Andhra News: ‘నాపై దాడి చేసింది తెదేపా వారే’: వైకాపా ఎమ్మెల్యే వెంకట్రావు

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడి ఘటనపై గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు.

Updated : 01 May 2022 06:26 IST

ఏలూరు: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడి ఘటనపై గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జి.కొత్తపల్లిలో వైకాపా నేతలు, కార్యకర్తలు తనపై దాడి చేయలేదని, తెదేపా వారే దాడి చేయించారని ఆరోపించారు. స్థానిక తెదేపా నేతలే వెనక ఉండి దాడి చేయించారన్నారు. జి.కొత్తపల్లిలో వైకాపా నేతల మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని, వారి మధ్య వివాదం రాజీ చేసినట్లు చెప్పారు. గంజి ప్రసాద్‌ హత్యపై దర్యాప్తునకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

జి.కొత్తపల్లిలో ఇవాళ వైకాపా నాయకుడు గంజి ప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వైకాపా నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పార్టీలోని మరో వర్గం అడ్డుకొని దాడికి దిగింది. ఎమ్మెల్యేను వెంబడించి ఓ ప్రాంతంలో వైకాపా వర్గీయులు చుట్టుముట్టి పిడిగుద్దుల వర్షం కురిపించారు. పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచి అతి కష్టం మీద ఆయనను పక్కకు తీసుకెళ్లారు. కొన్ని గంటల పాటు పాఠశాలలోనే దిగ్బంధించారు. పోలీసులు భారీగా మోహరించి ద్విచక్రవాహనంపై ఎమ్మెల్యేను గ్రామం దాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని