కలెక్టర్‌ కావాలనుంది.. పుస్తకం పట్టుకోలేను!

మాది చాలా పేద కుటుంబం. అయినా కన్నవాళ్లు తాహతుకి మించి ఫీజులు చెల్లించి, నన్ను చదివించారు. నాకు మంచి ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను అరకొర మార్కులతోనే పాసయ్యా.

Published : 04 May 2024 00:20 IST

మాది చాలా పేద కుటుంబం. అయినా కన్నవాళ్లు తాహతుకి మించి ఫీజులు చెల్లించి, నన్ను చదివించారు. నాకు మంచి ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను అరకొర మార్కులతోనే పాసయ్యా. సివిల్స్‌, గ్రూప్స్‌ ఫలితాల విజేతల వార్తలు చదివి, పుస్తకం పట్టుకోవడం.. కొద్దిరోజులు కాగానే నిర్లిప్తంగా ఉండిపోవడం. ఇదీ నా వరస. చెడు అలవాట్లేం లేవు. జాబ్‌ సాధించడం నా వల్ల కావడం లేదు.. కన్నవాళ్ల ఆశల్ని వమ్ము చేస్తున్నాననే బాధ వేధిస్తోంది. నా వయసు 26.

- కె.ఎస్‌.కుమార్‌, ఈమెయిల్‌

మీ వయసు మరీ ఎక్కువేం కాదు. నిరాశ చెందాల్సిన పని లేదు. సాధారణంగా కలలకు, లక్ష్యాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. కలలు అందరూ కంటారు. కానీ వాటిని సాధించాలి అంటే కృషి, పట్టుదల, అవసరం. జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే బలీయమైన సంకల్పం, దానికి తోడు క్రమశిక్షణ, ప్రణాళిక ఉండాలి. వైఫల్యాలు ఎదురైనా పట్టు వదలకుండా ముందుకెళ్లాలి. మీ విషయానికొస్తే.. పైన ప్రస్తావించిన లక్షణాలు ఏవీ కనిపించడం లేదు. ఉద్యోగం సంపాదించాలి అని మాత్రమే మీ కోరిక. కోరిక, స్ఫూర్తి ఉన్నంత మాత్రాన ఫలితం రాదు.
అసలు మీకున్న నైపుణ్యాలు ఏంటో ముందు తెలుసుకోండి. దానికి తగ్గ ఉద్యోగం ప్రయత్నించండి. నైపుణ్యాలే లేకపోతే వాటిని నేర్చుకునేలా, మెరుగు పరచుకునేలా ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షలమంది పోటీ పడుతుంటారు. వాటిని సాధించాలంటే స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. గతంలో ఉద్యోగం సాధించిన వారి సలహా తీసుకోండి. విజేతల అనుభవాలు చదవడం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సిలబస్‌, ప్రాక్టీస్‌ విధానం కోసం అవసరమైతే ఏదైనా కోచింగ్‌ సెంటర్‌లో చేరండి. ఇది కాకుండా మీరు గిల్టీగా ఫీల్‌ అవుతున్నారు. బాధ పడినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఉద్యోగం సాధించినప్పుడు మీకు దక్కే గౌరవం, ప్రేమాభిమానాలు, మీ తల్లిదండ్రులు పడే సంతోషం, మారే మీ కుటుంబ పరిస్థితి తరచూ ఊహించుకోండి. అది మీకో స్ఫూర్తిలాగా నిలుస్తుంది. సివిల్స్‌ సర్వీసు అనేది దేశంలోనే కఠినమైన పరీక్ష. పోటీ తీవ్రంగా ఉంటుంది. ఆ పెద్ద లక్ష్యం చేరాలంటే చాలా ఫోకస్డ్‌గా హార్డ్‌వర్క్‌ చేయాలి. దానికి తగ్గ ప్రతిభ నా దగ్గర లేదు అని మీరు భావిస్తే... ముందుగా గ్రూప్స్‌ లేదా ఇతర చిన్న ఉద్యోగాలకు ప్రయత్నించండి. చిన్న కొలువు వచ్చినా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు చివరికి మీకు
ఏది సాధించాలి అనిపిస్తే అటువైపు వెళ్లండి. ఆల్‌ ది బెస్ట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని