గతం అడగొద్దంటే ఎలా?

మూడునెలల కిందట ఒకబ్బాయితో నిశ్చితార్థమైంది. వచ్చే నెలలోనే మా పెళ్లి. ఈ మధ్యలో లంచ్‌ కోసమని మేం నాలుగుసార్లు కలిశాం. మూడుసార్లు తను కొందరు స్నేహితుల్ని తీసుకొచ్చాడు.

Updated : 27 Jan 2024 07:18 IST

 

మూడునెలల కిందట ఒకబ్బాయితో నిశ్చితార్థమైంది. వచ్చే నెలలోనే మా పెళ్లి. ఈ మధ్యలో లంచ్‌ కోసమని మేం నాలుగుసార్లు కలిశాం. మూడుసార్లు తను కొందరు స్నేహితుల్ని తీసుకొచ్చాడు. అందులో అమ్మాయిలూ ఉన్నారు. వాళ్లతో నా ముందే సన్నిహితంగా ఉండటం.. జోకులేసుకోవడం లాంటివి చేశారు. ‘అలా చేయడం నాకు నచ్చదు’ అని మెసేజ్‌ చేశా. ‘ఈరోజుల్లో ఇవన్నీ కామన్‌’ అనడమే కాదు.. ‘నా గతం గురించి నువ్వు అడగొద్దు.. నీది నేను అడగను’ అన్నాడు. అప్పట్నుంచి నాకు లేనిపోని అనుమానాలు మొదలయ్యాయి. పెళ్లి తర్వాత కూడా తను వేరే అమ్మాయిలతో క్లోజ్‌ ఉంటాడేమో అనిపిస్తోంది. సంబంధం వదులుకోవాలా?  

 ఎస్‌.ఆర్‌.ఆర్‌., ఈమెయిల్‌

పెళ్లనేది ఇద్దరు వ్యక్తుల నమ్మకంపై నిలబడే బంధం. పాత రోజుల్లో ఒక సంబంధం వెతుకుతున్నప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలనేవాళ్లు. వీటితో ఒక మనిషి వ్యక్తిత్వం, ఆలోచనా ధోరణి, పెరిగిన కుటుంబ వాతావరణం తెలిసిపోతుంది అనుకునేవాళ్లు. కుటుంబ ఆచార వ్యవహారాలు, జీవనశైలి, ఆలోచించే తీరు, నైతిక విలువలు.. ఇవన్నీ కుదరకపోతే ఆ జంట మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ల నమ్మకం. ఇప్పటి జనరేషన్‌ అటు ఏడుతరాలు, ఇటు ఏడు తరాలు చూడకపోయినా కనీసం పెళ్లి చేసుకునే వ్యక్తి జీవనశైలి, ఆలోచనా విధానం.. సరిపోతాయో, లేదో తప్పకుండా చూసుకోవాలి.

మీ విషయానికొస్తే.. మీరు చెప్పేదాన్ని బట్టి అతడు బాగా సోషలైజ్‌ పర్సన్‌లా ఉన్నాడు. అలా ఉండటం పెద్ద తప్పేం కాదు. అతడు పెరిగిన వాతావరణం, పాశ్చాత్య సంస్కృతుల ప్రభావంతో అలా ఉండొచ్చు. అలాంటి వాళ్లు కచ్చితంగా వేరే అమ్మాయిలకి సన్నిహితం అవుతారనీ చెప్పలేం. అయితే ‘నా గతం గురించి నువ్వు అడగొద్దు. నీ గతం గురించి నేను అడగను’ అనే మాట పెళ్లి బంధం పట్ల అతడికున్న తేలిక భావం తెలుపుతోంది. అతడి వ్యవహారశైలిని బట్టి చూస్తే పెళ్లి అనేది ఎలాంటి ఎమోషన్‌ లేని తేలికైన వ్యవహారంగా భావిస్తున్నాడు. నా భర్త నాతోనే సన్నిహితంగా ఉండాలనుకోవడం.. ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడం.. ఒకరికొకరు ప్రాముఖ్యం ఇవ్వాలనుకోవడం సహజం. మీ కోరికని తప్పు పట్టడానికేం లేదు. అతడి శైలిపై మీకు రెండు రకాల అభ్యంతరాలున్నాయని అర్థమవుతోంది. ఈ విషయాల్ని మీ అమ్మానాన్నలతో స్పష్టంగా, నిర్భయంగా చెప్పండి. అతడేమైనా మారే అవకాశముందా పరిశీలించండి. నిశ్చితార్థం అయ్యింది కదా.. సర్దుకుపోవాలి.. అనుకోవడం కరెక్ట్‌ కాదు. అలా చేస్తే.. జీవితాంతం బాధ పడాల్సి వస్తుంది. పెళ్లనేది నూరేళ్ల బంధం. సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. ఆల్‌ ది బెస్ట్‌.                      

- డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని