Manalo Manam: అప్పుడు చెల్లి.. ఇప్పుడు భార్యంటే ఎలా?

ఇంటర్లో ఉండగా మా పక్క పోర్షన్‌లో ఒక కుటుంబం అద్దెకు దిగింది. వాళ్లమ్మాయి నాకు బాగా నచ్చేది. ఎప్పుడైనా ఓసారి మాట్లాడుకునేవాళ్లం. కొన్నేళ్లయ్యాక తనకి ప్రపోజ్‌ చేద్దామనుకుంటుండగా.. తను నాకు రాఖీ కట్టి ‘అన్నయ్యా’ అంది. అప్పుడే..

Updated : 21 Oct 2023 09:37 IST

ఇంటర్లో ఉండగా మా పక్క పోర్షన్‌లో ఒక కుటుంబం అద్దెకు దిగింది. వాళ్లమ్మాయి నాకు బాగా నచ్చేది. ఎప్పుడైనా ఓసారి మాట్లాడుకునేవాళ్లం. కొన్నేళ్లయ్యాక తనకి ప్రపోజ్‌ చేద్దామనుకుంటుండగా.. తను నాకు రాఖీ కట్టి ‘అన్నయ్యా’ అంది. అప్పుడే.. నా ప్రేమని మనసులోనే చంపుకొని తనని చెల్లిగా భావించడం మొదలు పెట్టా. ఈమధ్యే నాకు ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి పేరెంట్స్‌ వచ్చి మా అమ్మాయి, మీ అబ్బాయికి పెళ్లి చేద్దాం అని మా అమ్మానాన్నలతో అడిగారట. నేనెలా స్పందించాలి? గతంలోని నా ప్రేమను బయటికి తీసి ఒప్పుకోవాలా? చెల్లిగానే చూడాలా? ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నా.

ఎస్‌.సాయికిరణ్‌, ఈమెయిల్‌

నిజంగా మీది క్లిష్టమైన సమస్యే. కానీ మీరే ప్రేమను చంపుకొని తనని చెల్లిగా భావించాను అన్నారు. అలా అనుకున్న అమ్మాయికి తిరిగి భార్య స్థానం ఇవ్వడం ఎవరికైనా కష్టమే. ఒకవేళ ఎక్కడో మనసు పొరల్లో దాగి ఉన్న ప్రేమను బయటికి తీసినా.. అది సమంజసం అనిపించుకోదు. మనసు చంచలమైంది. ఇప్పుడు పెళ్లికి ఓకే అన్నా.. మళ్లీ తర్వాత ఎలాంటి ఆలోచనలైనా రావొచ్చు. తనని చెల్లిగా, భార్యగా రెండు రకాలుగా ఊహించుకుంటూ జీవితాన్ని కొనసాగించడం కష్టం. పెద్దల ఒత్తిడితో భార్యగా చేసుకున్నా.. ఏదో ఒక నిమిషంలో తప్పు చేశాననే భావనలు వెంటాడుతూనే ఉంటాయి. పోనీ ఆ అమ్మాయికైనా మీపై ప్రేమ ఉందా అంటే.. అదీ లేదు. తనే ముందు మీకు రాఖీ కట్టింది. అన్నలా భావించిన తను భర్తగా మిమ్మల్ని ఊహించుకోవడమూ కష్టమే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వాళ్లు ఆ అమ్మాయి అభిప్రాయం తీసుకున్నారా? లేదా? చెప్పలేదు. బహుశా మీరు మంచి ఉద్యోగంలో స్థిరపడటంతో వాళ్లు ఈ ప్రపోజల్‌ తీసుకొచ్చారేమో. చెల్లిగా భావించిన తనని భార్య స్థానంలో ఊహించుకోలేనని స్పష్టంగా చెప్పండి. మీకు ఇబ్బందిగా అనిపిస్తే.. మీ అమ్మానాన్నలతో చెప్పించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని