సొగసుల కాన్వాసులు..

పాత ఫ్యాషన్లకు మెరుగులద్ది.. కొత్త ట్రెండ్‌లను పరుగులు పెట్టించిన కాలమిది. అమ్మాయిలు, అబ్బాయిల ఒంటిని చుట్టేసిన వాటిలో కొన్ని ఇవి..

Published : 31 Dec 2022 01:11 IST

పాత ఫ్యాషన్లకు మెరుగులద్ది.. కొత్త ట్రెండ్‌లను పరుగులు పెట్టించిన కాలమిది. అమ్మాయిలు, అబ్బాయిల ఒంటిని చుట్టేసిన వాటిలో కొన్ని ఇవి..

లేటెక్స్‌: ఒంటిని అతుక్కునేలా ఉండి, స్టైలిష్‌గా కనిపించే లేటెక్స్‌లని దాదాపు బాలీవుడ్‌ తారామణులంతా ఆదరించారు. ఎరుపురంగులో దీపికా పదుకొణె అదరగొడితే నలుపు రంగు లేటెక్స్‌ గౌనులో జాన్వీ ఆకట్టుకుంది.

అథ్లీజర్‌: అథ్లెటిక్‌ ఫ్యాషన్‌, లీజర్‌వేర్‌లను కలిపితే ఈ అథ్లీజర్‌. కళాశాలలు.. పార్టీలకు అబ్బాయిలు వీటిని ఎక్కువగా ఫాలో అయ్యారు.

కార్సెట్‌: కాలేజీ అమ్మాయిలు, సినిమా కాంతలు.. ఈ స్టైల్‌ని బాగా ఒంటబట్టించుకున్నారు. సౌకర్యం, ఆధునికం వీటి ప్రత్యేకం. ‘లైగర్‌’ భామ అనన్య పాండే ఈ ట్రెండ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచింది. మన అగ్ర కథానాయిక సమంత సైతం తెలుపు రంగు కార్సెట్‌ వేసి ఇన్‌స్టాలో తళుక్కుమంది.

యాంటీ ఫిట్‌: దుస్తులు ఫిట్‌గా ఉంటేనే స్టైల్‌ హిట్‌ అనే మాటను ఈ ఏడాది పక్కన పెట్టేశారు కుర్రాళ్లు. ‘యాంటీ ఫిట్‌’ అనే ట్రెండ్‌నే అందుక్కారణం. ఓవర్‌సైజ్‌ చొక్కాలు, టాప్‌లను ఆదరించడమే ఈ స్టైల్‌ ఉద్దేశం.

ప్యాంట్‌సూట్‌: ట్రెండ్‌ పాతదే అయినా ఈ ఏడాదిలో పరుగు ఆపలేదు ప్యాంట్‌సూట్లు. కాలేజీ అమ్మాయిలు, కార్పొరేట్‌ ఉద్యోగినులు వీటికి ఎక్కువగా జై కొట్టారు. పసుపు రంగు ప్యాంట్‌సూట్‌ వేసుకొని బాలీవుడ్‌ భామ అలియా భట్‌ ఇన్‌స్టాలో చేసిన సందడికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.

బౌలింగ్‌ షర్ట్‌లు: బాక్స్‌ కట్‌ ఉండే కురచ స్లీవ్‌ చొక్కాలే బౌలింగ్‌ షర్ట్‌లు. ఇందులో ముదురు వర్ణాల ప్యాటర్న్‌లను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడ్డారు.

కటౌట్‌: బోరింగ్‌ వస్త్రధారణకు బైబై చెబుతూ.. డేరింగ్‌ స్టైల్‌ మా సొంతం అని నిరూపించుకోవాలి అనుకునే అతివలు ఈ కటౌట్‌లకు ఓటేశారు. వక్ష భాగంలో కట్‌ ఉండటం వీటి ప్రత్యేకత. నలుపు రంగు మిడీ డ్రెస్‌లో కృతి సనన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడెప్పుడో పెట్టిన ఫొటోలు ఇంకా కళ్లముందు మెదులుతున్నాయి అబ్బాయిలకు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని