Fashion: సంప్రదాయ సింగారాలు

ఆధునికంగా కనిపించాలంటే కుర్రాళ్లకు ఆప్షన్లు చాలానే ఉంటాయి. పండగలు, పెళ్లిళ్లలాంటి సందర్భాల్లో సంప్రదాయంగా కనిపించాలంటేనే వస్తుంది చిక్కంతా.

Published : 29 Apr 2023 00:07 IST

ఆధునికంగా కనిపించాలంటే కుర్రాళ్లకు ఆప్షన్లు చాలానే ఉంటాయి. పండగలు, పెళ్లిళ్లలాంటి సందర్భాల్లో సంప్రదాయంగా కనిపించాలంటేనే వస్తుంది చిక్కంతా. అలా అనుకునేవాళ్లు వార్డ్‌రోబ్‌ని వీటితో నింపేయొచ్చు. రాబోయే పెళ్లిళ్లు, ఉత్సవాల సీజన్‌కి ముందే సిద్ధం కావొచ్చు.

కుర్తా చుడీదార్‌: ట్రెడిషనల్‌ అనగానే అబ్బాయిలకు గుర్తొచ్చేవి ఇవే. ఇందులో చైనీస్‌ కాలర్‌, కాలర్‌లెస్‌వి ఇప్పుడు పాపులర్‌. మోకాళ్ల కిందికి దిగిన కుర్తా అయితే కుర్రాళ్లకు మరింత సంప్రదాయంగా ఉంటుంది. సీజన్‌ని బట్టి కాటన్‌, సిల్క్‌, లెనిన్‌.. ఫ్యాబ్రిక్‌లను ఎంచుకోవచ్చు.

ధోతీ ప్యాంట్లు: ఇది రెడీవేర్‌ ఔట్‌ఫిట్‌. పైన కుర్తా ధరించి కింద ట్రౌజర్‌కి బదులు ఈ ధోతీ ప్యాంట్‌ని వేసుకోవచ్చు. ఇందులో సిల్క్‌, శాటిన్‌ ఫ్యాబ్రిక్‌ ఆకర్షణీయంగా ఉంటాయి.

ముండు/కేరళ ధోతీ: దక్షిణాది సంప్రదాయం ఉట్టిపడాలంటే దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ ధోతీని లుంగీలా ధరించడం మరో ప్రత్యేకత. బంగారు వర్ణం అంచులున్న తెలుపు, క్రీమ్‌, ఐవరీ షేర్‌ రంగులు బాగుంటాయి. దీనిపై ఎలాంటి చొక్కాలైనా వేసుకోవచ్చు.

బంధ్‌గలా/జోధ్‌పురి సూట్‌: సంప్రదాయ వేడుకల్లో హుందాగా కనిపించాలంటే వీటిని ప్రయత్నించవచ్చు. చైనీస్‌ కాలర్‌తో ఉన్న కోటులాంటి జాకెట్‌, జతగా ప్యాంట్‌.. ఎవరికైనా నప్పుతాయి. జాకెట్‌ మీద ఎంబ్రాయిడరీ చేయించుకుంటే మరింత రిచ్‌గా కనిపిస్తారు.

షేర్వాణీ: మోకాలి వరకు వచ్చిన పొడవాటి కోటులాంటి జాకెటే ఈ షేర్వాణీ. నిండైన చేతులు, చైనీస్‌ కాలర్‌.. ఫ్రంట్‌ స్లిట్‌ దీని ప్రత్యేకతలు. ఎంబ్రాయిడరీ, స్టోన్‌వర్క్‌ చేయించి వేసుకుంటే మరింత అందంగా ఉంటారు.

ఇండో వెస్ట్రన్‌: సంప్రదాయానికి కొంచెం ఆధునికత, సౌకర్యం అద్దాలనుకుంటే దీన్ని ప్రయత్నించవచ్చు. నెక్‌లైన్‌, స్లిట్‌, చేతుల పొడవుల్లో కొద్దిపాటి మార్పులతో ఇందులో చాలారకాలున్నాయి.

పఠానీ సూట్‌: పొడవాటి కుర్తా, నిండైన చేతులు,  కాలర్‌లు, ముందు జేబులు, బ్యాగీ సల్వార్‌ ట్రౌజర్‌.. ఇవన్నీ కలిపితే పఠానీ సూట్‌లు. ప్రత్యేక సందర్భాల్లోనే కాదు.. రోజువారీగానూ ఉపయోగించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు