భార్యా.. తనా? తేల్చుకోలేకపోతున్నా!

నేను ఒకమ్మాయిని గాఢంగా ప్రేమించినా.. అనివార్య కారణాలతో  వేరొకర్ని పెళ్లి చేసుకున్నా. మాకో పాప. ఆరేళ్లయ్యాక నా మాజీ లవర్‌ కనిపించింది. వాళ్లాయన చిత్రహింసలు పెడుతున్నాడని చెబుతోంది.

Updated : 20 Apr 2024 07:20 IST

నేను ఒకమ్మాయిని గాఢంగా ప్రేమించినా.. అనివార్య కారణాలతో  వేరొకర్ని పెళ్లి చేసుకున్నా. మాకో పాప. ఆరేళ్లయ్యాక నా మాజీ లవర్‌ కనిపించింది. వాళ్లాయన చిత్రహింసలు పెడుతున్నాడని చెబుతోంది. ఓదార్చడంతో మొదలై, ఇప్పుడు తనకీ బాగా దగ్గరయ్యా. వదిలి ఉండలేకపోతున్నా. మరోవైపు నా భార్యని మోసం చేస్తున్నాననే ఫీలింగ్‌ వెంటాడుతోంది. నేనేం చేయాలి?

- హరీశ్‌, ఈమెయిల్‌

 తనకే కాదు.. మీరు చేజేతులా ఇబ్బందులకు దగ్గరవుతూ.. తాళి కట్టిన భార్యకి దూరం అవుతున్నారనిపిస్తోంది.  ప్రేమించిన అమ్మాయిని కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో వేరొకర్ని పెళ్లి చేసుకున్నప్పుడే ఆ ప్రేమని మీ మనసు, జీవితం నుంచి చెరిపేయాల్సింది. ఈ విషయం తెలుసుకోలేనంత చిన్న వయసేం కాదు మీది. సన్నిహితురాలిగా ఆమె కష్టాలు తీర్చడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. ఆమె తరఫున వాదించడం.. వాళ్లాయనని మందలించడం.. పెద్దల ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించడంలాంటివీ చేయొచ్చు. తనని ఓదార్చే నెపంతో ఆమెకి దగ్గరవడం కరెక్ట్‌ కాదు.

 ఈ విషయం ఇద్దరి ఇళ్లలోనూ తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. మీ భార్య బాధ పడతారు.. మీ కాపురంలో కలతలు మొదలవుతాయి. అది మీ పాప భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది. ఎంత చెడ్డవాడైనా తన భార్య వేరొకరికి దగ్గరైతే ఏ భర్తా సహించడు. మరోవైపు భార్యని మోసం చేస్తున్నాననే భావనలో ఉన్నానని మీరే చెబుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ మాజీ ప్రియురాలితో బంధానికి వెంటనే స్వస్తి పలకండి. నిజాయతీగా జరిగిందంతా మీ ఆవిడతో చెప్పండి. ఇద్దరు కలిసి మీ మాజీ ప్రియురాలిని పెద్ద మనసుతో కష్టాల నుంచి బయటపడేసే మార్గం వెతకండి. తనకు చేస్తున్న మద్దతు, సాయం.. మీ వివాహ బంధానికి హాని కలిగించని విధంగా స్పష్టమైన సరిహద్దులను ఏర్పరచుకోండి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత కూడా మీలో మార్పు కనబడకపోతే ఒక మానసిక నిపుణుడిని సంప్రదించండి. వీలైతే మీ మాజీ ప్రియురాలి నుంచి దూరంగా ఉండేలా ఊరు మారండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని