నలుగురూ నడవని దారిలో..!

కొందరు... ట్రెండ్‌ని ఫాలో అవ్వరు.. ట్రెండ్‌ని సెట్‌ చేస్తారు... నలుగురు నడిచే దారిలో కాకుండా.. నలుగురు మెచ్చే దారి సృష్టిస్తారు... చేసేది వ్యాపారం అయినా.. దానికి సమాజహితం జోడిస్తారు... సృజనాత్మకంగా ముందుకెళ్తుంటారు. ఈ యువ తరంగాలూ అదే రకం. సాఫ్ట్‌వేర్‌ కొలువులంటే మనకు గుర్తొచ్చేది హైదరాబాద్‌, బెంగళూరులే.

Published : 26 Aug 2023 00:36 IST

కొందరు... ట్రెండ్‌ని ఫాలో అవ్వరు.. ట్రెండ్‌ని సెట్‌ చేస్తారు... నలుగురు నడిచే దారిలో కాకుండా.. నలుగురు మెచ్చే దారి సృష్టిస్తారు... చేసేది వ్యాపారం అయినా.. దానికి సమాజహితం జోడిస్తారు... సృజనాత్మకంగా ముందుకెళ్తుంటారు. ఈ యువ తరంగాలూ అదే రకం.

సొంత ఊరికి ఐటీ కంపెనీ

సాఫ్ట్‌వేర్‌ కొలువులంటే మనకు గుర్తొచ్చేది హైదరాబాద్‌, బెంగళూరులే. కానీ సొంత ఊరిపై మమకారం, స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఆశయంతో రాజమహేంద్రవరంలోనూ ఓ ఐటీ సంస్థ తెరిచాడు చింతా అనీల్‌కుమార్‌. 150మందికి ఉపాధి కల్పిస్తూ, రూ.కోట్ల టర్నోవర్‌ సాధించే సంస్థగా మలిచాడు.

నీల్‌ది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. పుట్టింది సామాన్య వ్యవసాయ కుటుంబంలో అయినా.. పదిమందికి కొలువులిచ్చే స్థాయిలో ఉండాలనుకునేవాడు. ఎంటెక్‌ చదివాక అంకుర సంస్థ ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చాడు. దీనికి ముందే సొంతంగా చిన్నచిన్న యాప్‌లు రూపొందించేవాడు. ఆ సమయంలో స్నేహితులంతా హైదరాబాద్‌, బెంగళూరులకు వెళ్లి, లక్షల జీతంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో చేరేవారు. తను మాత్రం చదువుకున్న రాజమహేంద్రవరంలోనే ఆగిపోయాడు. ఓ స్నేహితుడితో కలిసి ‘డ్రీమ్‌ స్టెప్‌’ ప్రారంభించాడు. అదీ ఒక చిన్న గది అద్దెకు తీసుకొని, నెలకు రూ.250 అద్దె చెల్లిస్తూ తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాడు. ఆ సమయంలో మహిళపై అఘాయిత్యాలు, అత్యాచారాల సంఘటనలకు చలించి పోలీసులకు ఉపయోగపడేలా, మహిళలకు రక్షణగా ఉండేలా ‘అభయ’ అనే యాప్‌ తయారు చేశాడు. తర్వాత పలు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు ఉపయోగపడేలా యాప్‌లు రూపొందించేవాడు. ఒక్కసారి తనపై తనకు నమ్మకం వచ్చాక, ఆర్థికంగా కొంచెం కుదురుకున్నాక 40మంది ఉద్యోగులతో 2017లో అమరావతి సాఫ్ట్‌వేర్‌ అండ్‌ ఇన్నోవేషన్స్‌ సంస్థ ప్రారంభించాడు. గోదావరి పుష్కరాల సమయంలో బస్సులు, అద్దె వాహనాలు, వసతి, ఆశ్రయం... ఇలా సమస్త సమాచారంతో సాంకేతిక వ్యవస్థ సిద్ధం చేశాడు. 2021 జులై వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ఆర్టీసీ బస్సులకు జీపీఎస్‌, ఇతర సాంకేతిక సేవలు, పలు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చాడు. ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు, విదేశీ సంస్థలకు ప్రాజెక్టులు చేస్తూ 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అయిదు అంతస్తుల సొంత భవనం సమకూర్చుకున్నాడు. ఇక్కడ 150 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. వార్షిక టర్నోవరు రూ.20 కోట్లతో దూసుకెళ్తోంది. సంపాదనతోపాటు సేవల్లోనూ ఈ యువకుడు ముందున్నాడు. రాష్ట్రంలోని కొన్ని దేవాలయాలకు వెబ్‌సైట్ల నిర్వహణ కోసం ఉచితంగా సాంకేతిక సాయం అందిస్తున్నాడు. తన సంపాదనలో ఏడాదికి రూ.10 లక్షలు సేవలకు కేటాయిస్తున్నానంటున్నాడు. స్వయంకృషితో ఈ స్థాయికి చేరిన అనీల్‌.. జూనియర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ (జేసీఐ) 2022లో నిర్వహించిన క్రియేటివ్‌ యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ పోటీలో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచాడు. 2021లో ఆల్‌ ఇండియా అఛీవర్స్‌ ఫౌండేషన్‌ (ఏఐఏఎఫ్‌) అవార్డు అందుకున్నాడు.

మోహనరావు బనిశెట్టి, రాజమహేంద్రవరం


మిల్క్‌షేక్‌.. వ్యాపారం హాట్‌కేక్‌

‘మీకు అద్దెకిస్తే మా భవనం విలువ తగ్గుతుంది’ అన్నారు భవన యజమాని. ఆ మాటనే కసిగా తీసుకొని ఆ పక్కనే ఔట్‌లెట్‌ తెరిచాడు రాహుల్‌ తిరుమలప్రగడ. ప్రస్తుతం అతడి సారథ్యంలోని ‘మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్‌’ సంస్థ అమెరికా, దుబాయ్‌లతో సహా 45 శాఖలుగా విస్తరించింది.

రాహుల్‌ది సూర్యాపేట జిల్లా కరివిరాల. బీటెక్‌ పూర్తవగానే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం వచ్చింది. అయినా అదేమంత సంతృప్తినిచ్చేది కాదు. అది మానేసి లండన్‌ వెళ్లి సండర్లాండ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశాడు. అక్కడ చదువుతున్నప్పుడే ఒక వ్యాపారం అతడ్ని బాగా ఆకట్టుకుంది. విపరీతమైన చలిలోనూ అక్కడి జనం మిల్క్‌ షేక్‌ కోసం ఎగబడేవారు. శీతల ప్రాంతాల్లోనే ఇంత ఆదరణ ఉంటే.. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ఇండియాలో ఈ వ్యాపారం కచ్చితంగా కలిసొస్తుందని నమ్మాడు. స్వదేశం తిరిగొచ్చాక ఇక్కడి పరిస్థితులపై అవగాహన కోసం ఆరునెలలు శ్రమించాడు. మన వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, ప్రత్యేకమైన రుచి వచ్చేలా మిల్క్‌షేక్‌లు తయారు చేశాడు. మొదట్లో ప్రయోగాత్మకంగా, కేవలం పెళ్లిళ్లకే ఆర్డర్లు తీసుకునేవాడు. 200 అవసరం అవుతాయి అనుకున్న చోట 1000 గ్లాసులు తీసుకునేవారు. దీనికి మంచి భవిష్యత్తు ఉందని రాహుల్‌కి అర్థమైంది. సొంత బ్రాండ్‌తో స్టోర్లు ప్రారంభించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ ఒక ఔట్‌లెట్‌ కోసం ప్రయత్నిస్తే.. ‘జ్యూస్‌ సెంటర్‌కు ఇస్తే మా బిల్డింగ్‌ ప్రాముఖ్యం తగ్గుతుంద’న్నారు యజమాని. చివరికి హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న ఒక రెస్టారెంట్‌ యజమానిని ఒప్పించి బయట చిన్న గదిలో మొదటి శాఖ ప్రారంభించాడు. తను ఊహించినట్టే మంచి స్పందన వచ్చింది. మొదట్లో ఎక్కడైతే అద్దె ఇవ్వడానికి నిరాకరించారో, అక్కడే రెండో ఔట్‌లెట్‌ తెరిచాడు. 2013లో రూ.10లక్షలతో, ఒక శాఖతో మొదలైన రాహుల్‌ మిల్క్‌షేక్‌ వ్యాపారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతోపాటు దుబాయ్‌, అమెరికాలకూ విస్తరించింది. రూ.కోట్లలో టర్నోవర్‌ సాగుతోంది. వందల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ స్థాయికి చేరడం వెనక మా బృందం కష్టంతోపాటు.. ఆర్థిక సాయం చేసిన బావ శ్రీనివాస్‌, స్నేహితుడు అభిలాష్‌.. బంగారాన్ని కుదువపెట్టి డబ్బు ఇచ్చిన చిన్నమ్మ అరుణల సహకారం మరవలేనంటున్నాడు. కేవలం లాభాలు తీసుకోవడమే కాదు.. అవసరమైన సమయాల్లో పెద్దమనసు చాటుకుంటున్నాడు. కేరళ వరదలప్పుడు.. ఒక ఊరికి నెలకు సరిపడా అత్యవసర సామగ్రి పంపించాడు. పుల్వామా దాడిలో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేశాడు. . కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా డబ్బులు అందజేశాడు.

చిత్తలూరి హరీశ్‌గౌడ్‌, ఈజేఎస్‌


వ్యర్థాలతో డీజిల్‌

డీజిల్‌ ధర చుక్కలనంటుతోంది. సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపే ఈ ఇంధనానికి ప్రత్యామ్నాయం తయారు చేయాలనుకున్నారు రంజిత్‌రెడ్డి, దినేష్‌రెడ్డి. ఏళ్లపాటు శ్రమించి ప్లాస్టిక్‌  వ్యర్థాలతో  డీజిల్‌ తయారు చేసే పరిశ్రమ ప్రారంభించారు.

వీళ్లలో ఒకరు మెకానికల్‌ ఇంజినీర్‌. మరొకరు కంప్యూటర్‌ ఇంజినీర్‌. ఒకరిది నల్గొండ, మరొకరిది హైదరాబాద్‌. లండన్‌లో మాస్టర్‌ డిగ్రీ చేస్తున్నప్పుడు ఇద్దరికీ పరిచయమైంది. అక్కడే పెద్దపెద్ద ఉద్యోగాలొచ్చే అవకాశం ఉన్నా.. మాతృభూమికి మేలు చేసే, పర్యావరణహితమైన, స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమ మొదలు పెట్టాలనుకున్నారు. లండన్‌లో వాళ్లు చూసిన ఒక డీజిల్‌ ప్రత్యామ్నాయ పరిశ్రమ వారికి దారి చూపింది.  

ప్రస్తుతం పాలిథిన్‌, ప్లాస్టిక్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఇవి వెయ్యేళ్లైనా మట్టిలో కలిసిపోవు. కాల్చేస్తే విష వాయువులు వెలువరిస్తాయి. వీటి వ్యర్థాలతోనే డీజిల్‌ తయారు చేసే పరిశ్రమని నల్గొండ జిల్లా స్వాములవారి లింగోటంలో ‘సహస్ర ఎన్విరో’ పేరుతో నెలకొల్పారు. ఇలాంటిది దేశంలోనే మొదటిది. ఈ ఫార్ములా యంత్రం తయారీ కోసం మిత్రులిద్దరూ రెండేళ్లు కష్టపడ్డారు. మొదట్లో
రోజుకి 500 కిలోల పాలిథిన్‌ వ్యర్థాలతో డీజిల్‌ తయారు చేసేవాళ్లు. దీన్ని పరిశ్రమల్లో జనరేటర్లు నడిపించేందుకు ఉపయోగించేవాళ్లు. క్రమంగా నాణ్యత మెరుగు పరుచుకుంటూ అన్నిరకాలుగా వాడకాన్ని పెంచారు. ప్లాంట్‌ని విస్తరించారు. ఇది పర్యావరణహితం కావడంతో తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అధికారులూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకి పది టన్నుల పాలిథిన్‌ వ్యర్థాలతో డీజిల్‌ తయారు చేస్తున్నారు.

సూరేపల్లి రఘుపతి, చౌటుప్పల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని