గూగుల్‌కి పోటీ..టెస్లాతో ఢీ!

అమెరికాలో ఈమధ్యే డ్రైవరు లేని క్యాబ్‌ సేవలు మొదలయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి వాహనాలదే హవా అంటున్నారు.

Updated : 02 Sep 2023 06:59 IST

అమెరికాలో ఈమధ్యే డ్రైవరు లేని క్యాబ్‌ సేవలు మొదలయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి వాహనాలదే హవా అంటున్నారు. ఈ అటానమస్‌ వెహికిల్స్‌ తయారీకి గూగుల్‌, టెస్లాలాంటి కంపెనీలు రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నాయి. ఆ దిగ్గజాలకి ధీటుగా.. అతి తక్కువ ఖర్చుతో ఐఐటీ మద్రాసు యువబృందం ఓ వాహనం రూపొందించింది. అంతర్జాతీయ పోటీల్లో అవార్డులూ గెల్చుకుంది. దీంతోపాటు అంగారక గ్రహంపై స్వయం చాలకంగా పనిచేసే రోవర్‌నూ తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ బృంద సారథి తెలుగబ్బాయి అరుణ్‌కృష్ణనే. అతడితో మాట కలిపింది ‘ఈతరం’.

కంప్యూటర్‌ సాయంతో, సాంకేతిక ఆజ్ఞలతో ప్రయాణికుల్ని గమ్యస్థానం చేర్చే వాహనాలు అన్ని దేశాల్లో రోడ్డెక్కే సమయం మరెంతో దూరంలో లేదు. కంపెనీల తలరాత మార్చే ఈ సాంకేతిక సమరంలో ప్రధాన వాటా దక్కించుకోవడానికి పెద్దపెద్ద సంస్థలు పోటీలో ఉన్నాయి. బరిలో ముందున్న గూగుల్‌, టెస్లాలు అయితే పరిశోధనలపై బిలియన్లకొద్దీ వెచ్చిస్తున్నాయి. అతి తక్కువ ఖర్చుతో, అబ్బురపరిచే సాంకేతికతతో ఆ సంస్థల్ని తలదన్నే వాహనాన్ని ఆవిష్కరించింది ఐఐటీ-మద్రాసులోని ‘టీమ్‌ అభియాన్‌’. ఈ బృందానికి చిత్తూరు కుర్రాడు అరుణ్‌కృష్ణ లీడర్‌. మొదట్నుంచీ చదువుల్లో చురుగ్గా ఉండే అరుణ్‌ 2019లో ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ప్రవేశం పొందాడు. బీటెక్‌, ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీలో ప్రస్తుతం నాలుగో ఏడాది చదువుతున్నాడు. మొదట్నుంచీ తను దేశం గర్వపడేలా ఏదైనా చేయాలనుకునేవాడు. ఆ అవకాశం ఐఐటీ మద్రాసులో దొరికింది.

అదే ఆశయంతో..

మానవ తప్పిదాల వల్లే 94 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. అలసట, నిద్రలేమి, ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, ఏకాగ్రత లోపించడం.. ఇలా ప్రమాదానికి ఎన్నో కారణాలు. టెక్నాలజీ నియంత్రిత వాహనాలు నడిపితే ఈ తప్పిదాలు గణనీయంగా తగ్గుతాయి. ఇదే ఉద్దేశంతో సరికొత్త ఆవిష్కరణ చేయాలనుకుంది ‘టీమ్‌ అభియాన్‌’. 2017లో కొద్దిమందితో మొదలైన ఈ బృందంలో ప్రస్తుతం 45మంది పరిశోధక విద్యార్థులున్నారు. ఎలక్ట్రికల్‌, సాఫ్ట్‌వేర్‌, మెకానికల్‌ విభాగాల నుంచి ముగ్గురు నేతృత్వం వహిస్తున్నారు. 2019లో అరుణ్‌ ఆ బృందంలో చేరాడు. 2021 డిసెంబరులో డ్రైవరు లేకుండా విద్యుత్తు వాహనాల్ని నడిపే ‘బోల్ట్‌’ అనే ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించారు. ఈ వాహనంలో జనరల్‌ యూజర్‌ ఇంటర్ఫేస్‌ ఉంటుంది. ఎక్కడికెళ్లాలనే వివరాలు అందులో తాకే తెరపై నమోదు చేస్తే రూట్మ్యాప్‌ మొత్తాన్ని ఆ వాహనం ఆటోమేటిక్‌గా తానే డిజైన్‌ చేసుకుంటుంది. దారిలో అడ్డంకులు, వ్యక్తులు, వాహనాలు, సిగ్నల్స్‌, మలుపులు, ప్రతికూల వాతావరణం గుర్తించేందుకు అధునాతన కెమెరాల్ని అమర్చారు. ఇదే మా ప్రాజెక్టులో కీలకమైన మలుపు అంటాడు అరుణ్‌. ఇలా బయటి వాతావరణాన్ని గుర్తించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు లైడార్‌ వ్యవస్థను వాడుతున్నారు. ఇది అత్యంత ఖరీదైన వ్యవహారం. దీనికే రూ.15 లక్షలు ఖర్చవుతుంది. లైడార్‌ స్థానంలో యువబృందం కీలక పరిశోధనలు చేసి రెండు కెమెరాల్లో ఆల్గరిథమ్‌ వృద్ధి చేసి వాడుతున్నారు. ఇది రూ.లక్షన్నరలో తయారైంది.

ప్రయోగాత్మకంగా..

‘బోల్ట్‌’ ఆవిష్కరణ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఈ వాహనాన్ని రోడ్లపై పరుగులు పెట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐటీ పార్క్‌లు, విమానాశ్రయాలు, పలు విద్యాసంస్థల్లోని క్యాంపస్‌లలో విశాలమైన రహదారులున్న చోట బోల్ట్‌ని పరిశీలించాలనుకుంటున్నారు. ముందు ఐఐటీ మద్రాసు క్యాంపస్‌నే ప్రయోగ స్థలంగా మార్చారు. అక్కడ ఉన్న 10కి.మీ.ల రోడ్డుపై ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 2025 నాటికి మరో 3 వాహనాలు సిద్ధం చేసేలా నిరంతరం శ్రమిస్తున్నారు. టీమ్‌ అభియాన్‌ బృందం ఆవిష్కరించిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ఏ వాహనంలో అయినా అమర్చి, డ్రైవర్‌ లేని వాహనంగా మార్చొచ్చు. కాకపోతే వాహనానికి తగ్గట్టుగా హార్డ్‌వేర్‌ను మార్చాలి. ఈ ప్రాజెక్టుకి మొత్తం రూ.15లక్షలు ఖర్చయ్యాయి. కేవలం విద్యార్థులే రూపొందించిన మన దేశ తొలి డ్రైవర్‌లెస్‌ వాహనం ప్రాజెక్టు ఇదేనంటున్నారు. దీనికోసం వారానికి 25 గంటలు శ్రమించారు. వాడకంలోకి వస్తే మంచి ఫలితాలు వస్తాయని ఈ ప్రాజెక్టుని పలువురు శాస్త్రవేత్తలు ప్రశంసించారు. 2019లో యూఎస్‌లోని మిషిగాన్‌లో నిర్వహించిన రోబో పోటీల్లో దీనికి రెండోస్థానం దక్కింది.

అంగారక గ్రహంపైకి..

అటానమస్‌ ప్రాజెక్టు దాదాపు పూర్తవడంతో అంగారక గ్రహంపై పరిశోధనలు చేసే రోవర్‌ని ఆవిష్కరించే పనిలో ఉంది ఈ యువబృందం. సాధారణంగా అంగారక గ్రహం మీద మార్స్‌ రోవర్‌ నడవాలంటే భూమి మీద నుంచి శాస్త్రవేత్తలు తప్పనిసరిగా సంకేతాలు పంపిస్తుండాలి. వాటి ఆధారంగానే ఆ రోవర్‌ ఫొటోలు తీస్తుంటుంది. ఈ సిగ్నల్స్‌ చేరడానికి 2, 3 నిమిషాలవుతుంది. ఈ తేడా లేకుండా పూర్తిగా అటానమస్‌గా ఆ గ్రహంపై రోవర్‌ పనిచేసేలా పరిశోధనలు చేస్తున్నారు. రోవర్‌ అక్కడికెళ్లాక ఎలా పని చేయాలనేది ముందే ప్రోగ్రాం తయారుచేసి పైకి పంపాలనేది వీళ్ల ఆలోచన. డిజైన్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. మార్స్‌ గ్రహం మీద అత్యంత ఎత్తయిన ఒలంపస్‌ మాన్స్‌ పర్వతాన్ని సైతం అధిరోహించేలా దీన్ని డిజైన్‌ చేస్తున్నారు. అక్కడ అడుగు మేర గోతులు తవ్వే సామర్థ్యంతో దీన్ని తయారు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి ‘మాక్రో’ అని పేరు పెట్టారు. విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తోంది.
హిదాయతుల్లాహ్‌.బి, ఈనాడు, చెన్నై


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని