శిష్యురాలి ప్రేమ.. తప్పన్నా వినదే!

నేనో ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌ని. బాగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులంటే నాకు ప్రత్యేక అభిమానం. అలా డిగ్రీలో అయిదారుగురు అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు.

Updated : 24 Feb 2024 06:53 IST

నేనో ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌ని. బాగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులంటే నాకు ప్రత్యేక అభిమానం. అలా డిగ్రీలో అయిదారుగురు అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు. ప్రోత్సాహకరంగా ఉంటుందని వాళ్లకి చిన్నచిన్న బహుమతులు ఇవ్వడం.. ఎప్పుడైనా సరదాగా బయటికి తీసుకెళ్లడం చేస్తుండేవాడిని. అయితే ఈమధ్యే ఒకమ్మాయి నన్ను రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ షాకింగ్‌ విషయం చెప్పింది. మనది గురుశిష్యుల బంధం.. నువ్వలా ఆలోచించడం తప్పని మందలించా. మెచ్చుకొని.. బహుమతులిచ్చి.. ఆప్యాయంగా మాట్లాడి.. మీరే నాలో ప్రేమ పెరిగేలా చేశారంటోంది. పెళ్లికి ఒప్పుకోకపోతే ఏదైనా అఘాయిత్యానికి ఒడిగడతానంటోంది. నాకిప్పటికే పెళ్లై ఓ బాబు ఉన్నాడు. నేనేం చేయాలి ఆ అమ్మాయినెలా మార్చాలి?

 ఆర్‌.ఎస్‌., ఈమెయిల్‌


ప్రోత్సాహకరంగా ఉంటుందని విద్యార్థులకి బహుమతులు ఇవ్వడం.. బయటికి తీసుకెళ్లడం.. ఇలాంటివి బాగానే ఉంటాయి. కానీ మీరు డీల్‌ చేస్తోంది చిన్న పిల్లలు కాదనే విషయం దృష్టిలో పెట్టుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే టీనేజీ పిల్లలు తొందరగా ఆకర్షణకి లోనవుతారు. చాలామంది లెక్చరర్లు ఉండగా.. కేవలం మీరే వాళ్ల మీద ప్రత్యేక అభిమానం చూపిస్తుండటంతో వయసులో ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అభిమానాన్ని ప్రేమగా పొరబడి ఉండొచ్చు. ఇందులో మీ తప్పు కూడా ఉంది. ముందు ఆ అమ్మాయిని కూర్చోబెట్టి సావధానంగా చర్చించండి. మీవైపు నుంచి ప్రేమ, పెళ్లి ఎలా సాధ్యం కావో విడమరిచి చెప్పండి. తను కోరినట్టు చేయడం నైతికంగా తప్పు మాత్రమే కాదు.. చట్టపరంగా నేరం కూడా. ఇలా చేయడం వల్ల ఎలాంటి  అనర్థాలు ఉత్పన్నమవుతాయో అర్థమయ్యేలా చెప్పండి.

మీపై అభిమానం ఉంది కాబట్టి.. తప్పకుండా మీ మాటలు వింటుంది. దీంతోపాటు మీరు ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఒక్కసారి ఈ విషయం చెప్పి, తన పరిస్థితి వివరించండి. వాళ్లు ఆమెని మార్చడానికి ప్రయత్నిస్తారు. ఇన్ని చేసినా తను మారకపోతే.. మీరు మీ క్లాసు మార్చుకోవడమో.. అవసరమైతే కొన్నాళ్లు ఉద్యోగం మానేయడమో చేయండి. మనిషి కళ్ల ముందు నుంచి కనుమరుగైతే.. ఆ ప్రభావం నుంచి తప్పకుండా బయటపడే అవకాశం ఉంటుంది. నా పిల్లలు అని స్వచ్ఛమైన అభిమానం చూపించడంలో తప్పేం లేదు.. కానీ తేలిగ్గా ఆకర్షణకు లోనయ్యే ఈ వయసులో కొన్ని హద్దులు పాటించాలి. ముఖ్యంగా ఆడపిల్లలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

 డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు