తావించారు. జెండాను బట్టి ఆ రథంలో ఎవరు ఉన్నారన్న విషయం తెలుస్తుంది. తద్వారా సమవుజ్జీలతో పోరాటం ఉంటుంది. ద్రోణుడి రథంతో మొదలుబెట్టి భీష్మాచార్యుల రథంతో పరిచయాలు ముగించారు. అంటే తొలుత గురువునకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో తెలుస్తుంది. మరో రకంగా కౌరవసేనకు ద్రోణ, భీష్ములు పెద్దదిక్కులు. వీరి మధ్య దుర్యోధనుడు సురక్షితంగా ఉన్నాడన్న అంశం అవగతమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని