కన్నవాళ్ల బలవంతంతో అలా చేశా!

బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నా. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలి.. తర్వాత సివిల్స్‌ సాధించాలనే బలమైన కోరిక ఉండేది నాకు. కానీ కన్నవాళ్ల బలవంతంతో ఎలక్ట్రానిక్స్‌ తీసుకోవాల్సి వచ్చింది.

Published : 23 Dec 2023 00:39 IST

* బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నా. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలి.. తర్వాత సివిల్స్‌ సాధించాలనే బలమైన కోరిక ఉండేది నాకు. కానీ కన్నవాళ్ల బలవంతంతో ఎలక్ట్రానిక్స్‌ తీసుకోవాల్సి వచ్చింది. మాది పేద కుటుంబం. నా లక్ష్యాన్ని ఎలా చేరాలో సలహా ఇవ్వండి.

సీహెచ్‌ వేణు, ఈమెయిల్‌


హలో వేణు.. మీ ఆవేదన అర్థమైంది. తల్లిదండ్రుల బలవంతం మీదో.. ఇతర కారణమో.. మీలాగే చాలామంది తమకు ఇష్టంలేని కోర్సులు ఎంచుకొని, దాని మీద కూడా దృష్టి పెట్టలేకపోతున్నారు. కొందరైతే.. కెరియర్‌, జీవితంలో నష్టపోతూ మానసికంగా కుంగిపోతుంటారు. సరే.. ఇప్పటికే రెండో ఏడాదికొచ్చేశారు. జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావడం, ఐఏఎస్‌ సాధించడం.. రెండూ భిన్న లక్ష్యాలు. ముందు ఏదో ఒక స్పష్టమైన లక్ష్యం ఎంచుకోండి. ఇంజినీరింగ్‌లో వేరే బ్రాంచి తీసుకున్నా.. సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకొని ఐటీ ఉద్యోగి అయినవాళ్లు చాలామంది ఉన్నారు. మీకూ అలాంటి అవకాశం ఉందేమో పరిశీలించండి. ఐఏఎస్‌నే కావాలనుకుంటే మీకు ఏ డిగ్రీ అయినా సరిపోతుంది. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ పూర్తి చేస్తూనే సివిల్స్‌కి సన్నద్ధం కండి. పరీక్షల ప్రణాళిక, సిలబస్‌, ప్రిపరేషన్‌.. వీటన్నింటి కోసం గత విజేతల సలహాలు తీసుకోవచ్చు. సివిల్స్‌ ఔత్సాహికులకు ఉచితంగా, తక్కువ ఫీజుతో శిక్షణనిచ్చే సంస్థలూ ఉన్నాయి. ఆ వివరాలు సేకరించండి.

 మీరు చదువులో మంచి ప్రతిభ చూపిస్తే, సాయం చేయడానికి చాలామంది ముందుకొస్తారు. కొన్ని సంస్థలు సీఎస్‌ఆర్‌ కింద పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్ట్‌ తీసుకోవడం వల్ల ఏదో కోల్పోయాననే ఆలోచనను ముందు వీడండి. మీ లక్ష్యంపై ఒక స్పష్టత ఏర్పరచుకొని దానికి అనుగుణంగా అడుగులు వేయండి. కఠోర దీక్షకు సంకల్పం తోడైతే ఎలాంటి లక్ష్యాన్నైనా అవలీలగా సాధిస్తారు. ఆల్‌ ది బెస్ట్‌.

అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని