చీరల వనజకి చిరాకు ప్రసాద్‌ లేఖ

కట్టడానికి చీటీ డబ్బులు లేక చిరాకుగా ఉన్న సమయంలో... ధర్మవరం చీరకట్టులో ప్రత్యక్షమై.. నన్ను ఆకట్టుకున్నావు.

Published : 30 Sep 2023 00:08 IST

ట్టడానికి చీటీ డబ్బులు లేక చిరాకుగా ఉన్న సమయంలో... ధర్మవరం చీరకట్టులో ప్రత్యక్షమై.. నన్ను ఆకట్టుకున్నావు. మంగళగిరి చీరలా హుందాగా ఉన్న నీ మొహం చూసి నువ్వే నా ముద్దుగుమ్మవని అనుకున్నాను. నాలోని కళలన్నీ చూపించి, నిన్ను సొంతం చేసుకొని ఏనాటికైనా నీతో కలంకారీ చీరలు కట్టించాలనుకున్నాను. ఎన్నాళ్లో నీ వెనకాలే తిరిగితిరిగీ నా మనసులో మాట చెబితే.. కాంజీవరం పట్టుచీరలా నావన్నీ ఖరీదైన కోరికలే.. నీకు నన్ను ప్రేమించే మనసు ఉండొచ్చుగానీ భరించే స్తోమత లేదన్నావు. అయినా డీలా పడిపోకుండా అప్పులు చేసి నీకు ఉప్పాడ చీరలు కొనిపెట్టాను. మీ అమ్మ పుట్టిన రోజుకి వెంకటగిరి చీర.. మీ అక్క పెళ్లికి పోచంపల్లి చీర అందించాను. సంక్రాంతికి గద్వాల్‌ చీర, ఉగాదికి బనారసీ చీర కానుకగా పంపించాను. మొత్తానికి వినాయక చవితికి దేవతలా కరుణించి ‘ఈసారి షిఫాన్‌ చీరతో సరిపెట్టుకుంటాలే’ అని చెప్పుకొచ్చావు. ‘దసరాకి బంధానీ చీర.. దీపావళికి చెట్టినాడ్‌ సిల్క్‌ చీర కొనాలని షరతులు పెడితే, అడిగింది కాబోయే అర్ధాంగే కదాని సర్దిచెప్పుకున్నాను. కానీ అమావాస్యకో చీర.. పౌర్ణమికో పట్టుచీర అడుగుతుంటే.. తెచ్చివ్వడానికి నేనేమైనా శారీమందర్‌ ఓనర్‌నా? ఇప్పటికే నీ చీరలు కొనడం కోసం చేసిన అప్పులకి వడ్డీ కట్టలేక చిరాకులో ఉంటే.. అప్పు ఇచ్చిన వాళ్లు వచ్చి తిప్పలు పెడుతున్నారు. వాళ్లకి దొరకకుండా చీర కట్టుకుని తప్పించుకుని తిరిగే దుస్థితి దాపురించింది. ఓసీ ఒయ్యారీ.. నీకు చీరల మీద ఉన్న ప్రేమలో కాస్తైనా నాపై చూపిస్తే.. ఈ అప్పుల పోరు ఉండేదే కాదుగా! దయచేసి ఇకనైనా నా ప్రేమ పెళ్లికి నీ చీరకొంగుతో పచ్చజెండా ఊపు. కాదూ కూడదని మళ్లీ ఏమైనా అడిగావో.. నేనిచ్చిన చీరలన్నీ ఎత్తుకెళ్లి, సగం ధరకి అమ్మేసి.. నా అప్పులు సగం తగ్గించుకుంటా.

పంపినవారు: నల్లపాటి సురేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని