అదిరేటి డ్రెస్సు నేనేస్తే..

పేరు తెచ్చుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఊర్ఫీ మాత్రం చిత్రవిచిత్రమైన దుస్తుల వేషధారణని ఎంచుకుంది

Published : 03 Jun 2023 00:42 IST

తన మాట వివాదం.. వేషం విచిత్రం! అదే ఊర్ఫీ జావెద్‌ని పాపులర్‌ ఫిగర్‌ని చేశాయి. అంతర్జాలం సంచలనంగా మార్చాయి. ఈ స్థాయికి చేరడానికి అమ్మడు వేసిన ఎత్తుగడల కథేంటంటే..

పేరు తెచ్చుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఊర్ఫీ మాత్రం చిత్రవిచిత్రమైన దుస్తుల వేషధారణని ఎంచుకుంది. మొదట్లో పొదుపైన దుస్తులు వేసి అడ్డూఅదుపూ లేని ప్రచారం తెచ్చుకుంది. ఆపై చిత్రవిచిత్రమైన డిజైన్లు, ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన ఔట్‌ఫిట్‌లు ధరిస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తన దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయనీ.. అసలేం బాగా లేవనీ చాలా విమర్శలే వచ్చాయి. ఊర్ఫీ పట్టించుకుంటేగా!

ఈ లఖ్‌నవూ అమ్మాయి హిందీ బిగ్‌బాస్‌ ద్వారా జనం ముందుకొచ్చింది. దాంతో వచ్చిన పేరుకి ఫిదా అయ్యాక.. మరింత ఎదగాలనుకుంది. అనుకున్నట్టుగానే ఈ రెండేళ్లలోనే స్టార్లకు తీసిపోని పేరు సంపాదించుకుంది. విమర్శలు, వివాదాలు.. అన్నీ దాటుకొని పేరున్న తారలు సైతం తనని ఫాలో అయ్యేంతగా మారింది. ఈ మధ్యకాలంలో తను ధరించిన టాయ్‌ జాకెట్‌ని బాలీవుడ్‌ తారలు నేహా ధూపియా, కరీనా కపూర్‌లు మెచ్చుకొని మరీ మాకూ అలాంటివి కావాలన్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో తనని నలభై  రెండు లక్షలమంది అనుసరిస్తున్నారు. ‘డీఐవై క్వీన్‌’గా అభిమానులు పిలిచే ఊర్ఫీని.. అమిత్‌ అగర్వాల్‌, శంతను-నిఖిల్‌, గౌరవ్‌ గుప్తా, అబూజానీ- సందీప్‌ ఖోస్లా.. లాంటి ప్రముఖ డిజైనర్లు తమ స్టోర్‌ లాంచ్‌లకి ఆహ్వానించారు.

విచిత్రమైన ఔట్‌ఫిట్‌లు..

* రేజర్‌ బ్లేడ్‌లతో తయారు చేసిన స్కర్టు.
* ఎలక్ట్రిక్‌ వైర్లతో కో-ఆర్డ్‌ స్టైల్‌ మినీ డ్రెస్‌.
* గోనె సంచులతో డిజైన్‌ చేసిన టాప్‌, బాటమ్‌ డ్రెస్‌.
* చాక్లెట్‌ ముడిపదార్థాలతో ముచ్చటైన ఔట్‌ఫిట్‌.
* ఆల్చిప్పలతో బ్రాలెట్‌. సేఫ్టీ పిన్స్‌తో గౌను.
* సొంత ఫొటోలతో డిజైన్‌ చేసిన మాక్సీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని