మన్నించు.. ‘డియర్‌’

సాయంత్రం బెంగళూరులో బస్సు దిగా. ఓ క్యాబ్‌ బుక్‌ చేసుకొని నేరుగా తను చెప్పిన హోటల్‌కి వెళ్లా. రాత్రి ఏడింటికి వస్తానంది. జరగబోయే ‘సీన్‌’ ఊహించుకోగానే నరాలు జివ్వుమని లాగాయి. తనతో పరిచయం.. ఇంతదూరం రావడం.. కళ్లముందు మెదిలాయి.

Updated : 29 Oct 2022 07:12 IST

సాయంత్రం బెంగళూరులో బస్సు దిగా. ఓ క్యాబ్‌ బుక్‌ చేసుకొని నేరుగా తను చెప్పిన హోటల్‌కి వెళ్లా. రాత్రి ఏడింటికి వస్తానంది. జరగబోయే ‘సీన్‌’ ఊహించుకోగానే నరాలు జివ్వుమని లాగాయి. తనతో పరిచయం.. ఇంతదూరం రావడం.. కళ్లముందు మెదిలాయి.
వాళ్లది కాకినాడ దగ్గర ఓ పల్లెటూరు. చాలాకాలం కిందటే బెంగళూరులో స్థిరపడ్డారట. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్టు నచ్చి మెసేజ్‌ చేసింది. నేనూ బదులిచ్చా. కొద్దిరోజుల్లోనే చాటింగ్‌, సెల్‌ఫోన్‌ మాటల్లోకి మారింది. ఒకర్నొకరం ‘డియర్‌’ అని పిలుచుకునేదాకా వెళ్లం. తను వ్యక్తిగత విషయాలు సహా అన్నీ పంచుకునేది. అన్నింటికన్నా ఎక్కువగా డబ్బు విషయాలు చర్చించేది. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? తేలికగా డబ్బు సంపాదించడమెలా? ఏవేవో అడిగేది. తోచిన సలహాలిచ్చేవాణ్ని.
తనతో గంటలకొద్దీ మాట్లాడటం నా క్లోజ్‌ఫ్రెండ్‌ గమనించాడు. మ్యాటరేంటన్నాడు. ‘జస్ట్‌.. ఫ్రెండేరా’ అంటే వినడే! ఓసారి కలుస్తానని అడుగు అని బలవంతం చేశాడు. వాడి పోరు భరించలేక ‘ఎప్పుడు కలుద్దాం?’ అనడిగా. ‘తప్పకుండా డియర్‌.. సమయం, సందర్భం వచ్చినప్పుడు నేనే చెబుతాగా..’ అంది. అలా మాట ఇచ్చిన ఎనిమిది నెలల తర్వాత బెంగళూరు రమ్మంది. అంటే మా పరిచయమైన ఏడేళ్ల తర్వాత మేం కలుసుకోబోతున్నాం. వెంటనే మావాడికి చెప్పా. ‘అదృష్టం అంటే నీదేరా.. ఎంజాయ్‌’ అన్నాడు. ‘రేయ్‌.. ఎందుకైనా మంచిది.. అన్ని జాగ్రత్తలు తీసుకో’ అని సలహా కూడా ఇచ్చాడు. అలా నాలో రొమాంటిక్‌ ఆలోచనలు మొదలయ్యాయి. ఎంతైనా నేనూ మగాడినే కదా.

ఫోన్‌ మోగడంతో వర్తమానంలోకి వచ్చా. అరగంటలో వచ్చేస్తానంది. సమయం దగ్గర పడుతున్నకొద్దీ నా గుండె దడ పెరగసాగింది. వస్తూనే ‘హాయ్‌ డియర్‌’ అంటూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి చిన్నగా హత్తుకుంది. ఆమె మేని స్పర్శ తగలగానే నా ఒంటికి పూనకం వచ్చేసింది. నిజానికి తను ఫొటోల్లోకన్నా బాగుంది. ‘ఏంటి విశేషాలు.. అంతా కులాసేనా? పిల్లలు బాగున్నారా?’ అని ఏవేవో అడుగుతోంది. నాకేమీ వినిపించడం లేదు. అప్పటికే నా మనసు శృంగార లోకంలో విహరిస్తోంది. ఇంక ఆలస్యం చేయొద్దని ఆమె అధరాల్ని నా పెదాలతో చుట్టేశా. ‘వాట్‌ దిస్‌ నాన్సెన్స్‌’ అంటూ నన్ను దూరంగా నెట్టేసింది. నేనూహించనిదది. స్థాణువైపోయా. ‘నువ్విలా ఊహించుకుంటావనుకోలేదు. నీవల్ల నేను బాగుపడ్డా. ఆ విషయం చెబుదామని ఇక్కడికి పిలిచా’ మామధ్య మౌనాన్ని తుంచేస్తూ అంది. ‘రెండేళ్ల కిందట నువ్వు ఇచ్చిన సలహాతోనే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా మారాను. నా అదృష్టమో, అందరితో కలిసిపోయే తత్వమో.. ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నా. అది చెప్పాలనే ఇక్కడికి రమ్మన్నా..’ తన మాటలతో పశ్చాత్తాపం, అయోమయం కలగలిసిన ఓ చిత్రమైన పరిస్థితిలో పడిపోయా. ఇంతలోనే ఒకాయన వచ్చారు. ‘మా ఆయన’ అంటూ నవ్వుతూ పరిచయం చేసింది. ఏమీ జరగనట్టే. పలకరింపులయ్యాక.. మరీమరీ థాంక్స్‌ చెప్పి చేతిలో ఓ కవర్‌ పెట్టారాయన. తెరిచి చూస్తే నా ఇద్దరు పిల్లల పేరు మీద చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాలు, నా పేరు మీద తీసుకున్న టర్మ్‌ పాలసీ కనిపించాయి. దాదాపు లక్ష రూపాయల విలువైనవి. అప్పుడెప్పుడో మా డాక్యుమెంట్స్‌ తనకి పంపినట్టు గుర్తొచ్చింది. నేను చేసిన మాట సాయానికి తనెంత విలువ ఇచ్చింది? నేనేమో నీచంగా ప్రవర్తించా. ఆ క్షణం నాపై నాకే అసహ్యమేసింది.

వాళ్లు వెళ్లిన అరగంటకి మెసేజ్‌ పంపింది. ‘డియర్‌.. మొదటి పరిచయంలోనే నువ్వు ఆప్తుడిలా అనిపించావు. నీ సలహాలు, మాటలు ధైర్యాన్నిచ్చేవి. నీవల్లే జీవితంలో స్థిరపడగలిగా. ఆ రుణం తీర్చుకోవడానికి చిన్న సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకున్నా. ఈ హోటల్‌లోనే మా ఆఫీసు సమావేశం జరిగింది. బాగా చేస్తున్నానని అధికారులు నాకు సన్మానం చేశారు. ఈ విషయాలన్నీ నీతో పంచుకోవాలనుకున్నా. నిన్ను మా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నా. ఈ ఏడేళ్లలో ఒక్కనాడైనా వంకరగా మాట్లాడని నీలో అలాంటి భావన కలిగిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నీకు ఆ అభిప్రాయం కలిగేలా నేను ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించు...’ ఆ ఎసెమ్మెస్‌ చదివేసరికి నా కళ్లలో కన్నీటి సుడులు. కనీసం క్షమించమని అడగడానికైనా సిగ్గుగా అనిపించింది. ఛిద్రమైన మనసుతో ఆ రాత్రే తిరుగు ప్రయాణమయ్యా    

- సతీశ్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని