అర్హతలు లేనివాడికి అందలమా?

నేను, నా ఫ్రెండ్‌ ఒకేసారి బీటెక్‌ పూర్తి చేశాం. చదువులో వాడికన్నా నేనే ముందుంటా. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌లోనూ నాకే పట్టుంది.

Updated : 09 Mar 2024 06:45 IST

నేను, నా ఫ్రెండ్‌ ఒకేసారి బీటెక్‌ పూర్తి చేశాం. చదువులో వాడికన్నా నేనే ముందుంటా. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌లోనూ నాకే పట్టుంది. ఇద్దరం దాదాపు నాలుగేళ్లు ఖాళీగా ఉన్న తర్వాత, నేనొక చిన్న కంపెనీలో చేరితే.. వాడు బెంగళూరు వెళ్లిపోయాడు. రెండేళ్లయ్యాక నాకన్నా రెట్టింపు జీతంతో మా సంస్థలోనే టీం లీడర్‌గా చేరాడు. ఆఫీసులోనే కాదు.. ఊరు వెళ్లినా తననే అంతా పొగుడుతున్నారు. వాడు ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ పెట్టి ఈ స్థాయికి చేరినట్టు తెలిసింది. అయినా నా ముందు పోజులు కొడుతున్నాడు. నా స్నేహితుడైనా.. అర్హత లేని వ్యక్తి ఆ హోదాలో ఉండటం నాకు నచ్చడం లేదు. ఈ విషయం మా మేనేజ్‌మెంట్‌కి చెప్పాలనుకుంటున్నా. నా నిర్ణయంలో ఏమైనా తప్పుందా?

ఎం.కె.ఆర్‌., ఈమెయిల్‌

లో అండీ.. మీలో నేను సాధించలేదు అనే బాధ కన్నా అతడు ఎక్కువ సాధించాడనే అసూయనే ఎక్కువ కనిపిస్తోంది. మీకన్నా తక్కువ అర్హతలతో తను ఆ స్థాయికి చేరడంతో ఈర్ష్య పడుతున్నారు. అలా ఫీలవడం తప్పు అని నేననడం లేదు. మనిషిలోని అన్ని భావోద్వేగాల్లాగే ఇదీ ఒక ఎమోషనే. కానీ అందులో సానుకూలమైన ఈర్ష్య, ప్రతికూలమైన ఈర్ష్య అని రెండు రకాలుంటాయి. పాజిటివ్‌ ఈర్ష్యతో.. నేనూ సాధించాలనే సంకల్పం, పట్టుదల పెరిగి విజయం వైపు అడుగులేస్తారు. నెగెటివ్‌ దాంతో.. తీవ్రమైన బాధ, అకారణమైన కోపం, నిద్ర పట్టకపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, బాధకి కారణమైన వ్యక్తిపై ఫోకస్‌ పెట్టడం.. లాంటివి చేస్తుంటారు. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే మానసిక కుంగుబాటుకు గురవుతారు. చేస్తున్న పనిపై దృష్టి పెట్టక ఉత్పాదకత తగ్గుతుంది.

మీ స్నేహితుడు చేసింది తప్పే అయినా.. వ్యక్తిగతంగా మీకు జరుగుతున్న నష్టం ఏంటి? ఈ నకిలీ అనుభవం గురించి మేనేజ్‌మెంట్‌కి తెలియజేయడం ఎందుకని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇలా అడ్డదారుల్లో పైకెదిగిన చాలామందిని ఈమధ్య కాలంలో ఐటీ సంస్థలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. తన విషయంలోనూ ఎప్పటికైనా అది బయటపడాల్సిన విషయమే. అతడికి పనిలో నైపుణ్యం లేకపోతే ఎక్కువ కాలం మనలేడు. మీ విషయానికొస్తే.. మీలో మంచి ప్రతిభ, కష్టపడే తత్వం ఉంటే కొంచెం ఆలస్యమైనా తప్పకుండా గుర్తింపు దక్కుతుంది. అనాలోచితంగా అతడి గురించి ఫిర్యాదు చేస్తే.. తన కెరియరే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి అతడిని ఎలా కిందికి లాగాలా అని ఆలోచించకుండా.. మీరు పైకి ఎలా ఎదగాలి? అనే
దానిపై దృష్టి పెట్టండి. మీలో టాలెంట్‌ ఉంది కాబట్టి తప్పకుండా సక్సెస్‌ అవుతారు. ఆల్‌ ది బెస్ట్‌.

అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని