Manalo Manam: ఆ సాన్నిహిత్యం నచ్చలేదట!

మా కాలేజీలో నేనొక అమ్మాయిని ఇష్టపడుతున్నా. తనని ఫాలో అవుతూ.. తన స్నేహితుల దగ్గర తన గురించి ప్రస్తావిస్తూ పరోక్షంగా ఆ విషయం చాలాసార్లు తెలియజేశా. అయినా ఆమె నుంచి స్పందన లేదు.

Updated : 25 Nov 2023 10:22 IST

మా కాలేజీలో నేనొక అమ్మాయిని ఇష్టపడుతున్నా. తనని ఫాలో అవుతూ.. తన స్నేహితుల దగ్గర తన గురించి ప్రస్తావిస్తూ పరోక్షంగా ఆ విషయం చాలాసార్లు తెలియజేశా. అయినా ఆమె నుంచి స్పందన లేదు. ఓసారి తరగతిలో నేను వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే, నేనిష్టపడే తను కోపంగా చూస్తూ పుస్తకాలు నేలకేసి కొట్టింది. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ‘ఎందుకలా చేశావు?’ అనడిగితే.. ‘నువ్వు వేరొకరితో సన్నిహితంగా ఉంటే నాకు నచ్చదు’ అంది. మరి నన్ను ప్రేమిస్తున్నావా? అంటే ఎటూ చెప్పదు. బయటికి కాదుకదా.. కనీసం నాతో క్యాంటీన్‌కి కూడా రాదు. అసలు తన మనసులో ఏముంది?

వైష్ణవ్‌, ఈమెయిల్‌

యుక్తవయసులో ఇలాంటివి సహజం. కానీ ప్రేమకి, ఆకర్షణకి చాలా తేడా ఉంటుంది. చూస్తుంటే మీరు ఆ అమ్మాయి ఆకర్షణలో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది. తన విషయానికొస్తే.. ఆమె మీ నుంచి అటెన్షన్‌ కోరుకుంటోంది. పుస్తకాలు విసిరేయడం ద్వారా మీరు వేరేవాళ్లతో సన్నిహితంగా ఉంటే తనకి నచ్చదు అని చెబుతోంది. అంతేగానీ, అది ప్రేమే అని కచ్చితంగా చెప్పలేం. ఈ వయసులో అమ్మాయైనా, అబ్బాయైనా.. ఇతరుల అటెన్షన్‌ కోరుకోవడం సహజం. కొందరైతే ఎంత ఎక్కువమందితో సన్నిహితంగా ఉంటే అంత గొప్ప అని భావిస్తారు. అలాగని చనువు చూపే అందరినీ ఇష్టపడాలనేం లేదు.

ఈ ప్రేమ, ఆకర్షణల విషయం పక్కనపెట్టి ముందు చదువుపై దృష్టి పెట్టడం మంచిది. ఈ ధ్యాసలో పడితే చదువులో వెనకబడిపోతారు. కెరియర్‌కి ఇది ఆటంకంలా మారుతుంది. పిల్లలు బాగుపడతారనే ఉద్దేశంతో రూ.వేలకొద్దీ ఫీజులు కట్టి కన్నవాళ్లు మిమ్మల్ని కాలేజీకి పంపుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఆకర్షణ, ప్రేమల వలలో పడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు. పరిణతి చెందిన స్నేహాలైతే ఫర్వాలేదు. చదువులో, కష్టాల్లో, సరదాల్లో ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు. మీరు చదువులో మంచి ప్రతిభ చూపిస్తే.. ఉద్యోగంలో స్థిరపడితే సహజంగానే చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడతారు. జీవితంలో స్థిరపడ్డాక, పెద్దల్ని ఒప్పించి అయినా ప్రేమ పెళ్లి చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని