ఆమె పెత్తనం.. నాకు నరకం

నా భార్య, నేను.. ఇద్దరం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులం. తను నాకన్నా రెండేళ్లు జూనియర్‌ అయినా జీతం, హోదా ఎక్కువ. మొదట్లో ‘నీకన్నా నేనే అన్నింట్లో టాప్‌’ అని సరదాగా ఆట పట్టించేది. రానురాను అంతా నేను చెప్పినట్టే జరగాలి అంటోంది.

Updated : 08 Jun 2024 00:48 IST

నా భార్య, నేను.. ఇద్దరం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులం. తను నాకన్నా రెండేళ్లు జూనియర్‌ అయినా జీతం, హోదా ఎక్కువ. మొదట్లో ‘నీకన్నా నేనే అన్నింట్లో టాప్‌’ అని సరదాగా ఆట పట్టించేది. రానురాను అంతా నేను చెప్పినట్టే జరగాలి అంటోంది. ఆర్థిక పరమైన, కుటుంబ పరమైన నిర్ణయాల్లో తన మాటే నెగ్గాలనే పంతం కనిపిస్తోంది. ఏ సినిమాకో, ఫంక్షన్‌కో వెళ్లాలన్నా.. నా మాటకు విలువ ఇవ్వడం లేదు. నాకు నామోషీగా అనిపిస్తోంది. మాకు ఒక బాబు. నేను వేరే ఇల్లు అద్దెకు తీసుకొని ఉండాలనుకుంటున్నా. మీరేమంటారు?

రాజీవ్, ఈమెయిల్‌

ముందుగా సమస్యను అన్ని కోణాల్లోంచి విశ్లేషించాలి. మొదట్లో సరదాగా ఉండే ఆవిడ.. అకస్మాత్తుగా మీమీద ఆధిపత్యం చెలాయించడం ఎప్పటినుంచి మొదలైంది? మీరేమైనా తన మీద ఎక్కువగా ఆధారపడుతున్నారా? తనమీద ఎక్కువ బాధ్యతలు వేస్తున్నారా? ఎక్కువ బాధ్యతలు తీసుకునేవారు అన్నీ తాము అనుకున్నట్టే జరగాలనుకోవడం సహజం. మరో పరిస్థితి ఏంటంటే.. మీరు ఎక్కువ సందర్భాల్లో తనకే నిర్ణయాలు వదిలేసినప్పుడు కొన్నాళ్లకు మీ పట్ల తేలికభావం ఏర్పడుతుంది. మీకేం తెలియదు అన్నీ నేను చూసుకుంటానుగా అనే ఆలోచనలో ఉంటారు. ఇవేమీ కాకుండా కొందరు సహజంగానే ఆధిపత్య స్వభావం కలిగి ఉంటారు. తను తీసుకునే నిర్ణయాలతో మీ కుటుంబానికి ఏమైనా నష్టం కలుగుతోందా.. ముందు అది ఆలోచించండి. మంచి జరిగినప్పుడు బాధ పడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కావాలనే మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నట్టుగా అనిపిస్తే తప్పకుండా మీ బాధని ఆమెకు తెలియజేయాలి. ఓరోజు ప్రశాంతంగా తనని కూర్చోబెట్టి ఆమె ప్రవర్తన కారణంగా మీరు ఎంతలా బాధ పడుతున్నారో వివరించి చెప్పండి. మిమ్మల్ని అలక్ష్యం చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంత బాధ పడ్డారో విడమరిచి చెప్పండి. ఇది ఇలాగే కొనసాగితే ఇద్దరి అనుబంధంపై ఎలా ప్రభావం పడుతుందో వివరించండి. అప్పటికీ వినకపోతే పెద్దలు, తోబుట్టువులు, దగ్గరి స్నేహితులతో చెప్పించే ప్రయత్నం చేయండి. తను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అలా కాకుండా మీరు విడిగా ఇల్లు తీసుకోవడం, వేరేగా ఉండాలనుకోవడం.. విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. ఇది మీ బాబు భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఆమె మారకపోతే మానసిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

- డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని