బంధం దూరమైంది.. బతుకే కన్నీరైంది!

కొన్ని బంధాలు చిత్రంగా మొదలవుతాయి. జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. సహజతో నాది అలాంటి బంధమే.చెబితే నమ్మరుగానీ.. డిగ్రీ పూర్తయ్యేవరకూ నేను ఒక్క అమ్మాయితో మాట్లాడిందిలేదు.

Updated : 09 Sep 2023 07:34 IST

కొన్ని బంధాలు చిత్రంగా మొదలవుతాయి. జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. సహజతో నాది అలాంటి బంధమే.

చెబితే నమ్మరుగానీ.. డిగ్రీ పూర్తయ్యేవరకూ నేను ఒక్క అమ్మాయితో మాట్లాడిందిలేదు. ఆడవాళ్లంటే నాకున్న భయం ఒక కారణమైతే, సూటిగా మాట్లాడే నా తీరు చాలామందికి నచ్చదని దూరంగా ఉండేవాణ్ని. అలాంటి నేను ప్రేమలో పడతాననీ.. నన్ను ఓ అమ్మాయి ప్రాణంలా ప్రేమిస్తుందనీ కలలో కూడా ఊహించలేదు. కానీ.. అదే జరిగింది.

పీజీలో ఎదురైంది సహజ. తనది వేరే కాలేజీ. మా క్లాస్‌మేట్స్‌ అమ్మాయిల గదిలోనే ఉండేది. వాళ్ల ద్వారానే నా గురించి తెలుసుకుందట. అణకువగా, పద్ధతిగా ఉన్న తనని చూడగానే ఒకరకమైన పాజిటివ్‌ ఫీలింగ్‌ కలిగేది. ఆ ఇష్టంతోనే అప్పుడప్పుడు.. మెసేజ్‌ చేసేవాడిని. తనూ బాగానే స్పందించేది. అలా పరిచయం స్నేహంగా మారాక ఓరోజు ‘నువ్వంటే నాకిష్టం. ఐలవ్యూ’ అనే మెసేజ్‌ పంపా. ‘ఏంటీ జోక్‌ చేస్తున్నావా?’ అంది. ‘ఇది వేళాకోళం కాదు.. నా గుండెల్లోంచి వచ్చిన మాట. దయచేసి కాదనొద్దు’ అన్నా. ‘పిచ్చిమొద్దూ.. నువ్వంటే నాకూ ఇష్టమే. ఈ మాట కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాను’ అనడంతో నా ఆనందానికి అవధుల్లేవు.

మా ప్రేమ రోజురోజుకీ గాఢంగా అల్లుకునేది. దాంతో సహజే నా శ్రీమతి అని ఫిక్స్‌ అయ్యాను. ఓసారి మా ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకీ పరిచయం చేశా. వాళ్లకీ బాగా నచ్చింది. తను నా జీవితంలోకి వచ్చాక నా నడత, ప్రవర్తన, మాటతీరు.. అన్నింట్లో చాలా మార్పు వచ్చింది. నా పాత స్నేహితులైతే ఇది నమ్మలేకపోయేవాళ్లు. అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటుండగా.. ఓ ఉపద్రవం ముంచుకొచ్చింది. మా ప్రేమంటే గిట్టని కొందరు సహజ బావకి విషయం చేరవేశారు. ఆయన సహజను ఇష్టపడుతూ, పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. మా విషయం తనకి తెలియడం ఒకరకంగా మంచిదే అయ్యింది. పెద్ద మనసుతో ఆయన పక్కకి తప్పుకున్నాడు. కొలువులో కుదురుకోగానే మేం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ నా దురదృష్టంకొద్దీ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు అందినట్టే అంది చేజారిపోయాయి. కాలం గడిచేకొద్దీ మాపై ఒత్తిడి పెరగసాగింది. తనకి చెప్పకుండానే ఇంట్లోవాళ్లు సంబంధాలు తెచ్చేవారు. ఏదో సాకు చెప్పి.. సహజ వాటిని అడ్డుకునేది.  

ఒకరోజు వాళ్ల బాబాయ్‌ ఫోన్‌ చేశారు. ‘సహజతో నీ పెళ్లి జరగదు. తనని మర్చిపో. తనకి వాళ్ల బావతో పెళ్లి ఫిక్స్‌ చేశాం’ అని. మర్చిపోవడానికి తనేమైనా జ్ఞాపకమా? నా ప్రాణం. అయినా ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో సహజ ఆత్మహత్యాయత్నం చేసి, వాళ్ల ప్రయత్నాన్ని కొన్నాళ్లు అడ్డుకుంది. ఇలా కుదరదనుకొని, తర్వాత నాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టముండటం.. నేను సహజని ఎలాంటి ఇబ్బంది పెట్టకపోవడంతో పోలీసులూ ఏం చేయలేకపోయారు. బాగా ఆలోచించి చివరికి వాళ్లు ఆఖరి అస్త్రం ప్రయోగించారు. వాళ్ల బావతో పెళ్లికి ఒప్పుకోకపోతే నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని సహజని బెదిరించారు. విధి లేని పరిస్థితుల్లో తను ఒప్పుకుంది.

సహజ పెళ్లై రెండేళ్లైంది. అప్పట్నుంచి రోజూ జీవచ్ఛవంలాగ బతుకుతున్నాను. నా చేతగాని తనాన్ని తిట్టుకుంటూనే ఉన్నాను. నన్ను కోరి వచ్చిన అమ్మాయిని సొంతం చేసుకోలేని నా అసమర్థతకి ఈ శాస్తి జరగాల్సిందే. కానీ తను మాత్రం ఎక్కడున్నా.. సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నా.    

చెర్రీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని