Manalo Manam: నేను చేస్తోంది.. మోసమా?

నేనిప్పుడు బీటెక్‌ ఫైనలియర్‌. నా క్లాస్‌మేట్‌తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నా. మా ఇద్దరికీ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగాలొచ్చాయి.

Updated : 30 Sep 2023 10:27 IST

నేనిప్పుడు బీటెక్‌ ఫైనలియర్‌. నా క్లాస్‌మేట్‌తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నా. మా ఇద్దరికీ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగాలొచ్చాయి. జాబ్‌లో చేరాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. సమస్య ఏంటంటే.. కొన్నాళ్ల కిందట నాకు మరో అబ్బాయి ప్రపోజ్‌ చేశాడు. మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత తను రోజూ రోజాలు పంపడం.. బహుమతుల్లో ముంచెత్తడం చేసేవాడు. చివరికి స్నేహితుల్లా అయినా ఉందాం అంటే ఓకే అన్నాను. కలిసి సినిమాలు, రెస్టరంట్లకు వెళ్తున్నాం. ఇప్పుడు ఒక్కోసారి నా క్లాస్‌మేట్‌ని మోసం చేస్తున్నానా? అనే ఫీలింగ్‌ కలుగుతోంది. మరోసారి కలిసి తిరిగితే తప్పేంటి అనిపిస్తుంటుంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నా. సలహా ఇవ్వండి.

ఓ పాఠకురాలు, ఈమెయిల్‌

నం సహజంగానే కొత్త విషయాలకు ఆకర్షితులవుతుంటాం. అందులోనూ మనుషులు, అపోజిట్‌ సెక్స్‌కి ఆకర్షితులవడం మరీ సహజం. అయితే ఆకర్షణ వేరు, ప్రేమ వేరు. మీరు ఇదివరకే ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. మరి ఈ కొత్త అబ్బాయిలో ఇప్పుడు కొత్తగా ఏం నచ్చుతోంది? ఎందుకు దగ్గరవుతున్నారు? పూలు ఇవ్వడం, కలిసి తిరగడం.. అనేది అక్కడితో ఆగిపోదు. ఇంకా ముందుకెళ్లే ప్రమాదం ఉంటుంది. ఆకర్షణ వ్యామోహంలా మారుతుంది. మొదటి అబ్బాయిని మోసం చేస్తున్నాను అనే ఫీలింగ్‌ కూడా మీలో కలిగింది అంటే.. మీరు తప్పు చేస్తున్నాను అనే భావనలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. రెండు పడవలపై ప్రయాణం ప్రమాదకరమే.

మొదటి అబ్బాయి, మీరు ఒకర్నొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. తను ఎమోషనల్‌గా మీపై ఆధారపడి ఉంటాడు. రెండో అబ్బాయి వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి వస్తే.. మొదటి వ్యక్తికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది. అతడితో బంధానికి అర్థవంతమైన ముగింపు ఇవ్వాలి. లేదూ.. మీది కేవలం స్నేహం.. కలిసి తిరగడంలో తప్పేంటి అని భావిస్తే.. మొదటి అబ్బాయి ఆమోదించగలిగేంత హద్దుల్లో ఉండాలి. రెండు బంధాలు కొనసాగించడం కొత్త సమస్యలు, మానసిక ఇబ్బందుల్లో చిక్కుకోకముందే.. అందులో ఒకటి వదులుకోవడమే మంచిది.

డా.గీతా చల్లా, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని