పెళ్లైనా.. ప్రేమిస్తూనే ఉంటా!

తొలి ప్రేమ ఎప్పుడూ మధురమే. అది విఫలమైతే కలిగే ఫలితం మాత్రం జీవితాంతం గుచ్చుతూనే ఉంటుంది.

Updated : 05 Mar 2022 04:20 IST

తొలి ప్రేమ ఎప్పుడూ మధురమే. అది విఫలమైతే కలిగే ఫలితం మాత్రం జీవితాంతం గుచ్చుతూనే ఉంటుంది.

ఆరు దాటి ఏడుకొచ్చా. కౌమారం నా ఒంట్లో కల్లోలం రేపుతున్న రోజులవి. ఎవరైనా అమ్మాయి కనిపించినా, మాట కలిపినా ఏవేవో చిత్రమైన భావనలు చెలరేగేవి. ఆ సమయంలోనే పరిచయమైంది టామ్‌. కళ్లని చక్రాల్లా తిప్పుతూ.. తేనెల మాటల్ని విసురుతూ అయస్కాంతంలా తనవైపే లాగేసేది.

తరగతికి రాగానే నా కళ్లు తనకోసం వెతికేవి. నేను కనబడగానే తన పెదాలు విచ్చుకునేవి. మధ్యాహ్నం భోజనంతోపాటు గారంగా కొన్ని మాటలూ పంచుకునేవాళ్లం. సాయంత్రం నా సైకిల్‌ తనని అనుసరించేది. చూస్తుండగానే పది దాటేశాం. వీడ్కోలు పార్టీలో మా ఇద్దరి ఒంటిపైకి ఒకే రంగు దుస్తులొచ్చాయి.. మా మనసులూ ఒక్కటే అని చెప్పడానికి అదో సంకేతం. లేత ప్రాయంలో అది ఆకర్షణే కావొచ్చు.. నాకది చెప్పలేనంత తీయగా ఉండేది.

తను ఇంటర్లో, నేను డిప్లమోలో చేరాం. వేర్వేరు చోట్ల. మూతిపై సరిగా మీసాలు కూడా రాని వయసులో.. నాలో విరహ వేదన మొదలైంది. దూరమైన మనసుల్ని చేరువ చేయడానికి అప్పట్లో ఫేస్‌బుక్‌లు, వాట్సప్‌లాంటి వారధులు లేవు. మూడేళ్లు క్షణమొక యుగంలా గడిపేవాణ్ని. ఆపై ఆలస్యం చేయకుండా బీటెక్‌ కోసం తన కాలేజీలో వాలిపోయా.

ఇప్పటికీ నేను గుర్తున్నానా? ఆ అభిమానం, ఇష్టం ఇంకా ఉంటాయా? నాలో కోటి సందేహాలు. ఈ అనుమానాలకు టామ్‌ ఓరోజు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ‘ఓయ్‌.. ఏంటి అపరిచితుడిలా దూరంగా తిరుగుతున్నావ్‌. నేను నిన్ను మర్చిపోలేదు. నీ నెంబర్‌ ఇవ్వు’ అంది. ఆ మాటతో ఎక్కడో పారేసుకున్న నా మనసు మళ్లీ నన్ను వెతుక్కుంటూ వచ్చిందనిపించింది. అప్పట్నుంచి ప్రతి క్షణం నాకు పండగే. కబుర్లు.. కలుసుకోవడాలు.. కలిసి షాపింగ్‌లు.. చాటింగ్‌లు.. అన్నీ ఉండేవి. ప్రేమ ఊసులతోపాటు.. జీవితాంతం ఒకరి చేయి మరొకరం వదలొద్దని బాసలు చేసుకున్నాం.

తనకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం రావడంతో మామధ్య మరో గ్యాప్‌. ఇంతకు ముందులా ఇదీ విరామమే అనుకున్నా. కానీ అదో పెద్ద అగాథం అని తర్వాత అర్థమైంది. ముందు బాగానే మాట్లాడుకునేవాళ్లం. తర్వాత కాల్స్‌ తగ్గాయి. ఒక్కోసారి కట్‌ చేసేది. అప్పుడప్పుడు బ్లాక్‌ చేసేది. ఎందుకలా చేస్తుందో తెలిసేది కాదు. మేం దూరంగా ఉంటే దగ్గరవడానికి ఎన్నేళ్లైనా ఎదురు చూడాలనుకున్నా.. తనే దూరం పెట్టాలనుకుంటే ఏం చేయను? అయినా నాలో ఏదో ఆశ.

ఓసారి ఫోన్‌ చేసి రమ్మంది. ఆ క్షణం ప్రపంచాన్ని జయించినంత సంతోషం. కోటి ఆశలతో తనముందున్నా. కానీ నా గుండె ముక్కలయ్యే మాట చెప్పింది. ‘మా బావతో నా పెళ్లి కుదిరింది. ఇక ఇంతటితో మన ప్రేమను ఆపేద్దాం’ అని. ఆ మాట నా ఆశలకు మరణ శాసనం. నన్ను కన్నీటి వరదలో ముంచేసి తను పెళ్లి పీటలెక్కింది. తన జ్ఞాపకాలు, మేం తిరిగిన ప్రదేశాలు కనిపిస్తే గుండె గాయం పెద్దదవుతుందని ఏడాదిదాకా ఊరే వెళ్లలేదు. బాగా ఆలోచిస్తే నాకు అర్థమయ్యిందేంటంటే.. నాకు ఉద్యోగం లేకపోవడంతోనే నా ప్రేమ ఓటమికి కారణమైందని. తనకు తెలుసు.. నా లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం. ఆ ప్రయత్నంలోనే ఉన్నా. ఆ ఫలితం రాక ముందే.. మా ప్రేమ విఫలమని చెప్పేసింది.

తను ప్రస్తుతం భర్తతో సంతోషంగా ఉంది. నేనూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. టామ్‌పై నాకేం కోపం లేదు. ఎందుకంటే.. అప్పుడైనా, ఇప్పుడైనా తన ఆనందమే కోరుకుంటున్నా. తను నాకు మిగిల్చిన జ్ఞాపకాలు, అనుభూతుల్ని మననం చేసుకుంటూ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తా. ఎవరో చెప్పినట్టు.. ప్రేమకి గమ్యం పెళ్లొక్కటే కాదు.. ఇష్టపడ్డవాళ్లని జీవితాంతం ప్రేమిస్తూనే ఉండటం. అదే చేస్తున్నా.

- జెర్రీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని