Manalo Manam: త్యాగం నాది.. మోసం అతడిది

నేను, ఒకబ్బాయి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. తను పేదవాడైనా, చదువులో టాపర్‌. అది చూసే అతణ్ని ఇష్టపడ్డా. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అనే ఉద్దేశంతో అన్నిరకాలుగా దగ్గరయ్యా.

Updated : 16 Sep 2023 07:44 IST

మనలో మనం

నేను, ఒకబ్బాయి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. తను పేదవాడైనా, చదువులో టాపర్‌. అది చూసే అతణ్ని ఇష్టపడ్డా. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అనే ఉద్దేశంతో అన్నిరకాలుగా దగ్గరయ్యా. మావాళ్లు నాకిచ్చే ప్రతి పైసా అతడి కోసమే ఖర్చు చేసేదాన్ని. తన హాస్టల్‌ ఫీజులు చాలాసార్లు నేనే చెల్లించా. ఆరునెలల కిందట తనకి పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది. మా కులాలు వేరు అయినా కష్టపడి మావాళ్లని ఒప్పించా. మా ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక.. ‘జాతకాలు కుదరడం లేదు. మనం బ్రేకప్‌ చెప్పుకుందాం’ అంటున్నాడు. తనకి పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చే సంబంధం వచ్చిందనే తనిలా చేస్తున్నాడని తెలిసింది. ఈ మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నేనేం చేయాలి?

ఓ పాఠకురాలు, ఈమెయిల్‌

మీకు జరిగింది నిజంగా అన్యాయమే. ఆరేళ్ల ప్రేమ అన్నారు.. ఈ సమయంలో తన గురించి ఈపాటికి మీకు బాగా అర్థమయ్యే ఉండాల్సింది. మీరు తనే జీవితం అన్నట్టుగా ఉన్నారు. అన్నివిధాలుగా దగ్గరై, ఆర్థికంగా ఆదుకుంటూ.. అతడితో మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ఎన్నో కలలు కన్నారు. తను మీకు దగ్గర అయినట్టే అయ్యి, ఎంగేజ్‌మెంట్‌ కాగానే వెనకడుగు వేయడం బాధాకరం. నిజంగా జాతకాల మీద అంత నమ్మకమే ఉండి ఉంటే.. ఈ ఆరేళ్లలో ఎప్పుడో పరిశీలించుకొని ఉండేవాడు. ఇప్పుడే ఇలా చేస్తున్నాడంటే మీరన్నట్టే.. కట్నం కోసం తను మనసు మార్చుకొని ఉండొచ్చు.
పెళ్లికి ముందే అతడి మోసం గురించి తెలిసినందుకు సంతోషించండి. ఇప్పుడు మీకు తప్పకుండా బాధ ఉంటుంది. కానీ అలాంటి వ్యక్తితో జీవితం పంచుకొని, జీవితాంతం బాధ పడటం కన్నా ఇదే నయం. కొన్నాళ్లైతే నిజం అర్థమై, మీరు దాన్నుంచి బయటపడతారు. ప్రస్తుతం కట్నం కోసం తను వేరే అమ్మాయి వైపు చూస్తున్నాడు. ఇంకా పెద్దమొత్తం ఇచ్చేవాళ్లు వస్తే.. ఆ అమ్మాయినీ వదులుకోడనే గ్యారెంటీ ఏంటి? మీలాగా మరొకరు మోసపోకూడదంటే అతడ్ని గట్టిగా నిలదీయండి. వీలైతే మీరు అతడికిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని నిర్మొహమాటంగా అడగండి. గతం గతః.. జరిగిందేదో  జరిగింది. దాన్నో చేదు సంఘటనగా భావించి, మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. మీకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకోండి. అతడు ఈర్ష్య పడేలా ఎదగండి. తక్షణం బాధ మర్చిపోవడానికి స్నేహితులతో గడపడం, ఏవైనా టూర్లకు వెళ్లడంలాంటివి చేయండి. కొత్త ప్రదేశంలో, ఇతరుల సమక్షంలో మనసు కొంచెం కుదుట పడుతుంది. ఆల్‌ ది బెస్ట్‌.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని