ఊరు మారితే.. బ్రేకప్‌ అంటోంది!

నేనో ఐటీ ఉద్యోగిని. రెట్టింపు జీతం, మంచి పొజిషన్‌తో ఈమధ్యే పుణెలో ఉద్యోగం వచ్చింది. వచ్చే నెలలోనే చేరాలి. కానీ వెళ్లడానికి నా గాళ్‌ఫ్రెండ్‌ ఒప్పుకోవడం లేదు.

Updated : 06 Apr 2024 07:00 IST

నేనో ఐటీ ఉద్యోగిని. రెట్టింపు జీతం, మంచి పొజిషన్‌తో ఈమధ్యే పుణెలో ఉద్యోగం వచ్చింది. వచ్చే నెలలోనే చేరాలి. కానీ వెళ్లడానికి నా గాళ్‌ఫ్రెండ్‌ ఒప్పుకోవడం లేదు. నన్ను విడిచి ఉండలేనంటోంది. కాదని వెళ్తే బ్రేకప్‌ చెబుతానంటోంది. నాకూ ఆ అమ్మాయంటే ఇష్టమే కానీ, కెరియర్‌ ముఖ్యమన్నా వినడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?

ప్రణీత్‌, ఈమెయిల్‌

ముందు ఆమె అభ్యంతరాలేంటో స్పష్టంగా కనుక్కోండి. మీరు దూరం వెళ్తే.. కలుసుకోలేకపోవడమే ప్రధాన సమస్య అనుకుంటే.. దానికీ ఓ మార్గం ఉంటుంది. పుణె, హైదరాబాద్‌ మధ్య దూరం మరీ ఎక్కువేం కాదు. వారాంతాల్లో కలుసుకొని కబుర్లు చెప్పుకోవచ్చు. రోజూ మాట్లాడు కోవడానికి ఫోన్‌కాల్స్‌, వీడియో కాల్స్‌ ఉండనే ఉన్నాయి. ఒకవేళ తనూ ఉద్యోగి అయితే ఆమె కూడా మీ ఆఫీసులోనే చేరేలా ప్రయత్నించండి. లేదా ఒకట్రెండేళ్లలో మళ్లీ మీరు హైదరాబాద్‌కి బదిలీ చేయించుకోవచ్చు. జీవితంలో, కెరియర్‌లో మరో మెట్టు ఎక్కుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మీపై ఆమెకు నిజమైన ప్రేమ గనకే ఉన్నట్టు అయితే, మీ తరఫున కూడా తను ఆలోచించాలి. మీ జీతం, హోదా పెరిగితే మీ ఇద్దరి భవిష్యత్తుకు మంచిది కూడా.
ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికీ వర్క్‌ ఫ్రం హోం కొనసాగిస్తున్నాయి. మీరు ఉద్యోగంలో చేరాక ఆ ఆప్షన్‌ కోసం ప్రయత్నిస్తానని చెప్పండి. ప్రేమంటే ఎప్పుడూ ఒకరి పక్కన ఒకరు ఉండటం మాత్రమే కాదు. ఒకర్నొకరు అర్థం చేసుకోవడం, బాధ్యతలు పంచుకోవడం. ఇవేమీ ఆలోచించకుండా నువ్వు ఇక్కడే ఉండాలి.. లేదంటే బ్రేకప్‌ అనడం సమంజసం కాదు. మీకు కూడా ఆ అమ్మాయిపై ఇష్టం ఉందంటున్నారు. దూరంగా వెళ్లిపోవడం మీకూ ఇబ్బందిగానే ఉంటుంది. కెరియర్‌ కోసం ఈ తాత్కాలిక బాధలు తప్పవు. చివరగా తను చెప్పినట్టు.. ఇక్కడే మరో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించి చూడండి. అయినా తను పట్టు వీడకుంటే మీ ఇద్దరి సన్నిహితులు, పెద్దలతో ఒక మాట చెప్పించండి. తను తప్పకుండా మారుతుంది.

డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని