No-Makeup: నో మేకప్‌..ఇప్పుడిదే ట్రెండ్‌

సినిమా తారలంటేనే అందం. ఆ అందాన్ని మరింత సానబెట్టేది మేకప్‌. ఈ రెండూ కలిస్తే.. తారలు అభిమానులకు అప్సరసల్లాగే కనిపిస్తారు. అయితే చిత్రంగా ఈమధ్యకాలంలో కొందరు కథానాయికలు ‘నో మేకప్‌’ అంటున్నారు.

Published : 08 Apr 2023 03:26 IST

సినిమా తారలంటేనే అందం. ఆ అందాన్ని మరింత సానబెట్టేది మేకప్‌. ఈ రెండూ కలిస్తే.. తారలు అభిమానులకు అప్సరసల్లాగే కనిపిస్తారు. అయితే చిత్రంగా ఈమధ్యకాలంలో కొందరు కథానాయికలు ‘నో మేకప్‌’ అంటున్నారు. మొహానికి మెరుగులు అద్దకుండానే చిత్రాలు తీసి చిత్రంగా సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. ఇంతలోనే ఎంత మార్పు? అని ఆరా తీస్తే.. ఈ ట్రెండ్‌ని సెట్‌ చేసినవాళ్లలో అంతా పెద్ద కథానాయికలే కనిపిస్తున్నారు. ‘రాజీ’, ‘గంగూభాయ్‌ కఠియావాడీ’లాంటి సినిమాలతో మెప్పించిన అలియాభట్‌ ఎలాంటి మేకప్‌ వేసుకోకుండా ‘సహజమైన అందానికే నా ఓటు’ అంటూ ఉదయపు కాంతి ఎండలో సేదతీరుతున్న ఫొటోల్ని ఇన్‌స్టాలో పెట్టేసింది. ‘దేవదాసు’తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టి టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా మేకప్‌తో కనిపించడమే అరుదైపోయింది. అందాల అనుష్క, ఒకప్పటి టాప్‌ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌లు.. అంతఃసౌందర్యమే అసలైన అందం అని ఎప్పుడో చెప్పి నో మేకప్‌ ఫొటోల్ని పంచుకున్నారు. నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి అయితే మేకప్‌ లేనప్పుడే నాలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుందని ఈమధ్యే చెప్పింది.  అంతకుముందు తను నటించిన సినిమాల్లోనూ అదే పని చేసి చూపించింది. దీనికితోడు ఓవర్‌ మేకప్‌ కొన్నిరకాల చర్మ సమస్యలకు కారణం అవుతుందని సౌందర్య నిపుణులు సెలవిస్తూనే ఉన్నారు. ఏదేమైనా.. ఎప్పుడు మొదలైనా.. ఈ ట్రెండ్‌ మాత్రం ఈమధ్యకాలంలో ఊపందుకుంటోంది. అందం సింగారంలో కాదు.. చూసే కళ్లలో ఉంటుందని వాళ్లు చెబుతున్న మాటల్ని అమ్మాయిలూ అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్క విషయం.. కొత్తగా తెరంగేట్రం చేస్తున్న భామలు ఒక్కరంటే ఒక్కరు ఈ గోదాలోకి దిగడం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు