నిశ్చితార్థం అయ్యాక.. వచ్చేస్తానంటోంది

ఒకమ్మాయి, నేను ఐదేళ్లు ప్రేమించుకున్నాం. నాకు ఉద్యోగం లేదని ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోలేదు. చాలారోజుల వరకు డిప్రెషన్‌లో ఉండిపోయా.

Updated : 23 Mar 2024 07:33 IST

ఒకమ్మాయి, నేను ఐదేళ్లు ప్రేమించుకున్నాం. నాకు ఉద్యోగం లేదని ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోలేదు. చాలారోజుల వరకు డిప్రెషన్‌లో ఉండిపోయా. ఆ బాధ నుంచి తేరుకున్నాక.. కసిగా కష్టపడి చదివా. ఈమధ్య ప్రకటించిన ఫలితాల్లో రెండు కొలువులు సాధించా. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకుందాం అంటోంది. మా అమ్మానాన్నలు ఒప్పుకోకపోతే నీతోపాటు వచ్చేస్తానంటోంది. ఇప్పటికీ తనంటే నాకు ఇష్టమే. కానీ అసలు విషయం ఏంటంటే.. ఆమెకి ఇంతకుముందే నిశ్చితార్థం అయ్యింది. నేనేం చేయాలి?

ఎస్‌.కల్యాణ్‌కుమార్‌, వరంగల్‌

క అమ్మాయి, అబ్బాయి ఎమోషనల్‌గా కనెక్ట్‌ కావడానికి ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు. కానీ పెళ్లి చేసుకొని కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలంటే ఉద్యోగం తప్పనిసరి. మొదట్లో మీకు ఉద్యోగం లేదని వాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవడం ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా సమంజసమే. ఆ విషయాన్ని సవాలుగా తీసుకొని, కష్టపడి చదివి ఒకటికి రెండు ఉద్యోగాలు సంపాదించడం నిజంగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం.
మీ సమస్య విషయానికొస్తే.. ఇద్దరు మనుషులు కలిసి బతకాలంటే.. వారి మధ్య ప్రేమ, సఖ్యత.. చాలా ముఖ్యం. ఆ అమ్మాయి మిమ్మల్ని కోరుకుంటోంది. తనంటే మీకూ ఇష్టమే. నిశ్చితార్థం అయినంత మాత్రాన తనతో పెళ్లి ఆలోచన విరమించుకోవాల్సిన పని లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి.. ఇష్టపడ్డ అమ్మాయిని వదిలేసి మీరు సంతోషంగా ఉండలేరు. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన  కొన్ని విషయాలున్నాయి. మీకు ఉద్యోగం లేకపోవడమే సమస్య అన్నవాళ్లు.. మీరు ఉద్యోగం తెచ్చుకునేంతవరకు ఆగకుండా తనకి ఎందుకు పెళ్లి ఫిక్స్‌ చేశారు? మీకు ఉద్యోగం వచ్చాకే తను మీతో వచ్చేస్తానని ఎందుకు అంటోంది? వీటిలో ఎలాంటి దురుద్దేశం లేకపోతే ఆ అమ్మాయిని నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి పేరెంట్స్‌ మొదట్లో చెప్పినట్టు ఉద్యోగ సమస్య లేదు కాబట్టి.. ఇద్దరూ కలిసి వెళ్లి వాళ్లని కన్విన్స్‌ చేయడానికి ప్రయత్నించండి. ఆ అమ్మాయి మిమ్మల్ని సీరియస్‌గా ప్రేమిస్తోందనీ.. తనని బాగా చూసుకుంటానని భరోసా ఇవ్వండి. తల్లిదండ్రులు పిల్లల సంతోషాన్నే కోరుకుంటారు కాబట్టి తప్పకుండా ఒప్పుకొంటారు. నిశ్చితార్థం చేసుకున్న అబ్బాయికి విషయం చెప్పి క్షమాపణలు కోరండి. ఇది ఇబ్బందికరమైన పరిస్థితే కానీ.. జీవితాంతం కలిసి నడవాల్సింది మీ ఇద్దరే. ఆల్‌ ది బెస్ట్‌.

అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని