వీడియోకాల్స్‌.. బాయ్‌ఫ్రెండ్సూ.. ఆపేదెలా?

కొత్తగా ఉద్యోగంలో చేరాను. ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో ఇంకో ఇద్దరమ్మాయిలతో కలిసి ఒక గది అద్దెకు తీసుకొని ఉంటున్నా. వాళ్లు మొదట్లో బాగానే ఉండేవారు.

Updated : 13 Jan 2024 06:52 IST

కొత్తగా ఉద్యోగంలో చేరాను. ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో ఇంకో ఇద్దరమ్మాయిలతో కలిసి ఒక గది అద్దెకు తీసుకొని ఉంటున్నా. వాళ్లు మొదట్లో బాగానే ఉండేవారు. తర్వాత అర్ధరాత్రుళ్లవరకూ బాయ్‌ఫ్రెండ్స్‌తో వీడియా కాల్స్‌ మాట్లాడటం.. షికార్లకెళ్లడం చేస్తున్నారు. రూంలో సరిగా పని చేయరు. అప్పుడప్పుడు మందు కూడా తాగుతున్నారు. వాళ్ల బలవంతంతో నేనూ ఓసారి రుచి చూడాల్సి వచ్చింది. బాగా ఆలోచిస్తే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని భయంగా ఉంది. వాళ్లతో తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి నాది. ఈ చెడు సావాసాలు మానుకొమ్మని వాళ్లకు ఎలా చెప్పేది? ఎలా మార్చేది?                  

 ఆర్‌.ఎస్‌.ఎం., ఎస్‌.ఆర్‌.నగర్‌

 ఆర్నెల్లు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారు.. వీళ్లు వాళ్లవుతారు అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అది సహజం కూడా. చుట్టూ ఉండే పరిసరాలు, మనుషుల ప్రభావం తప్పకుండా మనపై ఉంటుంది. చెడు బాటలోకి వెళ్తున్నాను అనే ఆలోచన మీకు రావడం మంచి పరిణామం. పరిష్కారం విషయానికొస్తే.. వాళ్లని మార్చాలనే ప్రయత్నం వృథా ప్రయాస. వేరేవాళ్లని మార్చాలనే ఆలోచనే సబబు కాదు. ఇతరుల్ని మార్చడంకన్నా మనల్ని మనం మార్చుకోవడం తేలిక. అలవాట్లు ఎలా ఉన్నా.. వాళ్లు మీకు మంచి స్నేహితులు, వదులు కోవడం ఇష్టం లేదనిపిస్తే.. ఓసారి కూర్చోబెట్టి వారితో మీకున్న ఇబ్బంది తెలియజేయండి. ఆ ప్రవర్తన కారణంగా ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో, భయపడుతున్నారో విడమరిచి చెప్పండి. తప్పకుండా అర్థం చేసుకుంటారు. అయినా వినకుంటే.. అక్కడి నుంచి వెళ్లిపోయే నిర్ణయం తీసుకోవాల్సిందే. మీలాగ సిటీకి వచ్చి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు చాలామందే ఉంటారు. కాస్త ఆలస్యమైనా మీలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తప్పకుండా దొరుకుతారు. దొరకకపోయినా వచ్చిన ఇబ్బందేం లేదు. వర్కింగ్‌ వుమెన్స్‌ హాస్టళ్లు ఉన్నాయి. అందులోకి మారిపోయి ప్రశాంతంగా ఉండండి. ఇవన్నీ సాధ్యంకావు.. నేను అక్కడే ఉండాలి అనుకుంటే.. ఇక మీరే మారాలి. వాళ్ల ప్రవర్తనని అస్సలు పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోవాల్సిందే. మీ ఆర్థిక పరిస్థితి, కన్నవాళ్లు మీపై పెట్టుకున్న నమ్మకం తరచూ గుర్తు చేసుకుంటుంటే మానసికంగా దృఢంగా తయారవుతారు. గంజాయి వనంలో తులసి మొక్కలా స్వచ్ఛంగా ఉండగలుగుతారు. జీవితంలో మనకెదురయ్యే ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది. ఎలాంటి ఆప్షన్‌ లేదని భయపడొద్దు. ప్రశాంతంగా ఆలోచిస్తే.. కచ్చితంగా దారి కనపడుతుంది. ఆల్‌ ది బెస్ట్‌.

- అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌
.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని