AP Highcourt: హైకోర్టు న్యాయమూర్తులుగా కె.మన్మథరావు, బీఎస్‌ భానుమతి ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్‌ కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి శ్రీ భానుమతి ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర వీరిద్దరితో బుధవారం...

Updated : 09 Dec 2021 04:36 IST


హైకోర్టు న్యాయమూర్తులుగా కె.మన్మథరావు, బీఎస్‌ భానుమతిల చేత ప్రమాణం
చేయిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర (మధ్యలో)

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్‌ కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి శ్రీ భానుమతి ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర వీరిద్దరితో బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణం చేయించారు. మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఏవీ రవీంద్రబాబు.. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. ఆ ఉత్తర్వుల పత్రాలను ప్రధాన న్యాయమూర్తి.. కొత్తగా నియమితులైన జడ్జిలకు అందజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్‌ కె.మన్మథరావు... జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్‌ బీఎస్‌ భానుమతి పాల్గొని వ్యాజ్యాలను విచారించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, నూతన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, ఏజీ శ్రీరామ్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, ఏఎస్‌జీ హరినాథ్‌, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులకు పలువురు న్యాయవాదులు, బంధువులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. జస్టిస్‌ మన్మథరావు, జస్టిస్‌ భానుమతి రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని