ప్రేమకు బహుమతి వంచనా?

నా పుట్టినరోజు. ఒకటే శుభాకాంక్షల వెల్లువ. రూమ్మేట్స్‌ కేక్‌ కూడా కట్‌ చేశారు. అయినా సంతోషం లేదు. ఎందుకంటే అవని గొంతు ఇంకా నా చెవిని తాకలేదు. తను కొన్నాళ్ల కిందట పరిచయమైంది.

Published : 10 Oct 2020 07:03 IST

నా పుట్టినరోజు. ఒకటే శుభాకాంక్షల వెల్లువ. రూమ్మేట్స్‌ కేక్‌ కూడా కట్‌ చేశారు. అయినా సంతోషం లేదు. ఎందుకంటే అవని గొంతు ఇంకా నా చెవిని తాకలేదు. తను కొన్నాళ్ల కిందట పరిచయమైంది. మాటలతోనే కనికట్టు చేసేది. అసలు నా బర్త్‌డే సంగతి తనకి తెలుసో, లేదోనని ఫోన్‌ కలిపా. ‘వావ్‌.. చెప్పనేలేదు.. విష్‌ యూ మెనీ మోర్‌ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే శ్రీ’ అంది. నా మనసు పులకించింది. ఇదే మంచి ఛాన్స్‌ అనుకొని ‘నువ్వంటే నాకు ప్రాణం. నాతో జీవితాన్ని పంచుకుంటావా?’ అన్నా. కాసేపు సస్పెన్స్‌లో పెట్టి ‘నువ్వు నన్నింత ఇష్టపడటం నా అదృష్టం. అయామ్‌ లక్కీ’ అంది. గెంతులేశా.
మొదటిసారి మేం గుడిలో కలుసుకున్నాం. మనసారా మాట్లాడుకున్నాం. మా ప్రేమను ఫొటోల్లో బంధించుకున్నాం. ఆ రోజు నుంచి తనకు ఏ అవసరం వచ్చినా పరుగెత్తుకెళ్లేవాణ్ని.
‘మనం సెపరేట్‌గా రూం తీసుకుందాం.. బయట కలవడానికి ఇబ్బందిగా ఉంది’ అందోరోజు. సరేనన్నా. అప్పట్నుంచి మాకు బోలెడంత ఏకాంతం. కానీ ఎన్నాళ్లిలా? పెళ్లి చేసుకుందామన్నా. ఊకొట్టింది. సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్‌ చేసుకున్నాం. జాబ్‌లో సెటిలవగానే పెళ్లి పీటలు ఎక్కాలనేది నా ఆలోచన. కానీ కొన్నాళ్లకే మా విషయం వాళ్లింట్లో తెలిసింది. అవనిని గది ఖాళీ చేయించి ఊరు తీసుకెళ్లిపోయారు. ఓరోజు ఫోన్‌చేసి ‘ఇకపై మనం కలుసుకోవడం కుదరదేమో? ఆ రూంలో మన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి.. జాగ్రత్త..’ అంటూ ఏడుస్తూ పెట్టేసింది. 15 రోజులు ఫోన్‌ కోసం ప్రయత్నించి విసిగిపోయాను. లాభం లేదనుకొని నేరుగా వాళ్ల ఊరెళ్లాను. పొద్దున్నుంచి గాలిస్తే ఒక ఇంటి అరుగు మీద కూర్చొని కనిపించింది. తనని చూడగానే నా కళ్లు చెమర్చాయి. నాలుగు మాటలు మాట్లాడి అప్పటికే సిమ్‌ వేసి రెడీగా ఉంచిన సెల్‌ఫోన్‌నిచ్చి వెనక్కి వచ్చేశా. మళ్లీ మాటలు, చాటుమాటుగా కలుసుకోవడాలు మొదలయ్యాయి.
కానిస్టేబుల్‌ ఫలితాలొచ్చాయి. కొద్దిలో జాబ్‌ మిస్సైంది. నిరాశలో కూరుకుపోయా. అదేసమయంలో అవని ఫోన్‌. ఇంట్లోవాళ్లు సంబంధాలు చూస్తున్నారు.. మనం పెళ్లి చేసుకుందాం అని. ‘ఎస్‌ఐ జాబ్‌ ప్రయత్నాల్లో ఉన్నా. కొన్నాళ్లు మీవాళ్లను ఎలాగోలా మేనేజ్‌ చెయ్‌’ అంటే వినదే. చిరాకేసి ‘నాకోసం కొన్నాళ్లు ఎదురుచూడు. లేదంటే మీవాళ్ళు చూసిన సంబంధం చేసుకో’ అన్నా. దాన్నే సీరియస్‌గా తీసుకుందేమో.. ‘వచ్చే నెలలో నా పెళ్లి. ఇంకోసారి నాకు కాల్‌ చేయకు ప్లీజ్‌’ అంది కొన్నాళ్లకు. నా గుండె పగిలిపోయే మాట అది. ఆవేశంలో ఏదో అన్నా. నువ్వు లేకుండా నేను బతకలేను.. అని ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. ఆఖరికి నా నెంబర్‌ బ్లాక్‌ చేసింది.
వాళ్ల అక్కకి ఫోన్‌ చేశాను. వరుసకు బావయ్యే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది అంది. నాకు షాక్‌. 14 నెలలు నన్ను ప్రేమించింది.. నువ్వే లోకం అంది. ఇప్పుడేంటిలా? వేరే నెంబర్‌తో కాల్‌ చేసి నిలదీశాను. తలొంచుకుంది. వాళ్లింటికెళ్లిపోయాను. కలవనంది. తమ్ముడితో నేను ఇచ్చిన సెల్‌ఫోన్‌ పంపించింది. ఓ రిపేర్‌షాపుకెళ్లి తన చాటింగ్‌ డేటా చెక్‌ చేశా. అసహ్యమైన మాటలు, చేతలు. పెళ్లాడబోయే కుర్రాడితో అన్నిరకాలుగా దగ్గరైంది. నాపై ప్రేమ నటిస్తూ, అడుగడుగునా వంచించిన ఇలాంటి అమ్మాయి కోసమా నేను విలవిలలాడింది అని కుమిలికుమిలి ఏడ్చా. తను నన్ను అంతగా మోసం చేయడానికి నేనేం తప్పు చేశానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. తను మరొకరికి సొంతమవుతోంది. కానీ ఆమె జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నా గుండె ఆగలేదు కానీ రోజూ శవంలా బతుకుతున్నా.

- శ్రీకాంత్‌ (పేర్లు మార్చాం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని