తగ్గినా.. అందమే

మేకప్‌లు పక్కన పెట్టేస్తున్నారు... మేనికి కృత్రిమ తళుకులు అద్దుకోవడం తగ్గించేస్తున్నారు... ‘స్కినిమలిజమ్‌’కి జై కొడుతున్న యువతరం  ధోరణి ఇది...

Updated : 26 Mar 2022 05:05 IST

మేకప్‌లు పక్కన పెట్టేస్తున్నారు... మేనికి కృత్రిమ తళుకులు అద్దుకోవడం తగ్గించేస్తున్నారు... ‘స్కినిమలిజమ్‌’కి జై కొడుతున్న యువతరం  ధోరణి ఇది... ఏంటీ ట్రెండ్‌? ఏమా కథ?

అందంగా కనిపించాలి అనుకోని యూత్‌ అరుదు. ముఖ్యంగా అమ్మాయిలు.. ఎడాపెడా సౌందర్యోపకరణాలు వాడేసి రాత్రికిరాత్రే అందం పెంచుకోవాలనుకుంటారు. అందుకే మరి ఈ సొగసు పిపాసుల్ని మెప్పించడానికి మార్కెట్లో ఫేస్‌క్రీమ్‌, క్లెన్సర్‌, మాయిశ్చరైజర్‌లాంటి 180 రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. నగరాలు, పట్టణాల్లో అయితే వీధికో పార్లర్‌, స్పా వెలుస్తున్నాయి. ఇంత ఊపులోనూ వీటికి టాటా చెప్పేసి ఒకట్రెండు కాస్మొటిక్స్‌తో సరిపెట్టుకుందాం అనేవాళ్లు పెరిగిపోతున్నారు. ఇదే స్కినిమలిజమ్‌ ట్రెండ్‌. రెండేళ్ల కిందట తెరపైకి వచ్చింది. కరోనా పుణ్యమాని యూత్‌ అప్పట్లో కొన్నినెలల పాటు నాలుగు గోడలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే ముఖానికి మెరుగులు దిద్దే కార్యక్రమాలు కొంతవరకు మూలన పడిపోయాయి. సంపాదన చిక్కిపోవడంతో జనం పొదుపుబాట పట్టడమూ ఓ కారణమైంది. దానికితోడు తామెంతో ఆరాధించే తారలు సైతం మేకప్‌ లేకుండా అప్పుడప్పుడు ఇన్‌స్టా, ట్విటర్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు పంచుకోవడమూ ఈ ధోరణికి ప్రేరణగా నిలిచింది. దీనికితోడు.. అందం, చూసేవారి కళ్లలో ఉంటుందిగానీ.. కృత్రిమ తళుకులు అద్దుకుంటే వస్తుందా? అని వాదించేవాళ్లు ఉండనే ఉన్నారు.

తాత్కాలికమా..
ఈ విషయమే ‘మ్యాట్రిక్స్‌’ బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలిని అడిగితే ‘ఫ్యాషన్‌, మోడలింగ్‌ రంగాలకు చెందిన వినియోగదారులు తరచుగా మా పార్లర్‌కి వచ్చి అందానికి మెరుగులు అద్దుకుంటుంటారు. వాళ్లకది అవసరం కూడా. కానీ కారణమేదైనా కరోనా అనంతరం తరచూ వచ్చేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇది తాత్కాలికమా, ఇలాగే కొనసాగుతుందా? అనేది చెప్పలేం’ అంటారామె. ఈ ట్రెండ్‌ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నది కాస్మటాలజిస్ట్‌లు, చర్మనిపుణుల మాట. అందం పుట్టుకతో, సహజంగా, సంప్రదాయ పద్ధతుల్లో పెరగాలే తప్ప.. అత్యధిక రసాయన పూతలు వాడితే.. కొత్త చర్మ సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అన్నట్టు ఇది అమ్మాయిలకే పరిమితం కాలేదు. సొగసుగా ఉండాలనుకునే సోగ్గాళ్లు సైతం ఒక అడుగు వెనక్కి తగ్గి స్కినిమలిజమ్‌కి ఓటేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు