ఉత్తరాంధ్ర భద్రాద్రి.. రామతీర్థం

ఉత్తరాంధ్రలోని ప్రముఖ క్షేత్రం రామతీర్థం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది. రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. అందుకే శివరాత్రితో పాటూ కార్తికమాసంలోనూ ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడకు.....

Updated : 14 Mar 2023 16:10 IST

రామాలయాల్లో శ్రీరాముని పట్టాభిషేకం, సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతాయి. మహాశివరాత్రి, కార్తిక మాసం వచ్చిందంటే శివాలయాలు భక్తులతో కిక్కిరిస్తాయి. ధనుర్మాసంలో విష్ణు ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. ఆయా నెలల్లో ఆయా ఆలయాల్లో వేడుకలు నిర్వహిస్తుంటారు. కానీ, ఏడాది పొడవునా ఉత్సవాలతో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే క్షేత్రం రామతీర్థం. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలుచుకునే ఈ క్షేత్రంలో శివకేశవులను ఒకేచోట కొలవడం విశిష్టత.

ఉత్తరాంధ్రలోని ప్రముఖ క్షేత్రం రామతీర్థం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది. రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. అందుకే శివరాత్రితో పాటూ కార్తికమాసంలోనూ ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తుంటారని చెబుతారు ఆలయ నిర్వాహకులు. ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవూ 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు. రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవని అంటారు. ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్తే భీముని బుర్ర, గాడీ పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, పాండవుల పంచలు, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు చూడొచ్చు.

స్థలపురాణం...

ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. ఆ సమయంలో కృష్ణుడిని కూడా తమతో రమ్మని పాండవులు కోరితే.. సీతారామలక్ష్మణుల విగ్రహాలను వారికి అందజేసి తన బదులుగా పూజించమని చెప్పాడట. ఇక్కడి భీముని గృహం ఉండడం వారు సంచరించరనడానికి ఆనవాళ్లని చరిత్రకారులు చెబుతారు. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు రాముడు కలలో కనిపించి ద్వాపరయుగంలో పాండవులకు ఇచ్చిన విగ్రహాలు ఇక్కడి బోడికొండపైన ఉన్న నీటి మడుగులో ఉన్నట్లు చెప్పాడట. ఆ రాజు విగ్రహాలను వెలికితీయించి ఆలయం నిర్మించాడట. తీర్థంలో దొరికిన విగ్రహాలు కావడం వల్లే ఈ క్షేత్రానికి రామతీర్థం అనే పేరు వచ్చిందని, ఇది అతిపురాతనమైన దేవాలయంగానే కాక.. మరో భద్రాద్రిగానూ గుర్తింపు పొందిందనీ చరిత్ర చెబుతోంది. 1880 ప్రాంతంలో విశాఖపట్నం చరిత్రను రాసిన కార్మైకల్‌ దొర ఈ క్షేత్రం గురించి అందులో ప్రస్తావించడం విశేషం.

ఉపాలయాలు.. బౌద్ధ, జైన ఆనవాళ్లు

ఈ ప్రాంతంలో జైనులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడి కొండల్లోని గురుభక్తకొండ, దుర్గకొండ అనే కొండలపై ప్రాచీనమైన బౌద్ధాలయాలు ఉన్నట్టుగా, వాటికి చారిత్రక ప్రాధాన్యం ఉందని చరిత్రకారులు పేర్కొన్నారు. దీనికి ఉత్తరాన నీలాచలం, పశ్చిమాన జైన మందిరం ఉంది. ఇక్కడ ఉండే ఇతర ఉపాలయాల్లో వైకుంఠనాథస్వామి, వేణుగోపాలస్వామి, లక్ష్మీదేవి, మాధవస్వామి, వరాహాలక్ష్మి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, ఆళ్వారుల సన్నిధి, ఉమా సదాశివస్వామిలను దర్శించుకోవచ్చు. సీతారామ లక్ష్మణులు రామతీర్థం ప్రాంతంలో కొంతకాలం గడిపారనడానికి  నిదర్శనంగా శ్రీరాముని పాద ముద్రికలు, ఆంజనేయస్వామి అడుగులు ఈ కొండపై ఇప్పటికీ కనిపిస్తాయి. అలాగే, రామతీర్థం చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గృహాన్ని కూడా సందర్శించొచ్చు.

పర్వదినాల్లో నేత్రానందమే..

రామతీర్థంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మాఘశుద్ధ ఏకాదశి రోజున రాముడికి కల్యాణం నిర్వహించి పౌర్ణమి వరకూ ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను రోజుకొక వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు. స్వామి కల్యాణానికి పుట్టు మూగి వంశస్థులు ఆడపెళ్లివారి తరఫున సీతమ్మకు మెట్టెలు, మంగళసూత్రాలతో పాటు ఇతర వివాహ సామగ్రిని తీసుకొస్తారు. ఇందుకోసం పూసపాటిరేగ మండలం కుమిలి నుంచి కాలినడకన ఇక్కడకు చేరుకుంటారు. అలాగే పూసపాటి వంశీయులు మగపెళ్లివారి తరఫున పాల్గొంటారు. దసరా సమయంలో పదిరోజుల పాటు వెంకటేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. విజయదశమి నాడు స్వామి ఆశ్వవాహనంపైన నీలాచలం వద్దకు చేరి జమ్మి వృక్ష పూజ, ఆయుధ పూజ నిర్వహించడం కన్నుల పండువగా ఉంటుంది. ఈ ఆలయంలో ఏడాదికోసారి జ్యేష్ఠాభిషేకాలూ నిర్వహించి, స్వామికి సహస్ర ఘటాభిషేకం చేస్తారు. ఆ రోజున రాముడి నిజరూపాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. ధనుర్మాసంలోనూ నెలరోజులు విశేష పూజలు జరుగుతాయి. ఇవన్నీ కాకుండా.. రామతీర్థాన్ని శివక్షేత్రంగానూ భావించే భక్తులు మహాశివరాత్రి రోజున ఇక్కడ వైభవంగా జరిగే జాతరను చూసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి చేరుకుంటారు. అదేవిధంగా కార్తికమాసంలోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా కార్తికశుద్ధ ద్వాదశినాడు రామకోనేరులో సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను పుష్పాలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపైన ఊరేగించి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఎలా చేరుకోవచ్చంటే..

విజయనగరం జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది రామతీర్థం. రైళ్లలో వచ్చేవారు విజయనగరం రైల్వేస్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలు, బస్సుల్లో రామతీర్థం చేరుకోవచ్చు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి జాతీయ రహదారిపై వచ్చేవారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో దిగాల్సి ఉంటుంది.  అక్కడి నుంచి బస్సులు తిరుగుతాయి. నెల్లిమర్లలో రామతీర్థం కూడలి నుంచి ఈ ఆలయాన్ని సులువుగా చేరుకోవచ్చు. విమానాల్లో వచ్చేవారు విశాఖలో దిగి అక్కడి నుంచి విజయనగరం చేరుకోవాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని